రూ.7.51 కోట్ల హవాలా నగదు స్వాధీనం

Cash Seized While Transport In Car Hyderabad - Sakshi

ఎన్నికల నేపథ్యంలో సమీకరిస్తున్న తండ్రీ కొడుకులు

రాజకీయ నేతలకు అందించేందుకేనా?  

షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసి మరీ నగదు ప్రవాహం

మూడు ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన పోలీసులు

నలుగురి అరెస్టు, ఒకరి నుంచి తుపాకీ స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అవసరమైన నగదును రాజకీయ నేతలకు సమకూర్చడానికి హవాలా ఏజెంట్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా భారీ స్థాయిలో లిక్విడ్‌ క్యాష్‌ను సమీకరించుకుంటున్నారు. ఇలాంటి ఓ ముఠాపై పక్కా సమాచారం అందుకున్న హైదరాబాద్‌ పోలీసులు నగరంలోని మూడు ప్రాంతాల్లో బుధవారం వరుస దాడులు చేశారు. ఈ దాడుల్లో మొత్తం రూ.7,51,10,300 నగదు స్వాధీనం చేసుకోవడంతోపాటు నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరి నుంచి తుపాకీ సైతం రికవరీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖతో (ఐటీ) పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు (ఈడీ) అందిచనున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసు పూర్తి వివరాలను మధ్య మండల, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీలు పి.విశ్వప్రసాద్, పి.రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. వెల్లడించారు.  

ఇటు హవాలా..అటు మిత్తి దందా
బంజారాహిల్స్‌లోని నవీన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తండ్రీకొడుకులు సునీల్‌ కుమార్‌ అహూజ, ఆషిశ్‌ కుమార్‌ అహూజాలు వీరిద్దరీ పేరుమీదా కొన్ని షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి వ్యవస్థీకృతంగా నగదు అక్రమ లావాదేవీలు చేస్తున్నారు. సునీల్‌ పేరుతో ఏడు, ఆషిశ్‌ పేరుతో మరో ఆరు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆయా కంపెనీల లావాదేవీల పేరుతో దేశవిదేశాల నుంచి భారీగా నిధులను బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ డబ్బును వివిధ ఓచర్ల సాయంతో డ్రా చేసి లిక్విడ్‌ క్యాష్‌గా మార్చి తమ ఇంట్లో భద్రపరుస్తున్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరూ ఉత్తరాదితో పాటు విదేశాల్లో ఉన్న హవాలా ఏజెంట్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి సూచనల మేరకు కమీషన్‌ తీసుకుంటూ నగరంలో నగదు డెలివరీ చేస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలను నగదు పంపాలని భావించిన వారి నుంచి డబ్బు తీసుకుంటూ ఆయాచోట్ల ఉన్న తమ ఏజెంట్ల ద్వారా డెలివరీ చేస్తున్నారు. దీంతోపాటు డబ్బు అవసరమైన వారికి దస్తావేజులు ష్యూరిటీగా పెట్టుకుని భారీ వడ్డీకి అప్పులు సైతం ఇస్తున్నారు.  

‘ఎన్నికల నిధి’ ఏర్పాటు ప్రయత్నాల్లో..
ఎన్నికల్లో తమ ఖాతాల నుంచి తీసి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘానికి దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి మొత్తాన్ని అక్రమమార్గంలో సమీకరించుకోవడానికి రాజకీయ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఈ తండ్రీకొడుకులతో టచ్‌లో ఉన్నారు. దీంతో ఎన్నికల ఖర్చులకు అవసరమైన డబ్బును కోరిన వారికి, కోరిన చోట అందించేందుకు ఈ వీరిద్దరూ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా అధిక వడ్డీకి, ఇతర అవసరాల నిమిత్తం ఇచ్చిన మొత్తాలను తిరిగి తీసుకుని తమ ఇంట్లో దాచారు. ఇందులో భాగంగా గోషామహల్‌ ప్రాంతానికి చెందిన వ్యాపారి భబుత్‌సింగ్‌ రాజ్‌ పురోహిత్‌కు అప్పుగా ఇచ్చిన రూ.2 కోట్లను బుధవారం తిరిగి తీసుకునే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయారు.  

మూడున్నర గంటల్లో మూడు చోట్ల..
భబుత్‌సింగ్‌ రాజ్‌ పురోహిత్‌కు అప్పుగా ఇచ్చిన రూ.2 కోట్లను తీసుకునేందుకు ఆషిశ్‌ తన డ్రైవర్‌తో కలిసి కారులో బయల్దేరారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నగర పోలీసు కమిషనర్‌ దాడులకు ఆదేశించారు. దీంతో డీసీపీ, అదనపు డీసీపీల పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు సాయిని శ్రీనివాసరావు, బి.గట్టుమల్లు, సైఫాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సైదిరెడ్డి తమ బృందాలతో రంగంలోకి దిగారు. తెల్లవారుజామున సైఫాబాద్‌ ప్రాంతంలో వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా రూ.2,00,65,500 నగదు లభించింది. కారులో ఉన్న ఆషిశ్, డ్రైవర్‌ అస్లంను అదుపులోకి తీసుకుని విచారించగా.. డబ్బును భబుత్‌సింగ్‌ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. తర్వాత విచారణలో సునీల్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో సునీల్‌ ఇంటిపై దాడి చేసి రూ.5,47,75,150ను, షాహియాత్‌గంజ్‌ పరిధిలోని భబుత్‌సింగ్‌ ఇంటిపై దాడి చేసి రూ.3.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సునీల్, భబుత్‌సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top