గంజాయి దందా గుట్టురట్టు! | Marijuana Smuggling gang Arrest in Hyderabad | Sakshi
Sakshi News home page

గంజాయి దందా గుట్టురట్టు!

Feb 5 2019 11:00 AM | Updated on Feb 5 2019 11:00 AM

Marijuana Smuggling gang Arrest in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయించేందుకు యత్నిస్తున్న ముఠా గుట్టును తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 42 కేజీల గంజాయి, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా, మణుగూరుకు చెందిన కె.సత్యనారాయణ కిరాణా దుకాణం నిర్వహించేవాడు. ఈ రకంగా వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడి దృష్టి గంజాయి దందాపై పడింది. ఏజెన్సీ ఏరియా నుంచి గంజాయి సేకరించి హైదరాబాద్‌కు రవాణా చేసి లాభాలు ఆర్జించాలని భావించాడు. ఇందుకుగాను అతను తూర్పు గోదావరి జిల్లా, మండపేటకు చెందిన హరిబాబు, ఎం.ప్రసాద్‌లను సంప్రదించాడు.

ఏజెన్సీ నుంచి గంజాయి సేకరించి సహకరించడానికి కమీషన్‌ పద్దతిలో వీరు అంగీకరించారు. ఆపై సత్యనారాయణ తన బాల్యమిత్రులు కె.శేషు, సమీప బంధువు కె.రామానంద్‌లను కలిసి ఈ అక్రమ దందాలో సహకరించాలని కోరాడు. వారు అందుకు అంగీకరించడంతో కొన్ని రోజుల క్రితం విశాఖ ఏజెన్సీ నుంచి హరిబాబు, ప్రసాద్‌ సాయంతో కేజీ రూ.1500 చొప్పున 42 కేజీల గంజాయి ఖరీదు చేశాడు. శేషును హైదరాబాద్‌కు వెళ్లి కస్టమర్లను చూడాల్సిందిగా సత్యనారాయణ సూచించడంతో అతడు నగరానికి చేరుకున్నాడు. సోమవారం సరుకు తీసుకుని మిగిలిన నలుగురూ కారులో నగరానికి వచ్చి పూసలబస్తీలోని రామానంద్‌ ఇంట్లో బస చేశారు. గంజాయిని ప్యాక్‌ చేసి తీసుకురావడంతో ఎవరికీ అనుమానం రాకుండా సత్యనారాయణ జాగ్రత్తలు తీసుకున్నాడు. తన కారు డిక్కీ అడుగు భాగంలో ప్రత్యేక అరను ఏర్పాటు చేసి అందులో గంజాయి రవాణా చేశాడు. దీనిపై సమాచారం అందడంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ నేతృత్వంలో ఎస్సైలు జి.శ్రీనివాసరెడ్డి, పి.రమేష్, గోవింద్‌ స్వామి, సి.వెంకటేష్‌ తమ బృందాలతో వలపన్ని ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement