గరిష్టాల్లో లాభాల స్వీకరణ | Sensex marks new closing all-time high at 36858 | Sakshi
Sakshi News home page

గరిష్టాల్లో లాభాల స్వీకరణ

Jul 26 2018 1:42 AM | Updated on Nov 9 2018 5:30 PM

Sensex marks new closing all-time high at 36858 - Sakshi

ముంబై: బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వరుసగా మూడో రోజు బుధవారం రికార్డులను సృష్టించింది. అయితే గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో లాభాలు పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ చివరకు 33 పాయింట్లు లాభపడి 36,858 వద్ద ముగిసింది. ముగింపులో ఇది జీవిత కాల గరిష్ట స్థాయి. ఇంట్రాడేలోనూ ముందటి రోజు రికార్డు స్థాయి 36,902ను అధిగమించి 36,947 వరకు వెళ్లింది. మూడు రోజుల్లో సెన్సెక్స్‌ నికరంగా 473 పాయింట్ల మేర లాభపడడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం రోజు జీవిత కాల గరిష్ట స్థాయి 11,134 వద్ద ముగియగా, ఆ స్థాయి నుంచి రెండు పాయింట్లు నష్టపోయి 11,132 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 11,157 వరకు వెళ్లింది. జూలై ఫ్యూచర్స్, ఆప్షన్‌ కాంట్రాక్టుల కాల వ్యవధి తీరిపోవడానికి ఒక్క రోజే మిగిలి ఉండడంతో, ఇన్వెస్టర్లు షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకునేందుకు మొగ్గు చూపించినట్టు బ్రోకర్లు తెలిపారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మంగళవారం నికరంగా రూ.104 కోట్ల మేర, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.513 కోట్ల మేర కొనుగోళ్లు చేసినట్టు ఎక్సేంజ్‌ గణంకాల ద్వారా తెలుస్తోంది. ‘‘డాలర్‌ మారకంలో రూపాయి స్వల్పంగా పెరగడం, మంచి ఫలితాల అంచనాల నేపథ్యంలో ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్లు జరిగాయి. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ఎక్స్‌పైరీ ముందు రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి ప్రదర్శించారు’’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. 

లాభపడిన స్టాక్స్‌ 
ఎస్‌బీఐ 1.78 శాతం, అదానీ పోర్ట్స్‌ 1.53 శాతం, టాటా స్టీల్‌ 1.49 శాతం, వేదాంత 1.30 శాతం, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, విప్రో, హీరో మోటోకార్ప్, ఆర్‌ఐఎల్‌ స్వల్ప లాభాల్లో ముగిశాయి. అదే సమయంలో ఎన్‌టీపీసీ 4 శాతం మేర నష్టపోయింది. అలాగే, పవర్‌ గ్రిడ్‌ 1.49శాతం, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. టీసీఎస్, హెచ్‌యూఎల్, కోల్‌ ఇండియా సైతం స్వల్పంగా నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ ధోరణి కనిపించింది. ఆసియా మార్కెట్లలో హ్యాంగ్‌సెంగ్, నికాయ్‌ పెరగ్గా, షాంఘై కాంపోజిట్‌ ఫ్లాట్‌గా ముగిసింది. యూరోప్‌ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి.   

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఐపీఓకు భారీ స్పందన
హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) తొలిరోజే పూర్తిగా సబ్‌స్క్రైబయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ వద్ద ఉన్న సమాచారం మేరకు మార్కెట్‌ ముగింపు సమయానికి 1,93,96,884 షేర్లకు బిడ్లు వచ్చాయి. 1.03 రెట్లు సబ్‌స్క్రైబయింది. దేశంలో రెండో అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ ఐపీఓ ద్వారా రూ.2,800 కోట్ల నిధులను సమీకరించనుంది. ఇందు కోసం 1,88,04,290 షేర్లను జారీచేయనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.1,095–1,100 కాగా, శుక్రవారంతో ఐపీఓ ముగుస్తోంది. ఈ సంస్థ  నిర్వహణలోని మొత్తం ఆస్తులు మార్చి చివరినాటికి రూ.3 లక్షల కోట్లుగా ఉన్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement