తల్లి కోసం హత్యలు..!

Man Arrest in DMK Leader Murder Case Tamil Nadu - Sakshi

పోలీసుల అదుపులో శీనియమ్మాల్‌ వారసుడు కార్తికేయన్‌

కొలిక్కి వస్తున్న మేయర్‌ సహా ముగ్గురి మర్డర్‌ మిస్టరీ

‘కారు’ ఆధారంగా చిక్కిన కార్తికేయన్‌

సీబీసీఐడీతో మరింత లోతైన విచారణకు ఆదేశం

సాక్షి, చెన్నై : తన తల్లి శీనియమ్మాల్‌ రాజకీయ జీవితం నాశనమైందన్న ఆగ్రహంతో కక్ష కట్టిన తనయుడు కార్తికేయన్, అందుకు కారణంగా ఉన్న తిరునల్వేలి మేయర్‌ ఉమామహేశ్వరి, ఆమె భర్త మురుగ చందిరన్‌ను మట్టుబెట్టి ఉండవచ్చన్న అనుమానాలు బయలు దేరాయి. ఇందుకు బలాన్ని చేకూర్చేలా తిరునల్వేలి పోలీసులు ఆధారాలు సేకరించారు. సీపీ కెమెరాకు చిక్కిన దృశ్యాల మేరకు ఈ హత్యలో కార్తికేయన్‌ను ఆయన కారే పట్టించి ఉండటం గమనార్హం. కాగా, ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు గాను సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు.

తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టై సమీపంలోని రెడ్డియార్‌ పట్టిలో ఈనెల 23న డీఎంకే మహిళా నాయకురాలు, మాజీ మేయర్‌ ఉమామహేశ్వరి, ఆమె భర్త మురుగ చందిరన్, పనిమనిషి మారియమ్మాల్‌ను దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈకేసును పోలీసులు ఓ సవాల్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. తిరుల్వేలి కమిషనర్‌ భాస్కరన్‌ నేతృత్వంలో అదనపు కమిషనర్లు శరవనన్, మహేశ్‌కుమార్‌లు మూడు బృందాలుగా ఐదు రోజుల పాటుగా విచారణ చేపట్టారు. ఈ దర్యాప్తులో రాజకీయ కక్ష కారణంగానే హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

మదురైలో చిక్కిన కార్తికేయన్‌.....
దర్యాప్తులో భాగంగా ఓ చర్చి సమీపంలోని సీపీ కెమెరాలో ఓ కారు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ కారు డీఎంకేకు చెందిన శీనియమ్మాల్‌ తనయుడు కార్తికేయన్‌కు చెందినదిగా గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీ సులు మదురైలో తలదాచుకున్న కార్తికేయన్‌ను ఆదివారం అర్థరాత్రి అదుపులోకి తీసుకుని తిరునల్వేలికి తరలించారు. తన తల్లికే తెలియకుండా కార్తీకేయన్‌ ఈ హత్యలు చేసి ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేశారు.

రాజకీయ కక్షలే కారణం!
తిరునల్వేలి జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న శీనియమ్మాల్‌ జీవితం ఉమామహేశ్వరి రాకతో సంక్షోభంలో పడింది. క్రమంగా శీనియమ్మాల్‌కు డీఎంకేలో ప్రాధాన్యత తగ్గడం 2011 ఎన్నికల్లో తన తల్లికి దక్కాల్సిన శంకరన్‌ కోయిల్‌ అసెంబ్లీ సీటును ఉమామహేశ్వరి తన్నుకెళ్లడం కార్తికేయన్‌లో కక్షను రగిల్చింది. దీంతో ఉమామహేశ్వరిని మట్టు బెట్టేందుకు గత కొన్నేళ్లుగా కార్తికేయన్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చినట్టుగా విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం.

హతమార్చాలన్న ఉద్దేశంతో
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. కార్తికేయన్‌ తన తల్లి శీనియమ్మాల్‌ ఓ విషయం చెప్పి రమ్మన్నారంటూ ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లాడు. తన తల్లి రాజకీయ జీవితాన్ని నాశనం చేశావంటూ వారితో గొడవ పడ్డాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఉమామహేశ్వరి, మురుగ చందిరన్‌ల మీద మీద దాడిచేశాడు. దోపిడి జరిగినట్టుగా నగలు, నగదు అపహరించుకునే రీతిలో నాటకాన్ని రచించాడు. అయితే ఈ క్రమంలో పనిమనిషి మారిమ్మాల్‌ రావడంతో ఆమెను సైతం హతమార్చాడు. అక్కడి నుంచి ఏమీ ఎరుగనట్టుగా మదురైకు వెళ్తూ, తామర భరణి నదిలో ఉమామహేశ్వరి ఇంట్లో నుంచి పట్టుకొచ్చిన బంగారు నగల సంచి, తన కత్తిని పడేసి వెళ్లి పోయాడు.

అన్యాయంగా ఇరికిస్తున్నారు: సన్యాసి
అయితే ఈ వాదనను కార్తికేయన్‌ కుటుంబం ఖండించింది. కేసులో తన కుమారుడిని అన్యాయంగా ఇరిక్కిస్తున్నారని తండ్రి సన్యాసి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడికి ఏమీ తెలియదని, పోలీసులు ఓ కట్టుకథను అల్లి కేసును ముగించే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ప్రాథమిక విచారణలో కేసు ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ త్రిపాఠి ఆదేశాలు ఇచ్చారు. ఈ హత్యలో కార్తికేయన్‌ ప్రమేయం ఉందన్న అనుమానాలకు బలాన్ని ఇచ్చే ఆధారాలు ఉన్నా, మరింత లోతైన విచారణ జరిపేందుకే కేసును సీబీసీఐడీకి అప్పగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top