ఆర్‌కామ్ లాభం 48% క్షీణత

ఆర్‌కామ్ లాభం 48% క్షీణత


న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టెలికం దిగ్గజం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నికర లాభం ఏకంగా 48.5 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 156 కోట్లకు పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 303 కోట్ల లాభం నమోదు చేసింది. అప్పట్లో వ్యాపార పునర్‌వ్యవస్థీకరణతో రూ. 550 కోట్ల మేర వన్‌టైమ్ ఆదాయం రావడం వల్ల గత గణాంకాలు భారీగా ఉన్నాయని, అది మినహాయిస్తే వ్యాపార పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని ఆర్‌కామ్ సీఈవో గుర్‌దీప్ సింగ్ తెలిపారు.



త్రైమాసికాల వారీగా చూస్తే మూడో క్వార్టర్‌తో పోలిస్తే లాభం రూ. 108 కోట్ల నుంచి 44 శాతం మేర పెరిగినట్లయిందని వివరించారు. మొత్తం మీద నాలుగో త్రైమాసికం సంతృప్తికరంగానే సాగిందని సింగ్ పేర్కొన్నారు. ఆదాయం 5 శాతం పెరిగి రూ. 5,130 కోట్ల నుంచి రూ. 5,405 కోట్లకు చేరింది. నికర రుణ భారం 3.3 శాతం పెరిగి రూ. 40,178 కోట్లకు చేరింది. వడ్డీ వ్యయాలు 21 శాతం ఎగిసి రూ. 907 కోట్లుగా నమోదయ్యాయి.



 ఇక మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఆదాయం 3 శాతం పెరిగి రూ. 21,238 కోట్లుగాను, నికర లాభం 55 శాతం పెరిగి రూ. 1,047 కోట్లుగాను నమోదైంది. పెరుగుతున్న ముడి వస్తువుల ధరల సమస్యను అధిగమించే ప్రణాళికలో భాగంగానే ఉచిత టాక్‌టైమ్ తగ్గింపు, టారిఫ్‌ల పెంపు చేపట్టినట్లు సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం మొత్తం ఆదాయంలో  జీఎస్‌ఎం వైర్‌లెస్ డేటా వాటా 72 శాతంగా ఉందని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top