యస్‌ బ్యాంకుపై ఎస్‌బీఐ చీఫ్‌ కీలకవ్యాఖ్యలు 

YES Bank will not be allowed to fail, some solution will emerge: SBI Chairman Rajnish Kumar - Sakshi

సాక్షి, ముంబై:  వివాదాలు, సమస్యలసుడిగుండంలో చిక్కుకున్న ప్రయివేటు బ్యాంకు యస్‌బ్యాంకుపై స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. యస్‌ బ్యాంకు సమస్యల నుంచి బయటపడి మనుగడ సాగించేందుకు కొన్ని పరిష్కారమార్గాలు తప్పక దొరుకుతాయంటూ సానుకూల సంకేతాలిచ్చారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యస్‌బ్యాంకును కుప్పకూలనివ్వమని, ఏదో ఒక పరిష్కారం తప్పక లభిస్తుందని వ్యాఖ్యానించారు.  మూలధన సమీకరణ కోసం యస్‌బ్యాంక్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్‌బీఐ ఛీఫ్‌ వ్యాఖ్యలు  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

యస్‌బ్యాంకును సంక్షోభం నుంచి బయటపడేసేందుకు యత్నించాలని ప్రభుత్వం ఎస్‌బీఐని కోరవచ్చన్న అంచనాలకు రజనీశ్‌ వ్యాఖ్యలు  మరింత ఊతమిచ్చాయి. దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్‌తో మార్కెట్లో కీలకమైన బ్యాంకుగా ఉన్న యస్‌బ్యాంకు కుప్పకూలే పరిస్థితి రాదన్నది తన అభిప్రాయమన్నారు. అంతేకాదు  యస్‌బ్యాంకు లాంటి మంచి బ్యాంకు పతనం కావడం ఎకానమీకి మంచిది కాదంటూ రజనీశ్‌ పేర్కొనడం గమనార్హం. బ్యాంకు సంక్షోభ పరిష్కారానికి తప్పక మార్గాలు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రజనీశ్‌ వ్యాఖ్యల నేపథ్యంలో యస్‌బ్యాంకు షేరు గురువారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం లాభపడింది.  కాగా గత నెల్లో యస్‌బ్యాంకును బయటపడేసేందుకు ఎస్‌బీఐ ఎలాంటి ప్రయత్నం చేయదని రజనీశ్‌ వెల్లడించడం గమనార్హం. కేవలం నెలరోజుల్లోనే ఆయన అభిప్రాయాల్లో మార్పు కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. 

ప్రధానంగా ప్రమోటర్ రానా కపూర్ ఆకస్మికంగా నిష్క్రమించిన తరువాత బ్యాంకు తీవ్ర సంక్షోభంలోకి పడిపోయింది. ఆస్తి నాణ్యత క్షీణించడం, ఎన్‌పిఏ, మూలధన పడిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో గత  సంవత్సరంలో యస్‌ బ్యాంకు 80 శాతానికి పైగా పడిపోయాయి. జనవరి 10 న జరిగిన బోర్డు సమావేశం రుణదాత అర్హత కలిగిన సంస్థాగత నియామకం (క్యూఐపి) లేదా, ఏదైనా ఇతర ప్రైవేటు ఈక్విటీ లేదా అప్పు ద్వారా  రూ .10,000 కోట్ల వరకు నిధులను సేకరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే ఈ నిధుల సేకరణపై చర్చించడానికి, అంతకుముందు రూ .800 కోట్లుగా ఉన్న  అధికారిక మూలదనాన్ని రూ .1,100 కోట్లకు విస్తరించేందుకుగాను,  ఫిబ్రవరి 7 న తన వాటాదారుల అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top