పగ్గాలు తెంచుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం

Retail inflation - Sakshi

డిసెంబర్‌లో 5.21 శాతానికి చేరిక

నవంబర్‌లో ఇది 4.88 శాతం

17 నెలల గరిష్టానికి ఐఐపీ

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం చాలా నెలల తర్వాత మరోసారి దౌడుతీసింది. ఆహారోత్పత్తులు, కూరగాయలు, గుడ్ల ధరల పెరుగుదలతో ఆర్‌బీఐ నియంత్రిత లక్ష్యమైన 4 శాతాన్ని దాటేసుకుని గడిచిన డిసెంబర్‌ మాసంలో ఏకంగా 5.21 శాతానికి ఎగిసింది. దీంతో సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలన్నీ ఆవిరయ్యాయి. వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్‌)  ద్రవ్యోల్బణం గత నవంబర్‌ నెలలో 4.88 శాతంగా ఉంది.

ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో (2 పాయింట్లు అటు, ఇటుగా) కొనసాగించేలా చూడాలంటూ గతంలో కేంద్ర ప్రభుత్వం ఆర్‌బీఐని కోరిన విషయం తెలిసిందే. ఆహార ధరల ద్రవ్యోల్బణం నవంబర్‌ నెలలో 4.42 శాతంగా ఉంటే, అది డిసెంబర్‌లో 4.96 శాతానికి పెరిగింది. గుడ్లు, కూరగాయలు, పండ్ల ధరలు ప్రియమైనట్టు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. తృణధాన్యాలు, పప్పుల విషయంలో ద్రవ్యోల్బణం మోస్తరుగానే ఉంది.

దూసుకెళ్లిన పారిశ్రామికోత్పత్తి
దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 17 నెలల గరిష్టానికి చేరింది. గత నవంబర్‌ నెలలో ఐఐపీ 8.4 శాతంగా నమోదైంది. తయారీ రంగం, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల్లో మెరుగైన పనితీరు వృద్ధికి దోహదపడింది. 2016 నవంబర్‌లో ఐఐపీ 5.1 శాతంగా ఉండగా, దాంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడినట్టు తెలుస్తోంది. 2016 జూన్‌లో ఐఐపీ 8.9 శాతం తర్వాత ఆ స్థాయిలో వృద్ధి మళ్లీ గత నవంబర్‌లోనే సాధ్యమైంది. మరోవైపు గతేడాది అక్టోబర్‌ నెలకు సంబంధించిన ఐఐపీ గణాంకాలను గతంలో వేసిన 2.2 శాతం అంచనాలకు బదులు 2 శాతానికి ప్రభుత్వం సవరించింది.

వృద్ధి బాటలో...
ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం నవంబర్‌లో 10.2 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 4 శాతమే.
ఫార్మాస్యూటికల్స్, ఔషధ రసాయనాలు, బొటానికల్‌ ఉత్పత్తుల విభాగం మాత్రం 39.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఆప్టికల్‌ ఉత్పత్తుల్లో ఇది 29.1 శాతంగా ఉంది.
పెట్టుబడులకు కొలమానమైన క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి 9.4 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది నవంబర్‌లో ఇది 5.3 శాతం.
ఎఫ్‌ఎంసీజీ రంగం 23.1 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో ఉన్న 3.3 శాతంతో పోలిస్తే భారీ వృద్ధి నమోదైనట్టు.

తగ్గిన రంగాలు
ఇక కీలకమైన గనుల రంగంలో వృద్ధి పడిపోయింది. కేవలం 1.1 శాతంగానే నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే మాసంలో ఇది 8.1 శాతం కావడం గమనార్హం.
విద్యుదుత్పత్తి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలతో పోలిస్తే 9.5 శాతం నుంచి 3.9 శాతానికి క్షీణించింది.
టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషీన్లతో కూడిన కన్యూమర్‌ డ్యూరబుల్స్‌లో వృద్ధి 6.8 శాతం నుంచి 2.5 శాతానికి పరిమితమైంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top