ట్రిపుల్‌ తలాక్‌; కేసు వెనక్కి తీసుకోనందుకు..

UP Woman File Triple Talaq Case Her Nose Allegedly Cut Off By In Laws - Sakshi

లక్నో : ట్రిపుల్‌ తలాక్‌ కేసును వెనక్కి తీసుకోవడానికి అంగీకరించని కోడలిపై అత్తింటివారు అమానుష చర్యకు పాల్పడ్డారు. ఆమె ముక్కు కోసి.. దారుణంగా హింసించారు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాలు...తన భర్త ఫోన్‌లో ట్రిపుల్‌ తలాక్‌ చెప్పడంతో ఆవేదన చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఓపికగా ఎదురు చూసినప్పటికీ తన భర్తలో మార్పు రాలేదని, అతడి మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఆమె అత్తింటివారు కేసు వాపసు తీసుకోవాల్సిందిగా కోరారు. అయితే బాధితురాలు ఇందుకు అంగీకరించకపోవడంతో తొలుత మాటలతో భయపెట్టారు. అయినప్పటికీ ఆమె లొంగకపోవడంతో ముక్కు కోసి అమానుషంగా ప్రవర్తించారు. 

కాగా ఈ కేసులో భార్యాభర్తల మధ్య సయోధ్య కుదుర్చడానికి గతంలో కౌన్సెలింగ్‌ ఇచ్చామని, అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలి ముక్కుపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై ట్రిపుల్‌ తలాక్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టం -2019 ప్రకారం ప్రకారం తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను క్రిమినల్‌ చర్యగా పరిగణిస్తారన్న విషయం విదితమే. నేరం నిరూపణ అయిన పక్షంలో నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. ఉభయ సభల్లో నెగ్గిన ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఆమోదం తెలపడంతో ఇటీవలే చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఈమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top