కోరిక తీరాక కాదు పొమ్మన్నాడు

Man Held For Cheating A Woman In Machilipatnam - Sakshi

పెళ్లి చేసుకుంటానంటూ వివాహితను చేరదీసిన యువకుడు

ఆరేళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంచి ఆమెతో సహజీవనం

మోజుతీరాక మరో యువతితో పెళ్లికి సిద్ధం 

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం 

కోనేరు సెంటర్‌ (మచిలీపట్నం) : ఆమె వివాహిత.. ముగ్గురు పిల్లలు.. భర్తతో మనస్పర్ధలు రావటంతో ఒంటరిగా బతుకుతోంది. కూలీనాలీ చేసుకుంటూ కడుపు నింపుకొంటున్న ఆమె జీవితంలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. ‘నీకు నేనున్నానంటూ..’ మాయమాటలు చెప్పాడు... జీవితాంతం అండగా ఉంటానంటూ నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. అలా వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది... ఆరేళ్ల పాటు భార్యాభర్తల్లా ఒకే ఇంట్లో కలిసి సహ జీవనం చేశారు... పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన ప్రతిసారి మాట దాటేసుకుంటూ తప్పుకుంటూ వచ్చాడు... మోజు తీరాక ఆమెను పక్కనబెట్టి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ఆమె తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది... జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు తెలిపిన వివరాలివీ.. మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన యువకుడు ఎర్రంశెట్టి శివప్రసాద్‌ ఆటో డ్రైవర్‌. రోజూ విజయవాడ ట్రిప్పులు వేçస్తుంటాడు. ఆ క్రమంలో ఆరేళ్ల క్రితం ఉయ్యూరుకు చెందిన మన్నె మాధవి పరిచయమైంది. భర్తతో మనస్పర్ధలు రావటంతో ఒంటరిగా ఉంటున్న ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. అది సహ జీవనానికి దారి తీసింది. దీంతో భర్త. పిల్లల్ని వదిలేసి ప్రసాద్‌తో వచ్చేసింది. గొడుగుపేటలోని ఓ అద్దె ఇంట్లో సహ జీవనం సాగిస్తున్నారు. వివాహం ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి తప్పుకుంటూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల హంసలదీవికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రసాద్‌ సిద్ధమయ్యాడు. అనుమానం వచ్చిన ఆమె ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. 

స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నం.. 
న్యాయం కోసం బాధితురాలు ఇనగుదురుపేట పోలీసులను ఆశ్రయించింది. అయితే భర్త నుంచి విడాకులు తీసుకోకపోవటంతో పోలీసులు చేసేది లేదంటూ చెప్పారు. శివప్రసాద్‌పై కేసు నమోదు చేశారు. అయితే శివప్రసాద్‌తో వివాహం జరిపించాలంటూ భీష్మించింది. పోలీసులు కుదరదని చెప్పటంతో ఆదివారం సాయంత్రం స్టేషన్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. 

శివప్రసాద్‌పై కేసు నమోదు.. 
శివప్రసాద్‌తో పాటు అతని తల్లిదండ్రులు, సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆత్మస్థైర్యం కోల్పోయినట్లు వ్యవహరిస్తుండటంతో పోలీసులు ఆమెను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించి కౌన్సెలింగ్‌ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top