ఆస్పత్రిలో ఉరేసుకున్న వివాహిత

A Married Woman Suicidal Who Is Being Treated In Hospital - Sakshi

అనారోగ్యమే కారణం

సాక్షి, నెల్లూరు (క్రైమ్‌): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత ఆస్పత్రిలోనే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీజీహెచ్‌లో శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. ఇందుకూరుపేటకు చెందిన రమేష్,  విజయలక్ష్మి (34) దంపతులు. వీరికి 14 ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహానికి ముందు నుంచే విజయలక్ష్మి నెమ్ము, ఆయాసం సమస్యలతో  బాధ పడుతోంది. ఎక్కడ చూపించినా ఆరోగ్యం కుదుట పడలేదు. రెండేళ్ల నుంచి మధుమేహంతో బాధపడుతోంది. భార్యకు క్రమం తప్పకుండా వైద్యం చేయిస్తున్నారు.

ఈ నేపథ్యంలో 15 రోజుల కిందట విజయలక్ష్మికి తీవ్ర జ్వరం రావడంతో భర్త, విజయలక్ష్మి తల్లి వేదవల్లి, సోదరుడు బాలాజీ ఆమెను నగరంలోని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జ్వరం తగ్గలేదు. పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రమేష్‌ ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్య పరీక్షల్లో ఆమెకు టీబీ సోకిందని నిర్ధారణ అయింది. దీంతో విజయలక్ష్మి మనస్థాపానికి గురైంది. శుక్రవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తాను చికిత్స పొందుతున్న వార్డుకు ఎదురుగా ఉన్న వార్డులోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం తెల్లవారు జామున రమేష్‌కు మెలకువ వచ్చి భార్య కోసం వార్డులోకి వెళ్లగా అక్కడ ఆమె కనిపించలేదు.

దీంతో రమేష్‌ తన బావమరిది బాలాజీని లేపి అందరూ కలిసి ఆమె కోసం వెతుకులాడగా మరో వార్డులో ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యపై ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట ఎస్సై జిలానీ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రభుత్వ వైద్యులు మృత దేహానికి శవపరీక్ష నిర్వహించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ జిలాని కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top