మానవత్వం పరిమళించిన వేళ..   

Police humanity - Sakshi

 57 మంది నిరాశ్రయులను ఆదుకున్న పోలీసులు

కరీంనగర్‌ క్రైం : కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. రోడ్లపై ఎలాంటి ఆధారం లేకుండా తిరుగుతున్న 57 మంది నిరాశ్రయులను ఆదుకున్నారు. కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్‌ సేఫ్టీ పబ్లిక్‌ పీస్‌ అనే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన పోలీసులు మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ, మతిస్థిమితం కోల్పోయి రోడ్లను ఆనుకొని ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులను ప్రత్యేక తనిఖీల్లో పట్టుకున్నారు.

వారికి ఉదయం క్షవరం, గడ్డం చేయించి నూతన వస్త్రాలు అందించారు. కుటుంబసభ్యుల ఆదరణ కరువై వివిధ రకాల సమస్యలతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికొచ్చి భిక్షాటన చేస్తున్నవారే కాకుండా.. మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తున్నవారు.. మైనర్‌ బాలలను పనుల నిమిత్తం తీసుకొచ్చి వదిలిపెట్టినవారు.. ఇలా అనేకమంది రోడ్ల పక్కన ఆశ్రయం పొందుతున్నారు. వారిని మంగళవారం పట్టుకొని పీటీసీకి తరలించారు.

వారికి భోజనం, నూతన వస్త్రాలు అందించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారు అందించిన సమాచారం మేరకు వారి బంధువుకుల సమాచారమందించారు. ఐదుగురు మైనర్లను జిల్లా బాలల సంరక్షణ కేంద్రానికి పంపించారు. 10 మంది పురుషులు, ఆరుగురు మహిళలను స్వదార్‌ హోంకు తరలించగా, 35 మందిని వారి స్వగ్రామాలకు పంపించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భద్రత.. శాంతియుత వాతావరణ నిర్మాణంలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్, కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరావు, తుల శ్రీనివాసరావు, ఆర్‌ఐ శేఖర్, పోలీసులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top