
కాలిఫోర్నియా: అపహరణకు గురైన ప్రముఖ ఎన్నారై మిలినీయర్ తుషార్ ఆత్రే తన బీఎండబ్ల్యూ కారులో విగతజీవిగా దొరికారు. కాలిఫోర్నియా శాంటా క్రూజ్‌లోని తన నివాసం నుంచి దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఆయనను కిడ్నాప్ చేశారు. 50 ఏళ్ల తుషార్ అత్రే ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఆత్రే నెట్ ఐఎన్‌సీ అధిపతి. ఆయన చివరిసారిగా తెల్లరంగు బీఎండబ్ల్యూ కారులోకి ఎక్కుతూ సీసీటీవీ కెమెరాల్లో కనిపించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న తన విలాసవంతమైన నివాసం నుంచి ఆత్రేను దుండగులు తెల్లవారుజామున 3 గంటల అపహరించారు.
అదే సమయంలో ఆత్రే నివాసం నుంచి ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ కాల్ వచ్చిందని, జరిగిన నేరం గురించి ఆత్రే సంబంధికులు ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆత్రే బీఎండబ్ల్యూ కారును శాంటా క్రజ్ కొండప్రాంతాల్లో గుర్తించారు. కారులో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని మొదట పేర్కొన్న పోలీసులు.. చనిపోయింది తుషార్ ఆత్రేనని బుధవారం నిర్ధారించారు. ఇది దోపిడీ కేసు అయి ఉండొచ్చునని, ఈ కేసులో కనీసం ఇద్దరు నిందితులు ఉండి ఉంటారని అనుమానిస్తున్నామని శాంటా క్రూజ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొంది.