మాట వినలేదని..మట్టుబెట్టారు

four members arrest in couples murder

నవ దంపతులను హతమార్చిన నలుగురి అరెస్టు

రెండు బైక్‌లు, కత్తులు స్వాధీనం

చిన్నప్పుడే అమ్మానాన్నలను పోగొట్టుకున్న మేనకోడలిని అల్లారుముద్దుగా పెంచారు ఆ మామలు. పెళ్లి చేద్దామనుకున్న సమయంలో తమకు చెప్పకుండా ఓ వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని తమ పరువును బజారున పడేసిందని భావించి వారిని హతమార్చేందుకు పథకం పన్నారు. ఇంటికెళ్లి మరీ నరికి చంపడం సంచలనం సృష్టించింది.

వేములవాడ: నవ దంపతులైన నేదూరి రచన–హరీష్‌ను పథకం ప్రకారం నడింట్లోనే నరికి చంపినట్లు వేములవాడ రూరల్‌ మండలం బాలరాజుపల్లికి చెందిన నేదూరి అశోక్, శేఖర్, నాగరాజు, మనోజ్‌ ఒప్పుకున్నట్లు డీఎస్పీ అవధాని చంద్రశేఖర్‌ తెలిపారు. వీరిని శుక్రవారం ఉదయం బాలరాజుపల్లిలో పట్టుకుని అరెస్టు చేసినట్లు చెప్పారు. హత్యకు ఉపయోగించిన రెండు వేటకత్తులు, రెండు బైక్‌లను స్వాధీనపరచుకున్నట్లు పేర్కొన్నారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

పథకం ప్రకారం హత్య
తమ అక్కాబావలు మరణించడంతో అనాథగా మారిన రచనను తమ ఇంట్లో అల్లారుముద్దుగా పెంచారు ఆమె మామలు. డిగ్రీ వరకు చదివించారు. ఈక్రమంలో తమ ఇంటి ఎదురుగా ఉండే హరీష్‌ను కొండగట్టు దేవస్థానంలో పెళ్లి చేసుకుంది. తిరిగొచ్చి తమ కళ్లముందే ఉంటున్న రచన–హరీష్‌ను రచన మేనమామలు అశోక్, శేఖర్, నాగరాజు పథకం ప్రకారం వేటకత్తులతో గొంతులు కోసి హతమార్చారు. డిగ్రీ చదువుతున్న సమయంలో హరీష్‌తో చనువుగా మాట్లాడుతుండడాన్ని గమనించి హెచ్చరించారు. హత్యకు రెండు రోజుల ముందు వేములవాడలో గదులు అద్దెకు తీసుకుని ఇరువురిని చంపేయాలని నిర్ణయించారు. ఈనెల 5న ప్లాన్‌ ప్రకారం హత్య చేసేందుకు సిద్ధమయ్యారు. హంతకుల్లో ఇద్దరికి నేరచరిత్ర ఉంది.

మరికొందరి ప్రమేయం
ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. హత్య చేసిన అనంతరం వాడిన బైక్‌ల యజమానులు, ఆశ్రయం కల్పించిన బంధువులు, మిత్రుల ఆచూకీ తెలుసుకుంటున్నారు.

ఠాణాకు పిలిచి హెచ్చరించినా..
రచన–హరీష్‌ ప్రేమ పెళ్లి అనంతరం వేములవాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆశ్రయించిన క్రమంలో వారి పెద్దలను ఠాణాకు పిలిపించారు. వారితో ఒప్పంద పత్రాలు రాయించి కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఫలితం లేకపోయింది.

పోలీసులను అభినందించిన డీఎస్పీ
కేసును వారం రోజుల్లోనే ఛేదించిన వేములవారు రూరల్‌ ఎస్సై రాజశేఖర్, సిబ్బంది శ్రీనివాస్, మునీర్, ప్రశాంత్‌ను డీఎస్పీ అభినందించారు. రూరల్‌ సీఐ మాధవి పాల్గొన్నారు.

 బైక్‌లపై పరార్‌
వేటకత్తులతో హతమార్చిన అనంతరం వీరంతా రెండు బైక్‌లపై వెళ్తూ సాక్ష్యం చెబితే వీరికి పట్టిన గతే పడుతుందని గ్రామస్తులను హెచ్చరించారు. నమిలిగుండుపల్లికి చెందిన శేఖర్‌ అనే వ్యక్తి ఇంట్లో బైక్‌లు, కత్తులు, రక్తపు మరకలతో ఉన్న దుస్తులను దాచి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వారు ఉపయోగించిన సెల్‌ఫోన్‌ కాల్‌డాటా ఆధారంగా పట్టుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top