ఫ్లిప్కార్ట్ వైపు స్నాప్డీల్ చూపు? | Snapdeal explores merger talks with Flipkart, Amazon | Sakshi
Sakshi News home page

ఫ్లిప్కార్ట్ వైపు స్నాప్డీల్ చూపు?

Aug 20 2016 12:25 AM | Updated on Aug 1 2018 3:40 PM

ఫ్లిప్కార్ట్ వైపు స్నాప్డీల్ చూపు? - Sakshi

ఫ్లిప్కార్ట్ వైపు స్నాప్డీల్ చూపు?

లాభాల ఊసు పక్కన పెట్టి.. కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, మార్కెటింగ్‌కు కోట్ల కొద్దీ నిధులు కుమ్మరించిన దేశీ ఈకామర్స్ దిగ్గజాలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి.

అమెజాన్‌తోనూ కలిసే అవకాశం 
పోటీ దిగ్గజాల్లో విలీన యోచన 
ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టైగర్ గ్లోబల్‌తో చర్చలు..

 ముంబై : లాభాల ఊసు పక్కన పెట్టి.. కస్టమర్లను ఆక ర్షించడానికి భారీ డిస్కౌంట్లు, మార్కెటింగ్‌కు కోట్ల కొద్దీ నిధులు కుమ్మరించిన దేశీ ఈకామర్స్ దిగ్గజాలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పోటీ సంస్థల వైపు చూస్తున్నాయి. హోరాహోరీగా పోరాడుతున్న పోటీ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో విలీన అవకాశాలపై స్నాప్‌డీల్ కసరత్తు చేస్తోందన్న వార్త దేశీ ఈకామర్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది.

ఈ రెండు సంస్థల్లో ఏదో ఒకదానిలో విలీనానికి స్నాప్‌డీల్ సుముఖంగా ఉందని, ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆరంభ దశలోనే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌తో స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బెహల్ ఇటీవలే దీనిపై సమావేశం కూడా అయినట్లు తెలిపాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సంస్థలు ఈ వార్తలను తోసిపుచ్చాయి. ఇవి నిరాధారమైనవని పేర్కొన్నాయి.

 ఇరవై పైగా ఇన్వెస్టర్లు..
భారత ఈకామర్స్ రంగంలో దేశీయంగా ఎదిగిన కంపెనీల్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. స్నాప్‌డీల్ ఇప్పటిదాకా ఇరవై పైగా ఇన్వెస్టర్ల నుంచి సుమారు 1.65 బిలియన్ డాలర్లను సమీకరించింది. కొన్నాళ్ల క్రితం కెనడాకి చెందిన ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ తదితర సంస్థల నుంచి స్నాప్‌డీల్ 200 మిలియన్ డాలర్లు సమీకరించినప్పుడు.. దాని వాల్యుయేషన్‌ను దాదాపు 6.5 బిలియన్ డాలర్లుగా లెక్కించారు.

అప్పట్లో ఫ్లిప్‌కార్ట్ వేల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లలో ఇది సగానికన్నా తక్కువ. స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్ చేసిన వాటిలో జపాన్‌కి చెందిన టెలికం, ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, దాని అండ ఉన్న చైనా ఈ-కామర్స్ సంస్థ ఆలీబాబా, తైవాన్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్, అంతర్జాతీయ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఈబే, దేశీ మీడియా కంపెనీ బెనెట్ కోల్‌మన్ అండ్ కంపెనీ, బెసీమర్ వెంచర్ పార్ట్‌నర్స్, ఇంటెల్ క్యాపిటల్, ఐరన్ పిల్లర్, కలారీ క్యాపిటల్ వంటి వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్లతో పాటు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కూడా ఉన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇన్వెస్టరుగా ఉన్న జాస్పర్ ఇన్ఫోటెక్.. ఇటు స్నాప్‌డీల్‌లో కూడా పెట్టుబడులు పెట్టింది.

ప్రశ్నార్థకంగా సాఫ్ట్‌బ్యాంక్ నుంచి సాయం..
2014లో దాదాపు 627 మిలియన్ డాలర్లు, గతేడాది మరో 500 మిలియన్ డాలర్లను కంపెనీకి సమకూర్చడంలో కీలక పాత్ర పోషించిన సాఫ్ట్‌బ్యాంక్‌కు స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు చెప్పుకోతగిన స్థాయిలో మైనారిటీ వాటాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం దాకా భారత్‌కి చెందిన నికేశ్ అరోరా సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన సమయంలో దేశీ స్టార్టప్ సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా నిధులు లభించాయి. అయితే, చైర్మన్ మసయోషి సన్‌కి వారసుడిగా అంతా భావించినప్పటికీ.. వివిధ కారణాల రీత్యా అరోరా అకస్మాత్తుగా జూన్‌లో రాజీనామా చేశారు. ఆయన నిష్ర్కమణతో సాఫ్ట్‌బ్యాంక్ భారత ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి.

ప్రస్తుతానికి అదనంగా మరిన్ని నిధులు సమీకరించాల్సిన అవసరం లేకుండా సుమారు ఏడాదికి సరిపడా నగదు నిల్వలు స్నాప్‌డీల్ వద్ద్ ఉన్నాయని అంచనా. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సాఫ్ట్‌బ్యాంక్ నుంచి కంపెనీకి భవిష్యత్‌లో అందే సహాయ సహకారాలపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో స్నాప్‌డీల్ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

నష్టాల ఊబిలో ఈ-కామర్స్ సంస్థలు
స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఈ కామర్స్ సంస్థలు లాభాల సంగతి పక్కన పెట్టి ముందుగా కస్టమర్లను ఆకర్షించేందుకు గత ఐదారేళ్లుగా భారీ డిస్కౌంట్లు, ఆర్భాటప్రచారాలకు గణనీయంగానే ఖర్చు చేశాయి. దీంతో ఆయా సంస్థల నష్టాలు అంతకంతకూ పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా నిధులు కుమ్మరిస్తూ వచ్చిన ఇన్వెస్టర్లు.. లాభాల వైపు దృష్టి మరల్చారు. పెట్టుబడులకు బ్రేకులు వేయడం మొదలుపెట్టారు. దీంతో ఈకామర్స్ సంస్థలు కార్యకలాపాలను, సిబ్బంది సంఖ్యను కుదించుకుంటూ.. నగదు నిల్వలు కరిగిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. ఇప్పటికే పలు ఇంటర్నెట్ కంపెనీలు నిలదొక్కుకునేందుకు కన్సాలిడేషన్ లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం వైపు చూస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ కూడా అమెజాన్‌లో విలీనం కోసం గతేడాది ఆఖరు నాటి దాకా చర్చలు జరిపిందంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్.. దేశీ ఈకామర్స్ సంస్థ షాప్‌క్లూస్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపిందంటూ తాజాగా వార్తలూ వచ్చాయి. ఆలీబాబాకు ఇప్పటికే స్నాప్‌డీల్‌లోనూ, మొబైల్ వాలెట్, ఈకామర్స్ సంస్థ పేటీఎంలోనూ వాటాలు ఉన్నాయి. భారత్ ఈ-టెయిలింగ్ మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్న ఆలీబాబా ఈ ఏడాది ప్రారంభంలో ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఇన్వెస్ట్ చేయడంపై చర్చలు సాగించింది. ఒకవైపు స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ మరిన్ని నిధు లు సమీకరించుకునేందుకు నానా తంటాలు పడుతుంటే .. పుష్కలంగా నిధులు ఉన్న పోటీ దిగ్గజం అమెజాన్.. భారత మార్కెట్లో దూసుకుపోతోంది. భారత కార్యకలాపాలపై ఏకంగా 3 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ప్రణాళికలు వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement