రిలయన్స్ బ్యాంకు వస్తోంది! | Reliance joins list of hopefuls for Indian bank permits | Sakshi
Sakshi News home page

రిలయన్స్ బ్యాంకు వస్తోంది!

Feb 3 2015 2:02 AM | Updated on Sep 2 2017 8:41 PM

రిలయన్స్ బ్యాంకు వస్తోంది!

రిలయన్స్ బ్యాంకు వస్తోంది!

దేశీ కార్పొరేట్ అగ్రగామి, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తొలిసారిగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది.

బ్యాంకింగ్ సేవల రంగంలోకి అడుగిడేందుకు బడా కార్పొరేట్ దిగ్గజాలు దరఖాస్తుచేసుకున్నాయి. అంబానీలు, బిర్లాలు, మిట్టల్‌లతో పాటు ఫ్యూచర్ గ్రూప్ కూడా పేమెంట్స్ బ్యాంకుల రేసులో నిలిచాయి. చిన్న ఫైనాన్షియల్ బ్యాంకుల కోసం కూడా ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్, యూఏఈ ఎక్స్ఛేంజ్ దీవాన్ హౌసింగ్ తదితర కంపెనీలు క్యూ కట్టాయి. ఈ రెండు ప్రత్యేక బ్యాంకింగ్ సేవల విభాగాల్లో లెసైన్స్‌లకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆర్‌బీఐ గడువు సోమవారంతో ముగిసింది. లెసైన్స్‌లపై ఆర్‌బీఐ కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.
 
బిర్లా, ఫ్యూచర్, భారతీ గ్రూప్‌లు కూడా...
పేమెంట్స్ బ్యాంకు లెసైన్స్‌లకు దరఖాస్తు...
ఎస్‌బీఐతో రిలయన్స్ జట్టు; కోటక్‌తో ఎయిర్‌టెల్ భాగస్వామ్యం

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) తొలిసారిగా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా టెలికం, రిటైల్ నెట్‌వర్క్ ఉన్న ఆర్‌ఐఎల్, అతిపెద్ద దేశీ బ్యాంకుగా నిలుస్తున్న ఎస్‌బీఐ జట్టుకట్టాయి. ఇరు సంస్థలూ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్(జేవీ) కంపెనీ పేమెంట్స్ బ్యాంక్ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇప్పటికే వాణిజ్య బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్‌బీఐకి నేరుగా ఈ లెసైన్స్ పొందేందుకు అర్హత లేదు. దీంతో ఆర్‌ఐఎల్‌తో ఏర్పాటు చేసిన జేవీలో 30 శాతం వాటా ఎస్‌బీఐ తీసుకుంది. మిగతా 70 శాతం వాటా ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న తమకు ఉంటుందని ఆర్‌ఐఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫార్చూన్-500 ప్రపంచ అగ్రగామి కంపెనీల్లో స్థానం పొందిన తమ సామర్థ్యాలతో దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలు కల్పించే కార్యక్రమంలో భాగస్వాములవుతామని  ఆ ప్రకటన పేర్కొంది.

బ్యాంకింగ్ కార్యకలాపాలులేని మారుమూల పల్లెలు, చిన్న వ్యాపారస్తులకు సేవల కల్పనపై దృష్టిపెట్టనున్నట్లు తెలిపింది. ఆర్‌బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించాక తమ కొత్త జేవీకి పేరును ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా ఈ పేమెంట్ బ్యాంకు కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు కోటక్ మహీంద్రా బ్యాంకుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం...
ఎస్‌బీఐకి దేశవ్యాప్తంగా పటిష్ట బ్యాంకింగ్ నెట్‌వర్క్, రిస్క్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలు ఉన్నాయని.. తాము టెలికం, రిటైల్ వ్యాపారాల్లో పెట్టిన భారీ పెట్టుబడులు పేమెంట్ బ్యాంకుల సేవలను కొత్తపుంతలు తొక్కిస్తుందని ఆర్‌ఐఎల్ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.  జేవీలో పెట్టుబడి వివరాలు, బోర్డులో ఎవరెవరికి ఎంత భాగస్వామ్యం ఉంటుందనేది ఆర్‌ఐఎల్ వెల్లడించలేదు. అయితే, పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకు ఏర్పాటుపై తాము దృష్టిపెట్టలేదని ఆర్‌ఐఎల్ వర్గాలు పేర్కొన్నాయి.
 
న్యూఫ్యూచర్ పేమెంట్స్ బ్యాంక్....

కిశోర్ బియానీ సారథ్యంలోని ఫ్యూచర్ గ్రూపుకూడా పేమెంట్స్ బ్యాంకు లెసైన్స్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసింది. గ్రూప్‌లోనే ఒక ప్రత్యేక కంపెనీగా ఈ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం ఐడీఎఫ్‌సీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని.. కొత్త కంపెనీకి ‘న్యూఫ్యూచర్ పేమెంట్స్ బ్యాంక్’గా పేరును ప్రతిపాదిస్తున్నట్లు తెలిపింది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ నెట్‌వర్క్‌లో బిగ్‌బజార్, నీల్‌గిరీస్, బిగ్‌బజార్ డెరైక్ట్ తదితర బ్రాండ్ స్టోర్లు ఉన్నాయి.
 
బిర్లా... ఐడియా...: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్‌ఎల్) తాజాగా పేమెంట్స్ బ్యాంక్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు సమర్పించింది. ప్రతిపాదిత బ్యాంకులో ఏబీఎన్‌ఎల్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తుంది. 51 శాతం వాటా దీనికి ఉంటుంది. మిగతా 49 శాతం వాటా బిర్లా గ్రూప్‌లోని టెలికం దిగ్గజం ఐడియా సెల్యులార్‌కు ఇస్తున్నట్లు ఏబీఎన్‌ఎల్ పేర్కొంది.
 
పేమెంట్స్, చిన్న ఫైనాన్స్ బ్యాంకులంటే...
పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకుల మాదిరిగా కాకుండా... కేవలం రెమిటెన్సులు(విదేశాల నుంచి భారతీయులు పంపే డబ్బును బట్వాడా చేయడం), డిపాజిట్లు, చెల్లింపులు ఇతరత్రా సేవలను వివిధ మార్గాల ద్వారా పేమెంట్ బ్యాంకులు అందిస్తాయి. ఒక్కో వ్యక్తి నుంచి గరిష్టంగా రూ. లక్ష వరకూ డిపాజిట్లను సమీకరించుకోవచ్చు. ఏటీఎం/డెబిట్ కార్డుల జారీతోపాటు మ్యూచువల్ ఫండ్స్, బీమా వంటి సాధారణ ఫైనాన్షియల్ ప్రొడక్టులను విక్రయించుకోవచ్చు. అయితే, రుణాలను ఇవ్వడానికి, క్రెడిట్ కార్డుల జారీకి వీటికి అనుమతి లేదు. ఇక చిన్న ఫైనాన్స్ బ్యాంకుల విషయానికొస్తే... బ్యాంకింగ్ సేవలు అందుబాటులోలేని మారుమూల ప్రాంతాలు, వర్గాలకు రుణాలందించడం, డిపాజిట్ల సేకరణ వంటివి ప్రాథమిక   విధులు నిర్వర్తిస్తాయి. అంతేకాకుండా చిన్న వ్యాపార యూనిట్లు, చిన్న-సన్నకారు రైతులు, సూక్ష్మ-చిన్న పరిశ్రమలు, అసంఘటిత రంగంలోని సంస్థలకు రుణ కల్పన కూడా ఈ బ్యాంకులు చేపడతాయి.
 
దరఖాస్తు చేసిన కంపెనీల్లో కొన్ని...
పేమెంట్స్ బ్యాంక్: ఆర్‌ఐఎల్, ఆదిత్య బిర్లా గ్రూప్, భారతీ ఎయిర్ టెల్, ఫ్యూచర్ గ్రూప్, ఫినో పేటెక్, వాకరాంజీ, వొడాఫోన్(!).
 
చిన్న ఫైనాన్స్ బ్యాంక్: ఎస్‌కేఎస్ మైక్రో, యూఏఈ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, ఎస్‌ఈ ఇన్వెస్ట్‌మెంట్స్, ఐఐఎఫ్‌ఎల్ హోల్డింగ్స్. క్యాపిటల్ ట్రస్ట్, వయా ఫిన్‌సెర్వ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement