మూడు నెలలకే మృత్యువాత

Married Woman Suspicious death In Guntur - Sakshi

పెళ్లైన మూడు నెలలకే వివాహిత అనుమానాస్పద మృతి

జ్వరంతో మృత్యువాత పడిందన్న భర్త

వరకట్న వేధింపులే

కారణమంటున్న మృతురాలి కుటుంబీకులు

గుంటూరు, కంకిపాడు: కాళ్ల పారణి ఆరక ముందే ఓ ఇంటి దీపం ఆరిపోయింది. పెళ్లైన ఆనందం.. ముచ్చట మూడు నెలల్లోనే ఆవిరైంది. కోటి ఆశలతో మెట్టినింటికి పంపిన తమ బంగారపు బొమ్మను విగత జీవిగా చూసిన ఆ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు.  

పెళ్లయిన మూడునెలలకే ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన  కంకిపాడు పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ దనియాల పేటకు చెందిన వరుసు కృపాదేవి(19)కి కంకిపాడు పులిరామారావు నగర్‌ వడ్రుపేటకు చెందిన తిరుమలకొండ ప్రభుకుమార్‌తో ఈ ఏడాది జులై 7న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ. 1 లక్ష నగదు, బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు.

జ్వరంతో బాధపడుతుందని..
అయితే శనివారం సాయంత్రం జ్వరంతో బాధపడుతుందని కృపాదేవిని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రభుకుమార్‌ తీసుకెళ్లారు. అదే సమయంలో ఆమె తల్లి పద్మకు  ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. 5.30 గంటలకు సీరియస్‌గా ఉందని, రాత్రి 7.30 గంటలకు కృప చనిపోయిందని తెలియజేశారు. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు హుటాహుటిన కంకిపాడుకు చేరుకున్నారు.

పోలీసుల విచారణ..
సమాచారం అందుకున్న ఎస్‌ఐ షరీఫ్, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పది రోజులు క్రితం గుడివాడ వచ్చిన ప్రభుకుమార్‌ మృతురాలి తల్లిని కొట్టాడని, ఇంటి తలుపులు ధ్వంసం చేశాడని బంధువులు పోలీసులకు వివరించారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతుందని, ఆస్పత్రికి తీసుకెళితే చికిత్స పొందుతూ మృతి చెందిందని చెప్పారు.

వరకట్నం కోసం కొట్టి చంపారు..
అదనపు కట్నం కోసం వేధించి, చివరికి కొట్టి చంపారంటూ మృతురాలు కృపాదేవి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడలోని తమ స్థలంలో వాటా కోసం వేధించారని వివరించారు. జ్వరంతో బాధపడుతూ చనిపోయే అవకాశం లేదని, కొట్టారని, చేతులు కణుతులు వాచాయని వివరించారు.  2012లో తన భర్త వెంకటేశ్వరరావు చనిపోతే తన ముగ్గురు ఆడ పిల్లలను సాకి వివాహాలు చేశానని, తన చిన్న కుమార్తె కృపాదేవి మృతికి అత్తింటి వారి వేధింపులే కారణమంటూ తల్లి ఒరుసు పద్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top