పురిటిలోనే పసి ప్రాణం బలి

Doctors Negligence Baby Died In Nizamabad Hospital - Sakshi

కమ్మర్‌పల్లి(బాల్కొండ): వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. కమ్మర్‌పల్లికి చెందిన మల్లగారి రేణుక అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో లేకపోగా, స్టాఫ్‌ నర్సు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ మాత్రమే ఉన్నారు.

పురిటి నొప్పులతో బాధపడుతున్న రేణుకను ప్రసూతి గదిలోకి తీసుకెళ్లారు. పేషెంట్‌ అవసరమైన(పొలీస్‌ క్యాథటర్‌) యూరిన్‌ పైప్‌ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రిస్కిప్షన్‌పై రాసిచ్చారు. కమ్మర్‌పల్లి మందుల దుకాణాల్లో లేకపోవడంతో మెట్‌పల్లికి వెళ్లి తీసుకువచ్చారు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో వైద్య సిబ్బంది కాన్పు చేశారు. సహజ ప్రసవంతో మగ శిశువుకు జన్మించింది. పుట్టిన శిశువులో కదలికలు లేకపోవడంతో పాటు, నీలిరంగుగా మారడంతో శిశువును మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

వైద్య సిబ్బంది కారణంగానే శిశువు మరణించిందని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. కాన్పు చేసిన హెల్త్‌ సూపర్‌వైజర్, స్టాఫ్‌ నర్స్‌ శిశువు ఉమ్మ నీరు మింగిందని ఒకసారి, మరోసారి తెమడ తట్టుకుందని పొంతన లేని మాటలు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. డ్యూటీ డాక్టర్‌ ఎక్కడ అని నిలదీశారు. వైద్యాధికారి సెలవులో ఉంటే సంబంధిత రిజిస్టర్‌ను చూపించాలని పట్టుపట్టారు. పోలీసుల సమక్షంలో రిజిస్టర్‌ చూపించడంతో అందులో అటెండ్‌ బాక్స్‌ ఖాళీగా ఉంది. అర్హత కలిగిన వైద్యులు లేకపోవడంతో అనర్హత కలిగిన సిబ్బంది కాన్పు చేయడం కారణంగా శిశువు మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు. ఘటనపై అనుమానాలుంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులు స్థానిక తహసీల్దార్, ఎస్‌ఐలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top