కాంక్రీట్‌ మిల్లర్‌లో పడి మహిళ మృతి

Concrete Miller Cause To Woman Death - Sakshi

మిల్లర్‌ వద్ద ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికురాలి దుర్మరణం

కన్నీరుమున్నీరై విలపిస్తున్న పిల్లలు

జగ్గుశాస్త్రులపేటలో విషాదం

ఆమదాలవలస : పట్టణంలోని సాగర్‌ డిగ్రీ కళాశాల పక్కన జరుగుతున్న గృహ నిర్మాణం వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు వద్ద జరిగిన ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందింది. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు జగ్గుశాస్త్రులపేటకు చెందిన దండుపాటి లక్ష్మి(40) భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది.

పట్టణంలోని ఎస్‌.అప్పలనాయుడు గృహ నిర్మాణ పనులకు శుక్రవారం ఉదయం ఆమె వచ్చింది. మధ్యాహ్నం సమయంలో కాంక్రీట్‌ కలుపుతున్న మిల్లర్‌ వద్ద ఆమె పనిచేస్తుండగా తన తలకు చుట్టుకుని ఉన్న చుమ్మ(క్లాత్‌) ప్రమాదవశాత్తు మిల్లర్‌లోకి లాగేసింది. ఆ క్లాత్‌తో పాటు ఆమె జుత్తు కూడా యంత్రంలోకి లాగేసి తల మొత్తం యంత్రంలో చిదిమేసింది.

దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. గృహ యజమాని 108కు సమాచారం అందించాడు. ఆ వాహనం వచ్చేలోపే ఆమె ప్రాణాలు విడిచిపెట్టడంతో చేసేది లేక వైద్య సిబ్బంది వెనుదిరిగారు.  

అప్పటివరకూ సరదాగా గడిపి...

అప్పటివరకు తమతో సరదాగా మాట్లాడుతూ గడిపిన లక్ష్మి ఒక్కసారిగా ఇలా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో భర్త రాముతో పాటు లక్ష్మి నిత్యం కూలీ పనులకు వెళ్తుంది. మృతురాలికి   ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రాజేశ్వరికి వివాహం కాగా కుమారుడు షణ్ముఖరావు పట్టణంలో ఐటీఐ చదువుతున్నాడు.

చిన్న కుమార్తె తేజేశ్వరి మండలంలోని అక్కులపేట గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదివి, ఇటీవల వచ్చిన ఫలితాల్లో పాసైంది. తమ తల్లి మరణవార్త విన్న పిల్లలు తల్లడిల్లిపోయి కన్నీరుమున్నీరై విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

అయితే విషయం తెలుసుకున్న స్థానిక ఎస్‌ఐ జి.వాసుదేవరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును కార్మికులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top