రుణాలు ఇక ప్రియం! 

RBI increases repo rate by 25 bps to 6.5%; retains 'neutral' stance - Sakshi

గృహ, వాహన, రిటైల్‌ రుణాలపై పెరగనున్న వడ్డీ రేటు

వరుసగా రెండోసారి రెపో రేటు పెంచిన ఆర్‌బీఐ

పావుశాతం పెంపుతో 6.25 నుంచి 6.5 శాతానికి

ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలే కారణం...

జీడీపీ వృద్ధి రేటు అంచనాలు యథాతథం

ఈ ఏడాది 7.4 శాతంగా ఉండొచ్చని అభిప్రాయం

తటస్థ పరపతి విధానమే కొనసాగుతుందని వెల్లడి

తదుపరి పాలసీ సమీక్ష నిర్ణయం అక్టోబర్‌ 5న...  

వడ్డీరేట్ల విషయంలో ఈ సారి అందరి అంచనాలూ తలకిందులయ్యాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అనూహ్యంగా పాలసీ రేట్లను పెంచి షాకిచ్చారు. దీంతో గృహ, వాహన, కార్పొరేట్, రిటైల్‌ రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి. నెలవారీ వాయిదాలు (ఈఎంఐ) పెరగనున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళనల కారణంగానే రేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవాల్సివచ్చిందని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే, పరపతి విధానాన్ని తటస్థంగానే కొనసాగిస్తున్నట్లు చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం!! 

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్షలో ఊహించని నిర్ణయం వెలువడింది. రెపో రేటును మళ్లీ పావు శాతం పెంచి... 6.5 శాతానికి చేర్చింది. రేట్ల పెంపునకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ)  ఐదుగురు అనుకూలంగా ఓటేశారు. ఒక సభ్యుడు (రవీంద్ర ధోలకియా) మాత్రం యథాతథంగా కొనసాగించేందుకు మొగ్గు చూపారు. కాగా, రెపో పెంపుతో దీంతో అనుసంధానమైన ఇతర పాలసీ రేట్లు కూడా పెరిగాయి. రివర్స్‌ రెపో రేటు పావు శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ఇక నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్‌ఆర్‌) మాత్రం 4 శాతం వద్ద యథాతథంగానే ఉంచింది. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్‌), బ్యాంక్‌ రేట్లు సైతం పావు శాతం చొప్పున ఎగసి 6.75 శాతానికి చేరాయి. కాగా, పాలసీ రేట్లను పెంచినప్పటికీ.. ఇప్పుడు అనుసరిస్తున్న తటస్థ పరపతి విధానాన్నే కొనసాగిస్తామని రిజర్వు బ్యాంకు తెలియజేసింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణం శాంతిస్తే.. మళ్లీ పాలసీ రేట్లను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుంది. కాగా, తదుపరి పరపతి విధాన సమీక్ష అక్టోబర్‌ 3–5 తేదీల్లో మూడు రోజులపాటు జరుగుతుంది. 

రెండు నెలల్లో వరుసగా రెండో సారి... 
దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీలో జూన్‌ 6న రెపో రేటును ఆర్‌బీఐ పావు శాతం పెంచింది. ఇప్పుడు వరుసగా రెండో సమీక్షలోనూ అంచనాలకు భిన్నంగా రేట్లను పెంచి ఆశ్చర్యపరిచింది. ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్‌ నిపుణులు చాలామంది ఈ సారి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనా వేశారు. 

ధరలు వెంటాడుతున్నాయ్‌... 
అధిక ద్రవ్యోల్బణం, ముడిచమురు రేట్ల పెరుగుదల, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అనిశ్చితి, వర్షాలు సరిగ్గా కురవకపోవడం, రైతులకు పంటల మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచడం, ద్రవ్యలోటు గుబులు ఇతరత్రా ఆందోళనవల్లే పాలసీ రేట్లను పావు శాతం పెంచినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిస్తూనే... రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని మధ్య కాలంలో 4 శాతం(2 శాతం అటూఇటుగా) వద్ద నిలకడగా ఉంచాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు ఎంపీసీ స్పష్టం చేసింది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(2018–19, జూలై–సెప్టెంబర్‌)లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో (సెప్టెంబర్‌ –మార్చి) ద్రవ్యోల్బణం అంచనా 4.8 శాతంగా పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ నెలలో టోకు ధరల (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం నాలుగున్నరేళ్ల గరిష్ట స్థాయి 5.77 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. అదేవిధంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా ఐదు నెలల గరిష్ట స్థాయిలో 5.07 శాతంగా నమోదైంది. కాగా, వచ్చే ఏడాది (2019–20) తొలి త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5% ఉండొచ్చనేది ఆర్‌బీఐ అంచనా. 

వృద్ధి అంచనాలు యథాతథం... 
ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్లో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులూ చేయలేదు. గతంలో పేర్కొన్న విధంగానే జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం(2018–19)లో 7.4 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ జోరందుకోవడం కార్పొరేట్‌ కంపెనీల లాభాలు దండిగా ఉండటం వంటివి జీడీపీకి దన్నుగా నిలుస్తాయని తెలిపింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాలు.. మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్‌బీఐ అంచనాలప్రకారం.. 2018–19 ప్రథమార్ధంలో వృద్ధి రేటు 7.5–7.6 శాతం, ద్వితీయార్ధంలో 7.3–7.4 శాతం ఉండొచ్చు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2019–20)లో వృద్ధి రేటును 7.5 శాతంగా అంచనా వేసింది. 

రేట్ల పెంపునకు బ్యాంకులు రెడీ.... 
ఆర్‌బీఐ పాలసీ రేట్లను పెంచుతుందన్న ముందస్తు సంకేతాలతోనే బ్యాంకులు డిపాజిట్‌ రేట్లను తాజాగా స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 0.1 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ఇతర బ్యాంకులూ ఇదే బాటను అనుసరించనున్నాయి. ఇప్పుడు రెపో రేటు పెంపుతో రుణాలపై కూడా వడ్డీరేట్లను ఆ మేరకు బ్యాంకులు పెంచడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల రుణ గ్రహీతలకు ఈఎంఐలు మరింత భారమవుతాయని పేర్కొంటున్నారు.

సమయానుకూల నిర్ణయం... 
అంతర్జాతీయ వృద్ధి కొనసాగే ధోరణి అనిశ్చితిగా ఉంది. ఈ దశలో తగిన సౌలభ్యతతో కూడిన తటస్థ నిర్ణయాలు అవసరం. ఆర్‌బీఐ నిర్ణయం దీనినే సూచించింది. అలాగే రేట్ల పెంపు  సైకిల్‌ ప్రారంభమయ్యిందని కూడా ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది.  
– రజనీష్‌ కుమార్, ఎస్‌బీఐ చైర్మన్‌ 

ద్రవ్యోల్బణంపై దూరదృష్టి... 
దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్‌బీఐ పనిచేస్తోందని తాజా నిర్ణయం సూచిస్తోంది. ద్రవ్యోల్బణం మరింత పెరగనున్న నేపథ్యంలో మార్చిలోగా మరోసారి రేట్ల పెంపును తోసిపుచ్చలేం.  
– అభిషేక్‌ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ 

మరోసారి పెంచకపోవచ్చు 
రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టుతప్పే పరిస్థితుల కారణంగా ఆర్‌బీఐ రేటు పెంపు నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు కూడా దీన్ని క్రమంగా బదలాయించవచ్చు.  వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రేటును మరోసారి పెంచకపోవచ్చన్నది నా అభిప్రాయం. 
– రాణా కపూర్, యస్‌ బ్యాంక్‌ సీఈఓ

మా గోడు వినలేదు: కార్పొరేట్లు 
వడ్డీరేట్లను పెంచొద్దన్న తమ అభ్యర్థనలను ఆర్‌బీఐ పట్టించుకోలేదని కార్పొరేట్‌ ఇండియా పేర్కొంది. రెపో రేటును వరుసగా రెండోసారి పెంచడంపై పారిశ్రామిక రంగం అసంతృప్తిని వ్యక్తం చేసింది. వడ్డీరేట్లను ఇలా ఎడాపెడా పెంచుతూ పోతే మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ ప్రైవేటు రంగానికి కష్టతరంగా మారుతుందని అసోచామ్‌ ప్రెసిడెంట్‌ సందీప్‌ జజోడియా వ్యాఖ్యానించారు. వృద్ధి పుంజుకుంటున్న సంకేతాల నేపథ్యంలో రుణాలకు డిమాండ్‌ మళ్లీ పెరుగుతోందని.. ఆర్‌బీఐ రేట్ల పెంపు దీనికి సంకేతమని మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈఓ అశుతోష్‌ బిష్ణోయ్‌ పేర్కొన్నారు. రేట్ల పెరుగుదల సైకిల్‌ జోరందుకుంటున్న నేపథ్యంలో కొత్తగా డెట్‌ ఫండ్స్‌ రూపంలో పెట్టుబడి అవకాశాలు తలుపు తడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న సంవత్సరాల్లో డెట్‌ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తాయని చెప్పారు. కాగా, ఇప్పటికీ చాలా కార్పొరేట్‌ సంస్థలు తీవ్ర రుణ భారంతో ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో తాజా వృద్ధి గణంకాలను పూర్తిగా పునరుత్తేజ సంకేతాలుగా ఆర్‌బీఐ భావించకూడదని జజోడియా పేర్కొన్నారు.

ఇళ్ల అమ్మకాలకు దెబ్బ: రియల్టర్లు 
ఆర్‌బీఐ రెపో రేటు పెంచడంపై రియల్టీ డెవలపర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ నిర్ణయం కారణంగా గృహ రుణాలు భారమవుతాయని.. దీంతో ఇళ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘రేట్ల పెంపు వల్ల ఇళ్ల కొనుగోలుదారుల సెంటిమెంట్‌ దెబ్బతింటుంది. ఫలితంగా హౌసింగ్‌ అమ్మకాలు తగ్గేందుకు దారితీయొచ్చు’అని నరెడ్కో ప్రెసిడెంట్‌ నిరంజన్‌ హిరనందానీ వ్యాఖ్యానించారు. ‘వరుసగా రెండు సార్లు వడ్డీరేట్ల పెంపు కారణంగా అందుబాటు గృహాల అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రియల్టీలో వృద్ధికి చేదోడుగా హౌసింగ్‌పై జీఎస్‌టీని ఇప్పుడున్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం’ అని క్రెడాయ్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ జక్షయ్‌ షా పేర్కొన్నారు. ‘వెంటవెంటనే వడ్డీరేట్ల పెంపు వల్ల రుణ రేట్లన్నీ ఎగబాకుతాయి. దీనివల్ల ఇప్పుడిప్పుడే గాడిలోపడుతున్న రియల్‌ ఎస్టేట్, కన్సూమర్‌ గూడ్స్‌ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మరీ మఖ్యంగా అందుబాటు గృహాల విభాగానికి తాత్కాలికంగా విఘాతమే’ అని రియల్టీ అగ్రగామి డీఎల్‌ఎప్‌ సీఈఓ రాజీవ్‌ తల్వార్‌ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ద్రవ్యోల్బణం రిస్కుల ప్రకారం చూస్తే.. ఆర్‌బీఐ రేట్ల పెంపు ఊహించినదేనని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సీఎండీ శిశిర్‌ బైజల్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఇళ్ల మార్కెట్లో సవాళ్ల నేపథ్యంలో ఇకపై రేట్ల పెంపునకు ఆర్‌బీఐ విరామం ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.  

ధరల కట్టడి కోసమే: ఉర్జిత్‌ పటేల్‌ 
‘ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉండటం కోసమే రేట్లను పెంచాల్సి వచ్చింది. పంటలకు మద్దతు ధర పెంపు, వర్షపాతం కొరత ఇతరత్రా దేశీయ అంశాలతోపాటు క్రూడ్‌ ధర జోరు, వాణిజ్య యుద్ధాలు వంటి విదేశీ అంశాలు ద్రవ్యోల్బణం రిస్కులను పెంచుతున్నాయి. వాణిజ్య యుద్ధం... ఇప్పుడు కరెన్సీ యుద్ధాలను పురిగొల్పుతోంది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధి విషయంలో వివిధ దేశాల మధ్య తీవ్ర వైరుధ్యాలు నెలకొన్నాయి.  అయితే, వృద్ధికి ఊతమిచ్చే ఉద్దేశంతోనే తటస్థ పాలసీ విధానాన్ని కొనసాగిస్తున్నాం’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ పేర్కొన్నారు.

ఫారెక్స్‌ మార్కెట్‌ సమయం పెంపుపై కమిటీ 
ఫారెక్స్‌ మార్కెట్‌ సమయాన్ని పెంచే అంశాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య పాలసీ సమీక్ష సందర్భంగా పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం దృష్ట్యా పలు వర్గాల నుంచి ఫారెక్స్‌ మార్కెట్‌ సమయం పెంపునకు డిమాండ్‌ వస్తున్న నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం తీసుకుంది.

మద్దతు ధర ప్రభావం తగ్గుతుంది
ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరల(ఎంఎస్‌పీ) ప్రభావం ద్రవ్యోల్బణంపై క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. అందువల్ల దీన్ని తీవ్రమైన రిస్కుగా పరిగణించకూడదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ వ్యాఖ్యానించారు. ఎంఎస్‌పీ పెంపు కారణంగా ఆహార ద్రవ్యోల్బణంపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని... దీంతో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎగబాకే అవకాశం ఉందని ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో గర్గ్‌ ఈ విధంగా స్పందించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top