వాట్సాప్‌లో  భద్రత ఉత్తదే!

WhatsApp discovers targeted surveillance attack - Sakshi

మిక్స్‌డ్‌ వాయిస్‌ కాల్స్‌తో ఫోన్లలోకి వైరస్‌ ఎటాక్‌

మాల్‌వేర్‌ ద్వారా  వాయిస్‌ కాల్స్‌ ట్యాపింగ్‌

కాల్‌ లిఫ్ట్‌ చేయకపోయినా చొరబడేలా ప్రోగ్రామ్‌

భద్రత కోసం యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని వినియోగదారులకు సూచన

సాక్షి, అమరావతి: వాట్సాప్‌ వాడకం అత్యంత భద్రమైనదని, ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌స్క్రిప్షన్‌ వల్ల వినియోగదారుల డేటాను తస్కరించడం కానీ కాల్స్‌ను ట్యాప్‌ చేయడం కానీ సాధ్యం కాదనే మాటల్లో వాస్తవం లేదని వెల్లడైంది. తమ మెసేజింగ్‌ యాప్‌ వైరస్‌ బారిన పడినట్లు వాట్సాప్‌ యాజమాన్యం అంగీకరించింది. ప్రస్తుతం లోపాలను సవరించామని, అయితే వాట్సాప్‌ వినియోగదారులు వెంటనే తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. నిఘా పరికరాలుగా ఫోన్‌ కెమెరాలు మిస్‌డ్‌ వాయిస్‌ కాల్స్‌ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్‌ ఫోన్లలోకి వైరస్‌ చొరబడేలా ఓ స్పైవేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థ అభివృద్ధి చేసింది. వాట్సాప్‌ వినియోగదారుడు వాయిస్‌ కాల్‌ను లిఫ్ట్‌ చేయకపోయినా కూడా వైరస్‌ ఫోన్‌ లోపలికి ప్రవేశించేలా ఈ మాల్‌వేర్‌ను రూపొందించారు. ఒకసారి ఈ వైరస్‌ మొబైల్‌లోకి ప్రవేశిస్తే స్పైవేర్‌ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాక్‌ చేయడంతోపాటు ఫోన్‌ కెమెరాలను నియంత్రించి నిఘా పరికరాలుగా మార్చేసి వాయిస్, వీడియో కాల్‌ను ట్యాప్‌ చేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే అడ్వాన్స్‌డ్‌ సైబర్‌ యాక్టర్‌ దీన్ని రూపొందించింది. 

లోపాలను సవరించినట్లు ప్రకటన
ఇజ్రాయిల్‌ ప్రభుత్వం మానవ హక్కుల సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు లాంటి వారిపై నిఘా పెట్టాలనుకున్నప్పుడు ఎన్‌ఎస్‌వో సంస్థ ఇలాంటి పోగ్రాంలను సిద్ధం చేస్తుంది. ఇలా రూపొందించిన స్పైవేర్‌ను ఎంపిక చేసిన తమ వినియోగదారుల ఫోన్లలో ప్రవేశపెట్టినట్లు వాట్సప్‌ సంస్థే అంగీకరించింది. వాట్సప్‌ వాయిస్‌ కాలింగ్‌ ద్వారా వచ్చే మిస్డ్‌ కాల్స్‌తో ఈ మాల్వేర్‌ ఫోన్లోకి చొరబడినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటి వారంలోనే ఈ మాల్‌వేర్‌ను గుర్తించామని, వాయిస్‌ కాలింగ్‌కు అదనపు భద్రతా ఫీచర్లు సిద్ధం చేస్తుండగా తమ సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లోపాన్ని గుర్తించి సరిచేసినట్లు ప్రకటించింది. 

సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్

వాట్సప్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన
తమ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 150 కోట్ల మంది వాట్సప్‌ వాడకందారులు యాప్‌ను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ మాల్‌వేర్‌ వల్ల ఎంతమంది వినియోగదారులకు నష్టం జరిగిందన్న విషయంపై వాట్సప్‌ స్పందించలేదు. 2014లో వాట్సప్‌ను ఫేస్‌బుక్‌ టేకోవర్‌ చేసినప్పటి నుంచి డేటా భద్రతపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. డేటా దుర్వినియోగంపై ఫేస్‌బుక్‌ తరచూ ఆరోపణలు ఎదుర్కొంటుండటమే దీనికి ప్రధాన కారణం. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top