గుర్రంపై స్వారీ.. అంతలోనే షాక్‌..!

Man And His Horse Dies Of Electric Shock At Kangti - Sakshi

విద్యుత్‌ షాక్‌తో గుర్రం, రౌతు మృతి

వేలాడుతున్న విద్యుత్‌ తీగ గుర్రం మెడకు తగలడంతో ప్రమాదం

సోదరి ఇంట విందుకు వెళ్తుండగా ప్రమాదం

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం పార్తు తండాలో విషాదం

సాక్షి, నారాయణఖేడ్‌: చిగురు పండుగ విందులో పాల్గొనేందుకు గుర్రంపై స్వారీ చేస్తూ  వెళ్తున్న రౌతు మార్గమధ్యంలో విద్యుత్‌ షాక్‌ తగిలి మరణించాడు. సోదరి ఇంట విందు కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. షాక్‌ కొట్టడంతో యజమాని(రౌతు) సహా గుర్రం మృతి చెందింది.  ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

మండలంలోని ఎక్కువ శాతం తండాల్లో ప్రతి ఏటా జూలైలో గిరిజనులు చిగురు పండుగ నిర్వహిస్తారు. భీంరా పార్తు తండాకు చెందిన రాథోడ్‌ వెంకట్‌(45) చింతమణి తండాలో తన సోదరి ఇంట ఏర్పాటు చేసిన చిగురు పండుగ విందు కోసం గుర్రంపై బయల్దేరాడు. భీంరా శివారులోకి చేరుకోగానే గుర్రం కాళ్ల చప్పుడుకు పంటల రక్షణ కోసం అడవి పందుల బెడదను కాపాడేందుకు ఉంచిన కుక్కలు అరిచాయి. కుక్కల అరుపులకు గుర్రం బెదిరిపోయింది. పక్కనే ఉన్న పంట చేలోకి పరుగులు పెట్టింది.

ఈ క్రమంలో పొలంలో వేళాడుతున్న త్రీఫేజ్‌ విద్యుత్‌ తీగలు గుర్రం మెడకు తగిలాయి. క్షణంలో విద్యుత్‌ షాక్‌ తగలడంతో వెంకట్, అతను స్వారీ చేస్తున్న గుర్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. పొలం యజమాని పంట కాపలా కోసం వెళ్లి చూసి వెంకట్‌ మృతి చెందిన విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మృతుడు వెంకట్‌ భార్య వాలబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మండలంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ శుభకార్యాలు ఉన్నా, ప్రముఖ రాజకీయ నాయకుల సమావేశాలు ఉన్నా గుర్రంతో మృతుడు వెంకట్‌నాయక్‌ అందరిని ఉత్సాహపరిచేవాడు. అదే గుర్రంపై స్వారీ చేస్తూ విద్యుత్‌ షాక్‌ తగిలి మరణించడంతో పార్తు తండాలో విషాదం నెలకొంది. మృతుడు వెంకట్‌కు భార్య, పిల్లలు ఉన్నారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top