అక్రమ లాభార్జనపై 10% జరిమానా

Sitharaman led first GST Council meet to decide on tax cut on e vehicles - Sakshi

విద్యుత్‌ వాహనాలపై పన్ను తగ్గింపును తేల్చనున్న కమిటీ

జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు

లాటరీలపై ఒకే పన్ను అంశంలో కుదరని ఏకాభిప్రాయం

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాలపై, ఎలక్ట్రిక్‌ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన్సిల్‌ 35వ భేటీ శుక్రవారం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర రెవెన్యూ కార్యదర్శి ఏబీ పాండే తెలిపారు.

► అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని 2021 నవంబర్‌ వరకు రెండేళ్లపాటు పొడిగింపు.
► జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించకుండా అక్రమంగా లాభాలు పోగేసుకుంటే ఆ మొత్తంలో 10% జరిమానా విధింపునకు నిర్ణయం. ప్రస్తుతం ఈ జరిమానా నిబంధనల మేరకు గరిష్టంగా రూ.25,000గానే ఉంది.  
► ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్ను ప్రస్తుతం 12 శాతం ఉండగా, దీన్ని 5 శాతానికి, ఎలక్ట్రిక్‌ చార్జర్లపై 18 శాతం నుంచి 12 శాతానికి పన్ను తగ్గించాలన్న ప్రతిపాదనలను ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదింపు.  
► ఆధార్‌తో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు అనుమతి.
► 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీ వార్షిక రిటర్నుల దాఖలుకు ఈ ఏడాది ఆగస్టు వరకు గడువు పొడిగింపు.
► వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారిని ఈవే బిల్లులు జారీ చేయకుండా నిషేధం విధింపు సైతం ఆగస్టు వరకు వాయిదా.
► 2020 జనవరి 1 నుంచి ప్రయోగాత్మక విధానంలో ఎలక్ట్రానిక్‌ ఇన్‌వాయిస్‌ విధానం ప్రారంభం. అప్పటి నుంచి జీఎస్టీ నమోదిత మల్టీప్లెక్స్‌లు ఈ టికెట్లనే జారీ చేయాల్సి ఉంటుంది. అలాగే, రూ.50 కోట్లకు పైగా టర్నోవర్‌ ఉన్న సంస్థలు ఎలక్ట్రానిక్‌ రూపంలోనే ఇన్‌వాయిస్‌లను జారీ చేయాలి.
► నూతన జీఎస్టీ రిటర్నుల దాఖలు వ్యవస్థ కూడా 2020 జనవరి 1 నుంచి అమల్లోకి.

తేలని లాటరీల అంశం
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే లాటరీలపై 12 శాతం జీఎస్టీ, రాష్ట్రాల గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం పన్ను అమల్లో ఉంది. ఒకటే దేశం ఒకటే పన్ను అన్నది జీఎస్టీ విధానం కావడంతో ఒకటే పన్నును తీసుకురావాలన్నది కేంద్రం ప్రతిపాదన. అయితే, ఇందుకు ఎనిమిది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీ ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. దీనిపై అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని తీసుకోవాలని కౌన్సిల్‌ తాజాగా నిర్ణయించింది. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ... ‘‘దేశవ్యాప్తంగా ఒకటే రేటు ఉండాలన్నది జీఎస్టీ ప్రాథమిక సూత్రం. లాటరీల విషయంలో ప్రస్తుతం రెండు రేట్లు అమల్లో ఉన్నాయి. దీంతో ఆర్టికల్‌ 340పై స్పష్టత తీసుకోవాలని నిర్ణయించినట్టు’’ చెప్పారు. రేట్లను తదుపరి తగ్గించాలన్న అంశం చర్చకు వచ్చిందా? అన్న ప్రశ్నకు.. మరింత సులభంగా మార్చడమే తమ ఉద్దేశమన్నారు. జీఎస్టీ నిబంధనలు మరింత సులభంగా మార్చడం, జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ, జీఎస్టీ పరిధిలోకి మరి న్ని వస్తు, సేవలను తీసుకురావడమన్నది ఆర్థిక మంత్రి అభిప్రాయంగా ఆర్థిక శాఖ  తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top