స్టాక్స్‌ వ్యూ

Weekly stock view - Sakshi

ఎస్కార్ట్స్‌
కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: జియోజిత్‌ ఫైనాన్షియల్‌; 
ప్రస్తుత ధర: రూ.919; టార్గెట్‌ ధర: రూ.1,090
ఎందుకంటే: ట్రాక్టర్ల తయారీలో మూడో అతి పెద్ద భారత కంపెనీ ఇది. భారతదేశ ఉత్తర, పశ్చిమ మార్కెట్లలో మంచి అమ్మకాలు సాధిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మార్కెట్‌ వాటా 11 శాతానికి పెరిగింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. కంపెనీ మొత్తం ఆదాయంలో 80 శాతం వరకూ ఉండే ట్రాక్టర్ల అమ్మకాలు 57 శాతం పెరిగాయి. నిర్మాణ రంగ వ్యాపారం 49 శాతం వృద్ధి సాధించింది. ఆర్డర్ల జోరుతో రైల్వే  ఎక్విప్‌మెంట్‌ డివిజన్‌ విభాగం ఆదాయం 126 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మొత్తం  ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.1,436 కోట్లకు చేరింది. నికర లాభం 153 శాతం వృద్ధితో రూ.112 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 134 శాతం ఎగసి రూ.266 కోట్లకు చేరింది.  అమ్మకాలు అధికంగా ఉండటం, ధరల పెరుగుదల, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్‌ 5 శాతం వృద్ధి చెంది 12.1 శాతానికి పెరిగింది. ఎగుమతులు 58 శాతం ఎగిశాయి. వర్షపాత అంచనాలు సానుకూలంగా ఉండటం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తుండటంతో ట్రాక్టర్లకు డిమాండ్‌ పెరగగలదని భావిస్తున్నాం. వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం ప్రోత్సాహాకాలిస్తుండటం, వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగం పెరుగుతుండటం, నిర్మాణ రంగ యంత్రాల, రైల్వే విభాగాల పనితీరు జోరుగా ఉంటుండటం... సానుకూలాంశాలు.  రెండేళ్లలో ఈ కంపెనీ  ఆదాయం 16%, నికర లాభం 34 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా.

ఎన్‌టీపీసీ
కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌; ప్రస్తుత ధర: రూ.161; టార్గెట్‌ ధర: రూ.202
ఎందుకంటే:  కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రూ.2,820 కోట్ల నికర లాభం సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. బిహార్‌ రాష్ట్ర ఎలక్ట్రిక్‌ బోర్డ్‌కు చెందిన మూడు ప్లాంట్లలో వాటాను కొనుగోలు చేస్తోంది. 2019–24 కాలానికి సీఈఆర్‌సీ(సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌) మార్గదర్శకాలు సమీప భవిష్యత్తులో ప్రభావం చూపనున్నాయి. ఈ మార్గదర్శకాలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఈ కంపెనీ షేర్‌ ప్రస్తుత స్థాయి నుంచి మరింతగా పతనమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి 6 శాతం పెరగడంతో ఆదాయం 7 శాతం ఎగసింది. గత ఆర్థిక సంవత్సరంలో సమస్యగా ఉన్న బొగ్గు కొరత ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పరిష్కారం కాగలదని కంపెనీ భావిస్తోంది. దివాలా చట్టం కారణంగా విద్యుత్తు రంగంలో విలీనాలు కొనుగోళ్లు చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. విద్యుదుత్పత్తి రంగంలో అతి పెద్ద కంపెనీగా ఇది ఎన్‌టీపీసీకి బాగా ప్రయోజనం కలిగించే అంశమే. 51,410 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ఈ కంపెనీ విద్యుత్తు రంగంలో కన్సల్టెన్సీ సేవలు కూడా అందిస్తోంది. ఈ కంపెనీ అనుబంధ సంస్థ, ఎన్‌టీపీసీ విద్యుత్‌ వ్యాపార్‌ నిగమ్‌ పవర్‌ ట్రేడింగ్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. విభిన్నమైన వ్యాపారాల కోసం వివిధ కంపెనీలతో జాయింట్‌ వెంచర్లను ఏర్పాటు చేసింది. సీఈఆర్‌సీ టారిఫ్‌ల ప్రతికూలత, ఇంధన సరఫరాలు తగినంతగా లేకపోవడం.. ప్రతికూలాంశాలు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top