ప్రాణం తీసిన ప్రేమ పరుగు

Electric Shock ITI Student Died Nizamabad - Sakshi

నిజాంసాగర్‌(జుక్కల్‌): ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందన్న భయంతో పరుగులు తీసిన ప్రేమ ప్రాణం తీసింది. ప్రియురాలితో కలిసి పరుగులు తీసిన ప్రియుడు ద్యానబోయిన బాలకిషన్‌(19) అలియాస్‌ చింటు అనే యువకు డు కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. కరెంట్‌ షాక్‌ గురైన ప్రియుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రియురాలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అడవి పందుల బెడద నివారణ కోసం వరి పంట పొలం చుట్టూ ఏర్పాటు చేసిన కరెంట్‌ కంచె ప్రియుడి ప్రాణం తీసిన సంఘటన నిజాంసాగర్‌ మండలం ఒడ్డేపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ద్యానబోయిన(బుడాల) లక్ష్మయ్య, రాజవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు నారాయణ, బాలకిషన్‌ ఉన్నారు.

చిన్నకుమారుడు బాలకిషన్‌(చింటు) బాన్సువాడ లో ఐటీఐ ఫస్టియర్‌ చదువుతున్నాడు. ఓ యువతి తో బాలకిషన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దేవీ శరన్నవరాత్రుల్లో ఒడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి శుక్రవారం రాత్రి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. బాలకిషన్‌ తన ప్రియరాలితో గ్రామ పొలిమెరల్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని ఇద్దరు యువకులు బాలకిషన్‌కు ఫోన్‌ చేశారు. ప్రియురాలితో కలిసి వెళ్లినట్లుగా పెద్దలకు విషయం తెలిసిందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సదరు యువకులు బాలకిషన్‌కు తెలిపారు. దాంతో ప్రియురాలితో కలిసి బాలకిషన్‌ పంట పొలా ల వైపు పరుగులు తీశారు. గ్రామ శివారులోని వరి పంట పొలానికి అమర్చిన కరెంట్‌ తీగను గమనించకుండా ముందుకు వెళ్లారు.

కరెంట్‌ షాక్‌కు గురైన బాలకిషన్‌ దూరంగా వెళ్లూ అంటూ ప్రియురాలిని అప్రమత్తం చేశాడు. దాంతో ప్రియురాలు ప్రియుడిని కాపాడేందుకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు అక్కడికి చేరుకునేలోగా బాలకిషన్‌ అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బాలకిషన్‌ తల్లిదండ్రులు, కటుంబీకులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిజాంసాగర్‌ ఏఎస్‌ఐ కొణారెడ్డి హుటాహుటిన ఒడ్డేపల్లికి చేరుకున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్‌ఐ నాగరాజు వర్మ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంని నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
యమపాశంగా కరెంట్‌ కంచె..  
అడవి పందుల కోసం వరిపంట పొలం చుట్టూ అమర్చిన కరెంట్‌ కంచె బాలకిషన్‌ ప్రాణం తీసిం దని ఎస్‌ఐ నాగరాజు వర్మ తెలిపారు. ప్రియురాలితో కలిసి గ్రామ శివారులోకి వెళ్లిన విషయం పెద్దలకు తెలిసిందని యువకులు చెప్పడంతో భయంతో పరుగులు తీశారన్నారు. కరెంట్‌ కంచె ను గుర్తించకుండా వెళ్లడంతో బాలకిషన్‌ కరెంట్‌ షాక్‌ గురై మృతి చెందాడన్నారు. ఈ కేసులో పంటపొలానికి కరెంట్‌ను ఏర్పాటు చేసిన అంజయ్య, బొందుసాబ్‌తో పాటు ఫోన్‌ చేసిన యువకులు జ్ఞానేశ్వర్, నరేశ్‌పై, ప్రియురాలిపై కేసు నమోదు చేశామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top