అబార్షన్‌ చేసేందుకు డాక్టర్‌ యత్నం   

Doctor Abortion Attempt.. Hospital Seized In Medak - Sakshi

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న  వైద్యాధికారులు

ఎన్‌టీపీసీ చట్టం ఆధారంగా కేసు నమోదు

జిన్నారం(పటాన్‌చెరు) : ఓ యువతికి నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్‌ చేసేందుకు యత్నించిన సంఘటన జిన్నారం మండలం బొల్లారం గ్రామంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు, వైద్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ యువతి బొల్లారంలో నివాసం ఉంటుంది.

తనకు గర్భం వచ్చిందని అబార్షన్‌ చేయించాలని గ్రామంలోని ఓ బ్రోకర్‌ను సంప్రదించింది. దీంతో అబార్షన్‌ చేయించేందుకు కొంత డబ్బును అందిస్తానని స్థానికంగా ఉన్న కార్తీకా క్లినిక్‌ను సంప్రదించారు. దీంతో వైద్యురాలు శ్రీవల్లి యువతికి అబార్షన్‌ చేసేందుకు ఒప్పుకుందని బాధితురాలి కుటుంబ సభ్యులు వివరించారు.

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా యువతికి అబార్షన్‌ చేసేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మీడియా సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు.  వారిపై వైద్యురాలు శ్రీవల్లి విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని స్థానికులు జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు.

దీంతో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రవీణ్‌కుమార్‌ వైద్య సిబ్బందితో ఆసుపత్రికి చేరుకున్నారు.  ఈ సందర్భంగా స్థానికులు అధికారులతో మాట్లాడారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆసుపత్రిలో అబార్షన్‌లను నిర్వహిస్తున్నారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఈ  ఆసుపత్రిలో చాలా జరిగాయని స్థానికులు  పేర్కొన్నారు.

ఆసుపత్రి సీజ్‌  

ఆస్పత్రిలో ఉన్న బాధిత యువతిని హుటాహుటిన సంగారెడ్డిలోని ప్రభత్వాసుపత్రికి వైద్యాధికారులు తరలించారు. ఆసుపత్రిని రాత్రికి రాత్రే అధికారులు సీజ్‌ చేశారు. ఈ విషయమై ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవన్నారు.

ఆస్పత్రి సీజ్‌ చేశామన్నారు. ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించిన అన్ని పత్రాలను తమకు అందించాలని వైద్యురాలు శ్రీవల్లిని ఆదేశించామని పేర్కొన్నారు. ప్రస్తుతం యువతి సంగారెడ్డిలోని ఆసుపత్రిలో ఉందని తెలిపారు. ఈ విషయమై ఆస్పత్రి నిర్వహకులపై ఎన్‌టీపీ చట్టం ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు. దీనిపై డీఎంహెచ్‌వో మోజీరామ్‌రాథోడ్‌ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top