మారని నేరగాళ్లు!

Hyderabad Police Trying to Change Criminals in Hyderabad - Sakshi

పరివర్తన కోసం వ్యాపారాలు పెట్టించినా.. మార్పులేదు

జహీరాబాద్‌ అత్యాచార ఘటనలో నిందితుడి ఉదంతం  

ఉప్పల్‌: కరడుగట్టిన నేరగాళ్లను మార్చడానికి పోలీసులు పడుతున్న తపన వృథానే అవుతోంది. రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వయం ఉపాధి కింద వ్యాపారాలు పెట్టించినా నేరగాళ్లు తమ పంథాన్ని వీడటంలేదు. అప్పటికప్పుడు కొన్ని రోజులు మాత్రమే మారినట్లు నటించినా ఆచరణలో అది కనిపించడంలేదు. వందల కేసుల్లో చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించిన ఖైదీల పరివర్తన కోసం మల్కాజిగిరి డివిజన్‌ పరిధిలోని 2015లో అప్పటి క్రైం డీసీపీ నవీన్, మల్కాజిగిరి ఏసీపీలతో కలిసి ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఖాళీ ప్రాంతంలో వెంకటరమణకు టిఫిన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయించారు. 2016 ఫిబ్రవరిలో వరంగల్‌ జిల్లా కాజీపేటకు చెందిన కర్నకంటి వీరబ్రహ్మచారికి ఉప్పల్‌ చౌరస్తాలో టీ కొట్టును ఏర్పాటు చేయించారు.

కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రాజుతో టీ కొట్టు పెట్టించారు. నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శ్రీనివాస్‌రెడ్డి, ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రసాద్‌రెడ్డి.. ఇలా ఎంతోమంది కరడుగట్టిన నేరగాళ్లను మార్చడానికి టీ కొట్టు, టిఫిన్‌ సెంటర్లను ఏర్పాటు చేయించి జన జీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం కల్పించారు. కొందరు నేరగాళ్లు మారినా మరికొందరు మాత్రం తమ ప్రవృత్తిని పోలీసుల కళ్లుగప్పి కొనసాగిస్తూనే ఉన్నారు. గత రెండున్నరేళ్లుగా వీరు ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఉంటున్నారో.. పోలీసులకే తెలియడంలేదు. ఇదే కోవలో ఉప్పల్‌ చౌరస్తాలోని బస్టాప్‌లో టీ కొట్టును నడిపిస్తున్న బ్రహ్మచారి కొంతకాలం మాత్రమే దానిని నడిపించి మరొకరికి అప్పగించి మళ్లీ నేర ప్రవృత్తిని కొనసాగిస్తూనే వచ్చాడు. మూడు రోజుల క్రితం జహీరాబాద్‌లో బస్సులో ప్రయాణిస్తున్న మహిళను పోలీసులమని బెదిరించి బస్సులో నుంచి దించి ఆమెపై అత్యాచారం చేసిన కేసులో బ్రహ్మచారి ఉండటం గమనార్హం. ఇలా పోలీసులచే పునరావాసం కల్పించిన నేరగాళ్లు తమ పంథాన్ని వీడకపోవడమే కాకుండా మరింత కసితో నేరాల బాట పడుతుండటం శోచనీయం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top