లాభనష్టాల సయ్యాట | Sakshi
Sakshi News home page

లాభనష్టాల సయ్యాట

Published Tue, Apr 21 2020 6:08 AM

Sensex 31645 And Nifty closed at 9261 Points - Sakshi

రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన  సోమవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్‌ మార్కెట్‌ మిశ్రమంగా ముగిసింది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటం ఇన్వెస్టర్లను ఆందోళన పరిచినా, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీ షేర్లు లాభపడటం, ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు కలసివచ్చాయి.  లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ బాగా పడిపోవడంతో ముడి చమురు ధరలు 21 ఏళ్ల కనిష్టానికి పతనం కావడం, ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రోజంతా 566 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 59 పాయింట్ల లాభంతో 31,648 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 124 పాయింట్ల మేర పెరిగినప్పటికీ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 5 పాయింట్ల నష్టంతో 9,262 పాయింట్ల వద్ద ముగిసింది.  

566 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌....
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమైనా,  ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. మూడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చాయి. ఒక దశలో 468 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మరో దశలో 98 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 566 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 124 పాయింట్లు ఎగసినా, మరో దశలో 36 పాయింట్లు పతనమైంది.  షాంఘై సూచీ మినహా  మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, స్వల్ప లాభాల్లోటముగిశాయి.  

► గత క్యూ4లో నికర లాభం 15 శాతం మేర పెరగడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ 4 శాతం లాభంతో రూ.941వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  

► ప్రైవేట్‌ బ్యాంక్‌ల రేటింగ్‌ను ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ స్థిరత్వం నుంచి ప్రతికూలం నకు తగ్గించింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌లు 5–4 శాతం రేంజ్‌లో నష్టపోయాయి.  

► మరోవైపు యూకో బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జే అండ్‌ కే బ్యాంక్‌ చెరో 20 శాతం చొప్పున ఎగిశాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, ఇండియన్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 10–18 శాతం రేంజ్‌లో పెరిగాయి.

Advertisement
Advertisement