నేను పదేళ్ల క్రితం మర్డర్‌ చేస్తే ఇప్పటికీ బయటకు రాలేదు... | Murder Case Reveals After Ten Years in Hyderabad | Sakshi
Sakshi News home page

దాగని నిజం..

Aug 15 2019 8:18 AM | Updated on Aug 15 2019 8:18 AM

Murder Case Reveals After Ten Years in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పదేళ్ల వయస్సులో కడప నుంచి నగరానికి వలస వచ్చాడు. టీవెండర్‌ గా జీవితం ప్రారంభించి నేరగాడిగా మారాడు. చోరీ సొత్తు పంపకాల్లో తలెత్తిన విభేదాల కారణంగా పదేళ్ల క్రితం సైబరాబాద్‌ పరిధిలో హతమయ్యాడు... ఇన్నేళ్లు మిస్టరీగా మిగిలిన ఈ హత్య కేసును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించారు. రూ. 2 లక్షలు సుపారీ ఇచ్చిన సూత్రధారితో పాటు, హత్యకు పాల్పడిన వారిలో ఒకరిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం వివరాలు వెల్లడించారు.  

జల్సాలకు అలవాటు పడి...
కడప పట్టణం శ్రీదేవి కాలనీకి చెందిన ఎస్‌కే బాష పదేళ్ల వయస్సులో 1994లో నగరానికి వలసవచ్చాడు. పార్శిగుట్టలో ఉంటూ పరిసర ప్రాంతాల్లో టీ అమ్మే వాడు. టీ అమ్మకాలతో వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో ఇళ్లల్లో చోరీలకు శ్రీకారం చుట్టాడు. చిలకలగూడ, చిక్కడపల్లి, నార్సింగి, బాలానగర్, రాజేంద్రనగర్, సరూర్‌నరగ్, ఉప్పల్‌ ఠాణాల పరిధుల్లో పంజా విసిరాడు. 2001లో అరెస్టైన ఇతడికి చంచల్‌గూడ జైలులో పార్శిగుట్టకు చెందిన పాత నేరస్తుడు పట్నాటి శ్రీనుతో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా మరో ఇద్దరు నేరగాళ్లు బండ్లగూడ, దూద్‌బౌలి వాసులు మహ్మద్‌ వశీం, అల్లం సురేష్‌తో స్నేహం కుదిరింది.  

‘వ్యక్తిగత’ జీవితంలోకి రావడంతో...
జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత బాష తాను చోరీ చేసిన సొత్తును పల్నాటి శ్రీను ద్వారా విక్రయించి ఇద్దరూ పంచుకునే వారు. ఆయితే ఆతర్వాత పంపకాల విషయంలో వారి స్పర్థలు వచ్చాయి. బాష చోరీ సొత్తును శ్రీను ద్వారా కాకుండా మరో మహిళ ద్వారా విక్రయిస్తుండటంతో ఇవి మరింత ఎక్కువయ్యాయి. అంతేగాక శ్రీను గర్ల్‌ఫ్రెండ్‌తో బాష సన్నిహితంగా ఉండటం, ఆమె తనను దూరంగా పెడుతుండటంతో శ్రీను అతడిపై పగ పెంచుకున్నాడు. బాష అడ్డు తొలగించుకోవాలని భావించిన అతను ఈ విషయాన్ని అల్లం సురేష్, వశీంలకు చెప్పాడు. బాషాను హత్య చేస్తే రూ.2 లక్షలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు.  

పార్టీ పేరుతో తీసుకువెళ్లి...
దీనికి అంగీకరించిన సురేష్, వశీం 2009 మే 9న రంగంలోకి దిగారు. పార్శిగుట్టకు వెళ్ళిన సురేష్‌ పార్టీ చేసుకుందామంటూ బాషను తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. బహదూర్‌పుర చౌరస్తాలో వశీం కూడా వీరితో కలిశాడు. ముగ్గురూ ఒకే బైక్‌పై ఆరామ్‌ఘర్‌ చౌరస్తాకు వచ్చి అక్కడి ఓ బారులో మద్యం తాగారు. అయితే ఉద్దేశపూర్వకంగా బాషతో ఎక్కువ తాగించారు. అక్కడి నుంచి బైక్‌పై శంషాబాద్‌ వైపు వెళ్ళారు. రాళ్లగూడ గ్రామ సమీపంలో ఓఆర్‌ఆర్‌ అప్రోచ్‌ రోడ్‌ దాటి వంద మీటర్లు లోపలికి తీసుకువెళ్ళారు. నిర్మానుష్య ప్రాంతానికి బాషను తీసుకువెళ్లిన వీరు మరోసారి అతడితో మద్యం తాగించారు. అనంతరం సురేష్‌ తన వద్ద ఉన్న తాడుతో బాష మెడకు ఉరి బిగించాడు. కిందపడిన బాషపై వశీం బండరాయితో మోది హత్య చేశాడు. అనంతరం పథకం ప్రకారం మృతదేహం ఆనవాళ్ళు చిక్కకుండా అతడి వస్త్రాలు విప్పేసి, ముఖంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మర్నాడు ఈ విషయం శ్రీనుకు చెప్పగా అతడు నమ్మలేదు. దీంతో ఇద్దరూ అతడిని హత్యాస్థలికి తీసుకువెళ్లి మృతదేహాన్ని చూపించారు. అదే రోజు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హతుడు, హంతకుల ఆచూకీ తెలియకపోవడంతో కేసు మూసేశారు. అప్పటి నుంచి నిందితులు ముగ్గురూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

భార్యను బెదిరించి..
ఇటీవల తన భార్యపై దాడి చేసిన వశీం ఆవేశంలో నోరు జారాడు. ‘నేను పదేళ్ల క్రితం ఓ మర్డర్‌ చేస్తే ఇప్పటికీ బయటకు రాలేదు... జాగ్రత్త’ అంటూ బెదిరించాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు చేరింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌ వర్మ, వి.నరేందర్, మహ్మద్‌ థక్రుద్దీన్‌ రంగంలోకి దిగారు. వశీంను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. దీంతో అతడితో పాటు సురేష్‌ను పట్టుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న సూత్రధారి శ్రీను కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement