టెక్నాలజీలో విప్లవం

World Congress on Information Technology -2018  - Sakshi

ఎన్నడూ చూడని టెక్నాలజీ వస్తోంది

నేర్చుకోగలిగితేనే ఐటీలో ఉద్యోగం

యాక్సెంచర్‌ చైర్మన్‌ రేఖా మీనన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ చూడని స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం ముందుకు వస్తోంది. నూతన రంగాలు పుట్టుకొస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏ రంగంలో కొత్త ఉద్యోగాలు వస్తాయో చెప్పడం కష్టమే’ అని యాక్సెంచర్‌ ఇండియా చైర్మన్‌ రేఖ ఎం మీనన్‌ అన్నారు.

వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–2018 సదస్సులో భాగంగా నైపుణ్యం–పునర్‌ నైపుణ్యం అన్న అంశంపై సోమవారం ఇక్కడి హెచ్‌ఐసీసీలో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యం పెంచుకుంటేనే ఐటీ రంగంలోని సిబ్బంది తమ ఉద్యోగాలను కాపాడుకుంటారని స్పష్టం చేశారు. నేర్చుకోగలిగే సామర్థ్యమూ ఉద్యోగుల్లో ఉండాల్సిందేనని అన్నారు.

నైపుణ్యమే ప్రాతిపదిక..
ఉద్యోగి ఏ పాత్ర పోషిస్తున్నారో అన్న విషయం పక్కన పెడితే వారిలో ఉన్న నైపుణ్యమే ప్రాతిపదిక అని రేఖ మీనన్‌ అన్నారు. బ్రాండ్‌ న్యూ టెక్నాలజీకి తగ్గట్టుగా స్కిల్‌ మెరుగుపర్చుకోవాలని చెప్పారు. ఇందుకు నిరంతరం నేర్చుకోవాలని వివరించారు. నేర్చుకునే అంశాలూ కొత్తగా ఉంటున్నాయని పేర్కొన్నారు. తరగతి గది మాదిరిగా ఏడాదికోసారి జరిగే శిక్షణ కార్యక్రమాలకు ఇక చెల్లు అని వ్యాఖ్యానించారు.

ఒక కార్యక్రమంలో పాల్గొన్న 1,200 మంది సీఈవోల్లో, మూడు శాతం మంది మాత్రమే వారి సిబ్బందికి అదనపు శిక్షణ కోసం ఖర్చు చేశారని గుర్తు చేశారు. టెక్నాలజీ మార్పులతో కొంత మంది ఉద్యోగాలు కోల్పోతారని పేర్కొన్నారు. అయినప్పటికీ నూతన సాంకేతిక కారణంగా కొత్త ఉద్యోగాల సృష్టి ఉంటుందన్నారు. తీసివేతలతో పోలిస్తే నూతన నియామకాలే అధికంగా ఉంటాయన్నారు.  

ఆదాయం పెరిగిందా..?
అన్ని కంపెనీలు ఒక్కో ఉద్యోగి ద్వారా ఎంత ఆదాయం సమకూరుతోందో బేరీజువేసుకుంటాయని ఎడ్‌క్యాస్ట్‌ ఫౌండర్‌ కార్ల్‌ మెహతా అన్నారు. ‘అదనపు శిక్షణ ఇవ్వడం ద్వారా కంపెనీకి ప్రతి ఉద్యోగి నుంచి అదనంగా ఎంత ఆదాయం పెరిగింది అన్నది చూస్తారు. ఇవన్నీ శిక్షణ కార్యక్రమాలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఉద్యోగులకు నైపుణ్య పెంపు కార్యక్రమాలు చేపడితేనే కంపెనీలు నిలదొక్కుకుంటాయి’ అని అన్నారు. ఎందరో నిపుణులు ఫ్రీలాన్సర్లుగా సేవలందిస్తున్నారని, క్రౌడ్‌ సోర్సింగ్‌ విధానంలో వారి సేవలు ఉపయోగించుకోవాలని డీఎక్స్‌సీ టెక్నాలజీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ అరిమనితయ తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top