యువకుడి హత్య

Man Murdered In Guntur - Sakshi

మహిళతో వివాహేతర సంబంధమే కారణం!

ఆమె భర్తే హతమార్చినట్లు సమాచారం

చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. సమీప బంధువు భార్యతో ఆ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్వారీలో విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట వస్తున్న యువకుడిని ఆగంతకులు దారికాచి మారణాయుధాలతో దాడిచేసి హతమార్చారు.

గుంటూరు, చిలకలూరిపేటరూరల్‌: క్వారీలో విధులు నిర్వర్తించి తిరిగి వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారు జామున మండలంలో జరిగింది. రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా, సంతమాగులూరు మండలం, గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు(25) చిలకలూరిపేట పట్టణంలో నివసిస్తున్నాడు. యడవల్లిలోని గ్రానైట్‌ క్వారీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటిలాగానే మంగళవారం తెల్లవారు జామున విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై కోటప్పకొండ – చిలకలూరిపేట ఆర్‌ అండ్‌ బీ రహదారిపై నుంచి చిలకలూరిపేట పట్టణం వైపు వస్తున్నాడు. యడవల్లి గ్రామ శివారులోని కృపా గ్రానైట్స్‌ వద్ద పెద్ద బండరాయి వద్ద కాపు కాచిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేయడంతో అంజనీరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండేళ్ల కిందటే వివాహమైంది. సమాచారం తెలుసుకున్న సర్కిల్‌ సీఐ యు.శోభన్‌బాబు, రూరల్‌ ఎస్‌ఐ పి.ఉదయ్‌బాబు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడి సోదరుడు నూతలపాటి హరికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అన్నయ్య వరసయ్యే వ్యక్తే హతమార్చాడు!?
మృతుడు అంజనీరాజుకు గురిజేపల్లి గ్రామానికి చెందిన అన్నయ్య వరసయ్యే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏడాది కిందట అన్నా వదినలను విడదీసిన మృతుడు, చిలకలూరిపేట పట్టణంలో మరో గృహంలో వదినతో  నివాసం ఉంటూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై అనేక విడతలు సంఘ పెద్దలు, గ్రామస్తుల వద్ద పంచాయితీలు పెట్టారని సమాచారం. దీంతో తమ్ముడిపై కక్ష పెంచుకున్న అన్న మరో ఇద్దరితో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది.

ఫిర్యాదులో అనుమానితులుగానిందితుల పేర్లు!
మృతుడి తమ్ముడు ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించే నూతలపాటి హరికృష్ణ పోలీసులకు అందించిన ఫిర్యాదులో సైతం అన్నయ్య వరుసయ్యే వ్యక్తితో  పాటు మరో ఇద్దరి వ్యక్తులపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రూరల్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై సీఐను ప్రశ్నించగా, కేసును విచారిస్తున్నామని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top