
అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ...
సాక్షి, చిత్తూరు : ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక అటవీ సరిహద్దు ప్రాంతాల్లో గజరాజులు హల్ చల్ చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా కుప్పం మల్లప్ప కొండ అటవీ ప్రాంతంలో మకాం వేసిన ఏనుగుల మంద ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రెండు గుంపులుగా విడిపోయిన గజరాజులు కొంగన పల్లి, చిన్న పర్తి కుంట, పెద్ద పర్తి కుంట, సంగన పల్లి, కొత్తూరు, గుడి వంక, గొల్లపల్లి ప్రాంతాల్లో మకాం వేశాయి. దీంతో ఈ అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
టమోటా, అరటి, బీన్స్, మొక్కజొన్న, ఉద్యానవన పంట పొలాలపై అర్థరాత్రి వేళల్లో వరుస దాడులకు పాల్పడి, రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రంగంలోకి దిగిన ఆంధ్ర, తమిళనాడు ఎలిఫెంట్ ట్రాకర్స్ ఈ ఏనుగులను తమిళనాడు, హోసూరులోని దట్టమైన లోతట్టు అటవీ సరిహద్దు ప్రాంతాల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.