పూజల పేరుతో లైంగిక దాడి చేసిన వ్యక్తి అరెస్టు 

 Man arrested Molestation Case In Prakasam District - Sakshi

13 ఏళ్ల బాధితురాలి తండ్రి కూడా అరెస్టు 

వివరాలు వెల్లడించిన డీఎస్పీ

సాక్షి, ప్రకాశం:  రెండు నెలల నుంచి దొనకొండ మండలం రుద్రసముద్రంలో లంకె బిందెలు ఉన్నాయని చెప్పి పూజలు చేయాలని నమ్మబలికి 13 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కె.ప్రకాశ్‌రావు కేసు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా అడవి దేవులపల్లి మండలం మేలకచర్ల గ్రామానికి చెందిన బూసి రాంబాబు అలియాస్‌ విష్ణువర్ధన్‌రెడ్డిపై గుంటూరు జిల్లా మాచవరం, పిడుగురాళ్ల, దాచేపల్లి, కారంపూడి, గురజాల, రాజుపాలెం, నల్లగొండ జిల్లా కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల తదితర పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో నక్సలైట్లమని చెప్పి బెదిరించి, కొట్టి డబ్బులు వసూలు చేసిన కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇతనిపై హుజూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రెండు ఎన్‌బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయి. రాజుపాలెం పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ కూడా ఉంది.

చదవండి: లంకె బిందెల పేరుతో లైంగిక దాడి

రాజుపాలెంలో జరిగిన మర్డర్‌ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత జగద్గురు విష్ణువర్ధన్‌ అనే కొత్తపేరుతో పూజారి అవతారం ఎత్తాడు. దొనకొండ మండలం రుద్ర సముద్రానికి చెందిన రామంజి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని ఆ గ్రామానికి వచ్చాడు. అక్కడ అనారోగ్యంగా ఉండేవారికి, పిల్లలు లేని వారికి, తేలు కాటుకు, పాముకాటుకు తాయత్తులు వేసేవాడు. ఈ తరుణంలో గోన బాలరాజుతో పరిచయం పెంచుకున్నాడు. బాలరాజు ఇంటిలో లంకెబిందెలు ఉన్నాయని పూజలు చేసి తీస్తానని నమ్మబలికి ఇల్లంతా తవ్వించాడు. హాస్టల్‌ సెలవులు ఇవ్వడంతో బాలరాజు 13 ఏళ్ల కుమార్తె ఇంటికి వచ్చింది. రాంబాబు ఆ అమ్మాయిపై కన్నేసి లోబరుచుకోవాలని ఎత్తువేశాడు. బాలికతో పూజలు చేయిస్తే లంకె బిందెలు దొరుకుతాయని నమ్మించి ఇంట్లోకి ఎవరూ రాకూడదని చెప్పి ఎవరినీ రానివ్వకుండా ఆమెపై లైంగికదాడి చేస్తున్నాడు.

బాలిక జరుగుతున్న విషయం తండ్రికి చెప్పినా లంకె బిందెల ఆశతో అతను ఆ విషయాన్ని కప్పిపుచ్చాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో గ్రామస్తులు, వలంటీర్లు ఇతరుల ద్వారా అడుగగా ‘‘మా ఇంట్లో ఏమీ జరగడం లేదు..మా విషయాలు మీకెందుకని’’ వారిపై దూషణలకు దిగాడు. ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాధితురాలి బంధువు అయిన చింతగుంట్ల బాబు గ్రామంలో విచారిస్తున్నారని తెలుసుకుని రాంబాబు, బాలరాజులు బాలికను బండిపై ఎక్కించుకుని వేరే గ్రామానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అది గమనించిన తల్లి బాధితురాలితో కలిసి దొనకొండ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై ఫణి భూషణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రాంబాబుని, బాధితురాలి తండ్రి బాలరాజును సోమవారం అరెస్టు చేశారు. ఇద్దరినీ కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.  
చదవండి:  ప్రియుడిని గాయపర్చిన ప్రియురాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top