వృద్ధికి ఆర్‌బీఐనే అడ్డంకి!

Ashima Goyal, Modi's adviser, says RBI misguided on inflation - Sakshi

ద్రవ్యోల్బణంపై దాని అంచనాలు తప్పు

వడ్డీలను అధిక స్థాయిలో ఉంచితే ఉత్పత్తికి దెబ్బ

కీలక వడ్డీ రేట్లు మరో 1 శాతం తగ్గించవచ్చు

ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు ఆషిమా గోయల్‌

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ అంచనాలు ఉండాల్సినదానికన్నా ఎక్కువగానే ఉంటాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు ఆషిమా గోయల్‌ వ్యాఖ్యానించారు. ఇదే అంచనాలతో వడ్డీ రేట్లను తగ్గించటం లేదని, దీంతో ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్‌బీఐ అభిప్రాయం సరైనది కాదు. వడ్డీ రేట్లను అధిక స్థాయిలోనే ఉంచడం వల్ల ఉత్పత్తిని త్యాగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని ఆషిమా స్పష్టంచేశారు. ‘ఆర్‌బీఐ ఎప్పుడూ ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భావిస్తూ ఉంటుంది. అందుకని ద్రవ్యోల్బణంపై వారి అంచనాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ స్థాయిలోనే ఉంటాయి.

ఇక వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయొచ్చన్న అభిప్రాయం కూడా వారికి ప్రతికూలంగానే పనిచేస్తోంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే తీరు అని రుజువైంది కూడా’’ అని ఇంటర్వ్యూలో ఆమె అభిప్రాయపడ్డారు. 2015 జనవరి నాటికల్లా రిటైల్‌ ద్రవ్యోల్బణం (సీపీఐ) 8 శాతం స్థాయిలో ఉంటుందని 2014 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ అంచనా వేసింది. అయితే, వాస్తవానికి ఇది 5.2 శాతానికే పరిమితమైంది.

అలాగే 2016 మార్చి నాటికి సీపీఐ 5.8 శాతానికి ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. ఇది 4.83 శాతం మాత్రమే నమోదైంది. అటు మార్చి 2017 కల్లా సీపీఐ 5 శాతంగా ఉండొచ్చని 2016 తొలినాళ్లలో అంచనా వేసినప్పటికీ.. 3.89 శాతానికే పరిమితమైంది. 2014 నుంచి ముడిచమురు రేట్లు తగ్గుతూ వచ్చినప్పటికీ.. ఈ తగ్గుదల నిలబడేది కాదని, ద్రవ్యోల్బణం ఇంకా.. ఇంకా పెరుగుతూనే ఉంటుందని ఆర్‌బీఐ విశ్వసిస్తూ వచ్చిందని ఆషిమా చెప్పారు.

కమోడిటీల రేట్లే కీలకం..
వాస్తవానికి ద్రవ్యోల్బణం అనేది కమోడిటీలు, ఆహార వస్తువుల ధరల పెరుగుదలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని.. వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చనే అభిప్రాయం సరికాదని ఆషిమా చెప్పారు. ఇతరత్రా వేరే అంశాలతో పోలిస్తే.. అధిక వడ్డీ రేట్ల కన్నా కూడా చమురు ధరలు, ఆహార వస్తువుల రేట్లే ద్రవ్యోల్బణంపై ఎక్కువ ప్రభావం చూపుతాయని అధ్యయనాలు చెబుతున్నాయని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ కీలక పాలసీ రేట్లను మరింతగా తగ్గించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

‘రిటైల్‌ ద్రవ్యోల్బణం నిర్దేశిత నాలుగు శాతానికి లోబడే (రెండు శాతం అటూ ఇటుగా) ఉండనున్న నేపథ్యంలో కీలక పాలసీ రేటును మరో 100 బేసిస్‌ పాయింట్లు (1 శాతం) మేర తగ్గించేందుకు ఆర్‌బీఐకి వెసులుబాటు ఉంది‘ అని ఆషిమా వివరించారు. స్థూల డిమాండ్‌ తీరుతెన్నుల ఆధారంగా ఆర్‌బీఐ పనిచేస్తూ ఉంటుందని.. దేశీయంగా ప్రస్తుతం ఇది బలహీనంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

డిమాండ్‌ బలహీనంగా ఉండటం వల్ల ఉత్పత్తి కూడా తక్కువగానే ఉంటుందని.. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉంచడం వల్ల ముందుగా ఉత్పత్తిపైనే ప్రభావం పడుతోందే తప్ప ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని ఆషిమా చెప్పారు. ఇటు వినియోగం, అటు పెట్టుబడులు మందగతిన ఉండటం వల్ల భారత్‌ ఈ ఆర్థిక సంవత్సరం 6.5 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదు చేయొచ్చని.. 2014 తర్వాత ఇదే అత్యంత తక్కువ కాగలదని ఆమె పేర్కొన్నారు.

రికవరీ ఉంది కానీ...
త్రైమాసికాల వారీగా రెండో క్వార్టర్‌లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 5.7 శాతం నుంచి 6.3 శాతానికి మెరుగుపడటంపై స్పందిస్తూ.. రికవరీ కనిపిస్తున్నా పెద్ద స్థాయిలో లేదని ఆషిమా చెప్పారు. డిమాండ్‌పరమైన ప్రతిబంధకాలు ఇంకా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ద్రవ్య, పరపతి విధానాలన్నీ సాధ్యమైనంత వరకూ ఉపయోగించుకోవాలని చెప్పారు.

కమోడిటీల ధరల తగ్గుదల, పప్పుధాన్యాల సరఫరాను ప్రభుత్వం మెరుగ్గా నిర్వహిస్తుండటం, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ మెరుగుపడటం, చమురు ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగవచ్చన్న అంచనాల నడుమ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండగలదని ఆషిమా పేర్కొన్నారు. మరోవైపు వ్యవస్థాగతమైన సంస్కరణలు జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ.. ఆర్‌బీఐ పాటిస్తున్న కఠిన ద్రవ్యపరపతి విధానమనేది వినియోగం, పెట్టుబడి డిమాండ్‌కి అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top