టీచరమ్మపై తరగతి గదిలోనే దాడి

Parents Attack On Teacher In Class Anantapur - Sakshi

కటారుపల్లి(గాండ్లపెంట): మండల పరిధిలోని కటారుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థిని మందలించినందుకు ఉర్దూ టీచర్‌ ఎస్‌.నఫీసా సుల్తానాపై గురువారం కటారుపల్లి గొల్లపల్లికి చెందిన ఆదెప్ప, ఆ కుటుంబసభ్యులు దాడి చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ కొట్టారని, చీర, జాకెట్‌ చింపేశారని ఆ టీచర్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం 3వ తరగతి విద్యార్థి హర్ష అల్లరి చేస్తుంటే మందలించినందుకే వారింతటి ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వాపోయారు.

ఉదయం 9 గంటలకు ఇద్దరు పురుషులు వచ్చి అసభ్య పదజాలంతో తిట్టివెళ్లారని, మరికొద్దిసేపటికే ఆదెప్ప, మరో ఇద్దరు పురుషులు, నలుగురు మహిళలు తాను పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి వచ్చి దాడి చేశారని ఆమె ఆవేదన చెందారు. వారితో తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమణమ్మ సైతం ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని అందులో కోరారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి
ఉపాధ్యాయురాలిపై కీచకపర్వాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. తరగతి గదిలో చదువు చెబుతున్న ఉర్దూ ఉపాధ్యాయురాలు నఫీసా సుల్తానాపై అకారణంగా దాడి చేసి, అవమానపరచిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌టీఎఫ్, ఎస్‌టీ యూ, ఏపీటీఎఫ్, పీఆర్‌టీయూ మండల నాయకులు ఆంజినేయులు, రామ్మోహన్, ఆదిబయన్న, సుబ్బారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు డిమాండ్‌ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top