జార్ఖండ్‌ ముఠా పనే!

Jharkhand Gang Hand In SBI Robbery Case Anantapur - Sakshi

ఎస్‌బీఐ చోరీ కేసులో చురుగ్గా దర్యాప్తు

పూర్తి విషయాలు సేకరించిన పోలీసులు

నిందితులకోసం జార్ఖండ్‌కు వెళ్లిన పోలీసుల బృందం

జేఎన్‌టీయూ క్యాంపస్‌లోని ఎస్‌బీఐచోరీ కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. జార్ఖండ్‌కు చెందిన ముఠానే బ్యాంకును కొళ్లగొట్టారని పోలీసులు నిర్ధారణకువచ్చినట్లు తెలిసింది. ‘రాబరీగ్యాంగ్‌’కు సంబంధించి పూర్తి విషయాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు  దుండగులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని భావిస్తున్నారు. అప్పుడే రికవరీచేయగలమనే భావనలో ఉన్నారు. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం:  ఎస్‌బీఐ రాబరీ ‘అనంత’లో తీవ్ర కలకలం రేపింది. పోలీసులను కూడా ఉక్కిరిబిక్కిరి చేసింది. అందువల్లే ఈ కేసు పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 3 బృందాలను రంగంలోకి దింపి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్యాంకులోని నగదును కొళ్లగొట్టింది మధ్యప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు తొలుత భావించారు. అయితే బ్యాంకు అకౌంట్‌ వివరాలు, చిరునామాలు పరిశీలించిన తర్వాత వారు జార్ఖండ్‌ గ్యాంగ్‌గా నిర్ధారించారు. పైగా ఈ నెల 11న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో చోరీకి పాల్పడ్డ ముఠా, ‘అనంత’లో చోరీ చేసిన ముఠా ఒక్కటే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ పోలీసులు సేకరించిన ఆధారాల ద్వారా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు సాగిస్తున్నాయి. ఫొటోలు, పేర్లు, చిరునామాలు తెలియడంతో ఇక దొంగలను పట్టుకోవడమే తరువాయి అని తెలుస్తోంది.

దోపిడీల్లో ఉత్తరాది ముఠాలే ఎక్కువ
రైళ్లలో దోపిడీలు చేయడం , బ్యాంకులు, ఏటీఎంలతో పాటు ధనవంతుల ఇళ్లలో చోరీ కేసుల్లో ఉత్తరాది ముఠాలే వెలుగులోకి వస్తున్నాయి. రాజస్థాన్, మహారాష్ట్రలోని షోలాపూర్, కొల్లాపూర్, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లో రాష్ట్రాలు కరువుకు చిరునామాగా మారాయి. అత్యంత వెనుకబడిన గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. వీరికి బతికేందుకు ఉపాధి ఉండదు. దీంతో జంతువులను వేటాడి వాటిని అమ్మి బతికేవాళ్లు!  వీరిలో కొన్ని తెగలకు చెందిన వారు చోరీలకు అలవాటు పడ్డారు. చుట్టపక్కల ప్రాంతాల్లో దొంగతనాలు చేద్దామంటే వారి పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అందువల్లే వారు పెద్దరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో చోరీలు చేయడం మొదలెట్టారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం దొంగలను కాల్చేసేలా ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ ముఠాలు దక్షిణాదిపై విరుచుకుపడ్డాయి. ఉత్తరాదితో పోల్చితే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం వినియోగం ఎక్కువ కావడంతో తమిళనాడు, కర్ణాటక, ఏపీలో దొంగతనాలకు అలవాటుపడ్డారు.

పరిసరాలను చూసి పరిస్థితి అంచనా..
ఉత్తరాది ముఠా సభ్యులు దుప్పట్లు, బొమ్మలు అమ్ముకునే వారిలాగా వచ్చి వీధుల్లో తిరుగుతారు. వీరు ఇళ్లవద్ద ఆరేసిన దుస్తులను బట్టి ఎంతమంది ఉన్నారు? పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎంతమంది? అని అంచనా వేస్తారు. ఇంటి చుట్టూ వాసనబట్టి వంటగది, పడకగది, స్టోర్‌ రూం గ్రహిస్తారు. ఎంచుకున్న ఇళ్ల వద్ద పక్కాగా రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడతారు. బ్యాంకు, ఏటీఎంలదీ కూడా ఇదే పరిస్థితి. దక్షిణాదిలోనూ రైళ్లు, భారీ దొంగతనాలకు ‘అనంత’ను ఎంచుకోవడానికీ కారణం ఉంది. మహారాష్ట్ర మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లాలంటే అనంతపురం, గుంతకల్లు నుంచి రోజుకు ఆరుకుపైగా రైళ్లు ఉన్నాయి. కొన్ని రైళ్లలో షోలాపూర్‌ నుంచి అనంతకు 6–7 గంటల్లోనే చేరుకోవచ్చు. అందువల్లే దుండగులు ఎక్కువగా ‘అనంత’పైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలన్నీ ఆర్గనైజింగ్‌ గ్యాంగ్‌లు. ఈ ముఠాలకు డాన్‌లు ఉంటారు. కేసుల్లో ఇరుక్కుంటే వారిని బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు, డాన్‌లు చూసుకుంటారు. ఏది ఏమైనా వరుస రైల్వే దొంగతనాలు మరకముందే బ్యాంకు దోపిడీ జరగడం ‘అనంత’ వాసుల్లో తీవ్ర ఆందోళన రేకిత్తిస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top