రెండేళ్లు..100 ‘పీడీ’లు

PD Act On Gangsters And Chain Snatchers - Sakshi

రాచకొండ కమిషనరేట్‌లో నేరస్తులకు వణుకు

కరడుగట్టిన నేరగాళ్ల నుంచి చైన్‌స్నాచర్లు దాకా..

సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఏర్పడిన రెండేళ్లలో 100 మంది నిందితులపై పీడీ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) యాక్ట్‌ ప్రయోగించి నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. చైన్‌స్నాచర్లు, రౌడీషీటర్లు, తరచూ చోరీలకు పాల్పడే దొంగలు, సైబర్‌ నేరగాళ్లు, మాదక ద్రవ్య నేరగాళ్లు, నకిలీ విత్తనాల కేటుగాళ్లు, భూకబ్జా రాయుళ్లు వరకు ఈ చట్టాన్ని ప్రయోగించి ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. తొలుత గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరులపై పీడీ చట్టాన్ని ప్రయోగించిన పోలీసులు.. అభం శుభం తెలియని బాలికలను ఉపాధి పేరిట నగరానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వారిపైనా ఈ తరహా కేసులు నమోదు చేశారు. ఈ చట్టం ప్రయోగిస్తే ఏడాదిపాటు జైలుకే పరిమితం కావాల్సి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే నేరాలు అదుపులోకివస్తున్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన రాపోలు వెంకట శివకుమార్‌ అలియాస్‌ శివ బీటెక్‌ కోర్సు మధ్యలోనే ఆపేసి ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. భార్య శాంతితో కలిసి వ్యభిచారాన్ని వ్యాపారంగా ఎంచుకున్నారు.  చెంగిచెర్ల ఎంఎల్‌ఆర్‌ కాలనీలో గది అద్దెకు తీసుకొని అమ్మాయిలను ఏపీనుంచి రప్పించి వ్యభిచార దందాకు తెరలేపారు. పోలీసులు దాడులు చేయడంతో మకాన్ని బోడుప్పల్‌లోని రాఘవేంద్రనగర్‌ కాలనీకి మార్చి వ్యవహారం కొనసాగించారు. ఈ విషయం తెలిసి పోలీసులు దాడులు చేయడంతో తప్పించుకపారిపోయిన ఈ దంపతులు పోలీసులకు ఎట్టకేలకు చిక్కి చర్లపలి జైల్లో ఊచలు లెక్కెడుతున్నారు. వీరు మళ్లీ బయటకు వచ్చినా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే అవకాశం ఉండటంతో ఈ దంపతులపై శనివారం పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. 

అభం శుభం తెలియని అమ్మాయిలకు ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామంటూ నగరానికి తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపుతున్న వీరిపై రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తాజాగా తీసుకున్న చర్యలతో పీడీ యాక్ట్‌లు విధించిన నేరగాళ్ల సంఖ్య 100కు చేరుకుంది. ఉమ్మడి సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ నుంచి రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఏర్పడి రెండేళ్లు పూర్తి కావడం...ఇప్పటివరకు ఏకంగా 100 మంది నిందితులపై పీడీ (ప్రివెంటివ్‌ డిటెన్షన్‌) యాక్ట్‌ ప్రయోగించి నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. చైన్‌స్నాచర్, రౌడీషీటర్లు, తరచూ చోరీలకు పాల్పడే దొంగలు, సైబర్‌నేరగాళ్లు, మాదక ద్రవ్య నేరగాళ్లు, నకిలీ విత్తనాల కేటుగాళ్లు, భూకబ్జారాయుళ్లు, వ్యభిచార గృహ నిర్వాహకులు నుంచి మొదలుకొని బడా నేరస్తుల వరకు జైలు నుంచి బయటకు రాకుండా నియంత్రిస్తూ నేరాలు అదుపు చేసే దిశగా పనిచేస్తున్నారు.  

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరులపై కూడా...
2016 ఆగస్టు ఎనిమిదిన పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరులను కూడా వదిలిపెట్టడం లేదు. హత్యలు, మోసాలు, కిడ్నాప్‌లు, బెదిరింపు డబ్బు వసూళ్లు, భూ కబ్జాలకు పాల్పడిన  శ్రీధర్‌ గౌడ్, సామసంజీవరెడ్డి, పొలిమెటి శ్రీహరిపై కూడా సీపీ మహేశ్‌ భగవత్‌ అవే చర్యలు తీసుకున్నారు. హత్యలు, మోసాలు, ఫోర్జరీ, భూకబ్జాలు చేస్తూ గుండాయిజం చేస్తున్న బైరు రాములు గౌడ్, లక్ష్మణ్‌ గౌడ్, యెగ్గె భిక్షపతిలపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి చర్లపల్లి జైలుకే పరిమితం చేశారు. దీనిద్వారా ఎటువంటి కరుడుగట్టిన నేరస్తుడినైనా వదిలేదే లేదని, నేరం చేసి అరెస్టు కావడం, బెయిల్‌ పొంది బయటకు రావడం, మళ్లీ పంథా కొనసాగించేవారిని ఉపేక్షించేదే లేదని సీపీ తన చర్యల ద్వారా చెబుతున్నారు.   

జైలుకే పరిమితం చేస్తున్నారు...
ఇప్పటికే రాచకొండలో దాదాపు 100 మంది వరకు కరుడు గట్టిన నేరగాళ్లు జైల్లోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ చట్టం ప్రయోగిస్తే ఏడాదిపాటు జైలుకే పరిమితం కావాల్సి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే నేరాలు కొంతమేర అదుపులోకి వస్తున్నాయి.  ఉమ్మడి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ ప్రణాళికలో భాగంగా ఈ వ్యవహరాన్ని తీవ్రంగా పరిగణించి పీడీ యాక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అయితే రెండేళ్ల క్రితం సైబరాబాద్‌ కమిషనరేట్‌ విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన రాచకొండ పోలీసు కమిషనరేట్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్‌ భగవత్‌ కూడా అదే పంథాతో ముందుకెళుతున్నారు.

కోర్టు మానిటరింగ్‌పై ప్రత్యేక దృష్టి...
కోర్టుల్లో కేసులను రుజువు చేసే దిశగా ‘కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్‌’ను అమలు చేయడంపై సీపీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఏదైనా కేసులో ఎఫ్‌ఐఆర్, అభియోగపత్రం దాఖలు చేసినప్పటి నుంచి  తుది తీర్పు వచ్చేవరకు పకడ్బందీగా పర్యవేక్షణ ఉండేలా ఫోకస్‌ పెట్టారు.

నేరగాళ్లపై కఠిన చర్యలు...రాచకొండలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాలు నిరోధించాలనే లక్ష్యంతో పీడీ యాక్ట్‌ను సమర్థంగా అమలుచేస్తున్నాం. ఆన్‌లైన్‌ ద్వారా మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు, సామాన్యుల్ని ఇబ్బంది పెడుతున్న రోజువారీ వడ్డీ వ్యాపారులు, చిట్‌ఫండ్‌ మోసాలకు పాల్పడుతున్నవారిపైనా కూడా ప్రయోగిస్తున్నాం. ఇప్పటికే మహిళల్ని వేధిస్తున్న పొకిరీలపై కూడా పీడీ యాక్ట్‌ నమోదు చేశాం. అమాయక యువతులను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న నిర్వాహకులపై పీడీ యాక్ట్‌లు ప్రయోగించి మరోసారి నేరాలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం.
–మహేష్‌ భగవత్,రాచకొండ పోలీసు కమిషనర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top