‘పెట్టీ’దారుల పీచమణిచేస్తారు!

Aadhar Number Is Attached To Accuses - Sakshi

ఆధార్‌ ఆధారంగా ‘ఉల్లంఘనుల’గుర్తింపు

పదేపదే పోలీసులకు పట్టుబడితే ఇక జైలుకే..

ప్రత్యేక యాప్‌ రూపొందించిన నగర పోలీసులు

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు నిర్ణయం

నిర్దేశించిన సమయంలో దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసేయాల్సిందే. అయినా తెరిచే ఉంటాయి..

ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి నిరసనలు చేపట్టకూడదు.. అయినా రోడ్లకు అడ్డం పడుతుంటారు..

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం.. అయినా వైన్‌ షాపుల పక్కన కానిచ్చేస్తుంటారు..

రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం తీవ్ర ఉల్లంఘనే. అయితేనేం ఎక్కడికక్కడ ఇదే సీన్‌..

సాక్షి, హైదరాబాద్‌
..ఇవన్నీ చిన్న విషయాలుగానే కనిపించినా.. వీటి వల్ల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ప్రతి నగరం, పట్టణంలో తరచూ వెలుగులోకి వచ్చే ఈ తరహా వ్యవహారాలను పోలీసు పరిభాషలో పెట్టీ, న్యూసెన్స్‌ కేసులుగా పిలుస్తుంటారు. ఇతరులకు ఇబ్బందికరంగా ఉన్నా వీరిపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ) కింద కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు. దీంతో ఈ తరహా నేరాల కట్టడికి రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఆధార్‌ ఆధారం గా పని చేసే ఈ యాప్‌ పేరు ‘ఈ–పెట్టీ కేస్‌’.

స్థానిక చట్ట పరిధిలోకి మాత్రమే..
పెట్టీ, న్యూసెన్స్‌ కేసులపై ఫిర్యాదు వచ్చినా, పోలీసుల కంటపడినా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండేది కాదు. దీంతో నగర పోలీసు చట్టాలు, టౌన్‌ యాక్ట్‌లను అనుసరించి జరిమానా విధించి పంపేసేవారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు పదేపదే రెచ్చిపోతున్నట్లు పోలీసు విభాగం గుర్తించింది. ఇలాంటి వారికి చెక్‌ పెట్టడానికి ‘ఈ–పెట్టీ కేస్‌’యాప్‌ రూపొందించింది. న్యూసెన్స్‌కు పాల్పడే వారు ఒక్కో సందర్భంలో ఒక్కో ప్రాంతంలో రెచ్చిపోతున్నారు. అలాంటి సమయాల్లో ముందస్తు అరెస్టులు, లేదా అదుపులోకి తీసుకోవడం వంటివి చేస్తున్న స్థానిక పోలీసులు.. సొంత పూచీకత్తుపై లేదా నామమాత్రపు జరిమానా విధించి వదిలిపెడుతున్నారు. ఎవరిపై చర్యలు తీసుకున్నారనే అంశం ఆ పోలీసుస్టేషన్‌ రికార్డులకే పరిమితమవుతోంది. దీంతో ఇలాంటి వారు పదేపదే చెలరేగిపోతున్నా కఠిన చర్యలు కరువయ్యాయి. 

పేర్ల నమోదుతో పాటు ఆధార్‌ సంఖ్య..
ఇలాంటి వారికి చెక్‌ చెప్పడానికి ‘ఈ–పెట్టీ కేస్‌’యాప్‌ను గతేడాది నగర పోలీసులు డిజైన్‌ చేశారు. క్షేత్రస్థాయిలో ఉండే పోలీసు అధికారుల ట్యాబ్‌లతో అనుసంధానించి ఉండే సర్వర్‌లో దీన్ని నిక్షిప్తం చేయడంతో ట్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పబ్లిక్‌ న్యూసెన్స్‌ చేస్తూ పట్టుబడిన, ముందస్తు అరెస్టు అయిన, సమయం మించి దుకాణాలు తెరిచి ఉన్న, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వారి పూర్తి వివరాలతో పాటు ఆధార్‌ నంబర్‌ను ట్యాబ్‌ ద్వారా సేకరిస్తారు. ఈ డేటాబేస్‌ అన్ని ఠాణాలకు చెందిన ట్యాబ్‌లతో అనుసంధానించి ఉన్న నేపథ్యంలో ఓ వ్యక్తి, కొందరు వ్యక్తులు పదేపదే ఈ తరహా నేరాల్లో ఉన్న విషయాన్ని యాప్‌ గుర్తించి అధికారులకు తెలుపుతుంది. దీని ఆధారంగా వారిని ఆధారాలతో కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించడానికి ఆస్కారం ఏర్పడింది. ఇలాంటి ఉల్లంఘనల్ని తీవ్రంగా పరిగణిస్తున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి పక్షం రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. ఫలితంగా ఈ తరహా నేరాలు చాలా వరకు తగ్గాయి. ‘ఈ–పెట్టీ కేస్‌’నగరంలో సక్సెస్‌ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ యాప్‌ను ఈ నెలాఖరుకు డీజీపీ ఆవిష్కరించనున్నారు.

హైదరాబాద్‌లో ఈ–పెట్టీ కేస్‌ యాప్‌ పనితీరు ఇలా..
నమోదు చేసిన ఈ–పెట్టీ కేసులు:     25,322
కోర్టులో నిరూపితమైనవి:     21,360
కేవలం జైలు శిక్ష పడినవి:     1306
జైలుతో పాటు జరిమానా:     1038
కేవలం జరిమానా పడినవి:     19,016

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top