'ఫండ్లు' అమ్మితే జాగ్రత్త సుమా!

Profit plus special story.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ వేదికల్లో ఎక్కడైనా విక్రయం

ఆన్‌లైన్‌లో యూనిట్లను రిడీమ్‌ చేసుకోవడం ఈజీ

ఎగ్జిట్‌ లోడ్, కటాఫ్‌ సమయం వంటి నిబంధనలుంటాయ్‌

అన్నీ చూసుకుని విక్రయిస్తే  గరిష్ఠ మొత్తం చేతికి  

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల తాజా పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుతుండటంతో ఈ పెట్టుబడుల ప్రవాహం ఆగటం లేదు. ఫండ్స్‌ నిర్వహణలో ఉన్న పెట్టుబడుల విలువ ఏకంగా  రూ.20 లక్షల కోట్లను దాటేసింది. మరి ఈ సమయంలో ఫండ్స్‌లో ఉన్న మీ పెట్టుబడులను వెనక్కి తీసుకుని రిస్క్‌ తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? లేదంటే ఏదైనా నిర్ణీత లక్ష్యం కోసం పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారా? మరి రిడెంప్షన్‌ ఆన్‌లైన్‌లో చేస్తారా? ఆఫ్‌లైన్‌లోనా!!. ఈ మొత్తం చేతికి ఎలా అందుతుంది? ఆన్‌లైన్‌లోనే సులభంగా రిడెంప్షన్‌  చేసుకోవటం ఎలా? అందుకు ఉన్న అవకాశాలేంటి? ఈ వివరాలే మన ‘ప్రాఫిట్‌ ప్లస్‌’ ప్రత్యేక కథనం...

ప్రణాళికే ప్రాతిపదిక
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే (రిడెంప్షన్‌) ముందు మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరాయి కనుక, రిస్క్‌ తగ్గించుకోవాలి కనక ఆ పనిచేస్తున్నారా? లేక ఏదైనా అత్యవసరం పడి అందుకోసం ఫండ్స్‌లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారా? అన్న స్పష్టత కావాలి. వాస్తవానికి మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరాయన్న ఆలోచనతో పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం సరికాదన్నది నిపుణుల మాట.

నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్ణయించిన ప్రణాళిక మేరకే అది జరగాలన్నది వారి సూచన. మార్కెట్లు పెరిగాయని విక్రయిస్తే భవిష్యత్తులో అవి ఇంకా పెరిగిన పక్షంలో అనవసరంగా తప్పు చేశామేమో అని భావించొచ్చు. అందుకే ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారమే దీన్ని కొనసాగించాలి.

ఆఫ్‌లైన్‌/ ఆన్‌లైన్‌ తేడాలివీ...
మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను రిడీమ్‌ చేసుకోవాలనుకుంటే అకౌంట్‌ స్టేట్‌మెంట్‌లో కొన్ని వివరాలను పరిశీలించడం అవసరం. ఫండ్‌ పథకం పేరు, ఫోలియో నంబర్, ఎన్ని యూనిట్లు ఉన్నాయనేది చూడటం ముఖ్యం. అప్పుడు యూనిట్ల మార్కెట్‌ విలువ ఎంతో తెలుస్తుంది. దాంతో ఎంత మేర పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులను ఆన్‌లైన్లో ఉపసంహరించుకోవచ్చు. అలా చేయాలంటే అందుకు ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. ఏజెంట్‌ ద్వారా, డిస్ట్రిబ్యూటర్‌ ద్వారా కొనుగోలు చేసినా గానీ ఫండ్‌ వెబ్‌సైట్‌ లేదా రిజిస్ట్రార్‌ అండ్‌ షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో రిడెంప్షన్‌ చేసుకోవచ్చు.

ఎక్కువ ఫండ్లలో పెట్టుబడులుంటే...
ఒకటికి మించిన మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల పథకాల్లో పెట్టుబడులు ఉండి, వాటిని ఏక కాలంలో వెనక్కి తీసుకోవాలనుకుంటే ఆఫ్‌లైన్‌లో రిజిస్ట్రార్‌ అండ్‌ షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్లు (ఆర్‌టీఏ) అయిన క్యామ్స్, కార్వీ కంప్యూటర్‌ షేర్‌ కార్యాలయాలకు వెళ్లడం వల్ల ఒకేసారి రిడీమ్‌ చేసుకోవచ్చు. అయితే, ఒక రిజిస్ట్రార్‌ అన్ని ఫండ్‌ సంస్థలకూ సేవల ఏజెంట్‌గా లేరు.

కనుక ముందుగానే ఆర్‌టీఏ ఎవరన్నది విచారించుకోవాలి. ఆన్‌లైన్‌లో అయితే ఏ ప్లాట్‌ఫామ్‌ నుంచి కొనుగోలు చేశారో, సులభంగా అదే వేదికగా విక్రయించుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పటికీ సదరు సంస్థ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్‌లైన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఖాతాను యాక్టివేట్‌ చేసుకోవడం ద్వారా రిడెంప్షన్‌ చేసుకునే సౌకర్యం ఉంది.

పాన్‌ నంబర్, ఫోలియో నంబర్, ఈ మెయిల్‌ వివరాలు ఇవ్వడం ద్వారా ఆన్‌లైన్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్‌ అయ్యి, ఏ పథకంలో పెట్టుబడులున్నాయో దాన్ని సెలక్ట్‌ చేసుకుని రిడీమ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఎన్ని యూనిట్లు విక్రయించాలనుకుంటున్నదీ అప్పుడే తెలియజేయాలి. యాప్‌ ద్వారా రిడెంప్షన్‌కు గాను ఆర్‌టీఏలు మైక్యామ్స్, కేట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చాయి.

ఇన్‌స్టంట్‌ రిడెంప్షన్‌...
తక్షణ ఉపసంహరణ సదుపాయం లిక్విడ్‌ ఫండ్స్‌కు వర్తిస్తుంది. ఎందుకంటే లిక్విడ్‌ ఫండ్‌ అన్నది బ్యాంకు ఖాతా మాదిరిగా పనిచేయాలన్నది ఉద్దేశం. కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్ని పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్‌స్టంట్‌ రిడెంప్షన్‌ సదుపాయాన్ని కల్పించాయి. ఉదాహరణకు రిలయన్స్‌ మనీ మేనేజర్‌ ఫండ్, డీఎస్‌పీ బ్లాక్‌ రాక్‌ మనీ మేనేజర్‌ ఫండ్‌ పథకాలు.

ఈ పథకాలకు బ్యాంకు ఖాతాతో లింక్‌ చేసుకుంటే చాలు... బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌ను లిక్విడ్‌ ఫండ్స్‌లోకి మళ్లించుకోవచ్చు. రిలయన్స్‌ మనీ మేనేజర్‌ ఫండ్‌లో అయితే రిడెంప్షన్‌ చేసుకున్న నిమిషాల వ్యవధిలోనే డబ్బులు తిరిగి ఖాతాలోకి వచ్చి చేరతాయి. అర్ధరాత్రి అయినా సరే జాప్యం ఉండదు. మొత్తం పెట్టుబడుల్లో 95 శాతం, గరిష్టంగా రూ.2 లక్షల వరకే ఈ విధంగా రెడీమ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఎన్ని రోజుల్లో నగదు వస్తుంది?
లిక్విడ్‌ లేదా డెట్‌ ఫండ్స్‌ యూనిట్లు రిడీమ్‌ చేసుకుంటే ఒకటి, రెండు రోజుల్లోనే నగదు బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ఇందుకు గాను ఇన్వెస్టర్‌ తన బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు లేకపోతే చెక్‌ ఇంటికొస్తుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే మూడు నుంచి నాలుగు రోజులు తీసుకుంటుంది. అయితే, మొబైల్‌ నంబర్, ఈ మెయిల్‌ తదితర వివరాలు తాజావే ఉన్నాయా అన్నది చూసుకోవాలి.

ఎందుకంటే రిడెంప్షన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మొబైల్, ఈమెయిల్‌కు వస్తుంది. ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మూలధన లాభాల పన్ను ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ పథకాలైతే ఏడాది దాటిన వాటిపై పన్ను లేదు. కానీ, ఆ ఆదాయాన్ని వార్షిక ఆదాయంలో కలిపి పన్ను పరిధిలో ఉంటే చెల్లించాల్సి ఉంటుంది.  

పని దినాల్లోనే రిడెంప్షన్‌...
మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల యూనిట్లను మార్కెట్ల సెలవు దినాల్లో కాకుండా పని దినాల్లో ఎప్పుడైనా విక్రయించుకోవచ్చు. పన్ను ఆదా చేసే ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) యూనిట్లకు మాత్రం మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఉదాహరణకు మీరు 10,000 ఏక మొత్తంలో పెట్టుబడి పెడితే ఆ తేదీ నుంచి సరిగ్గా మూడేళ్ల తర్వాత వెనక్కి తీసేసుకోవచ్చు. అదే సిప్‌ రూపంలో ఇన్వెస్ట్‌ చేస్తుంటే ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు మూడేళ్లు పూర్తి కావాలి.

సాధారణ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులైతే ఇలాంటి లాకిన్‌ పీరియడ్‌ ఏదీ ఉండదు. ఫండ్స్‌లో పెట్టుబడులు యూనిట్ల రూపంలో ఉంటాయి. మీ ఖాతాలో ఉన్న యూనిట్లను ఒక్కో యూనిట్‌ మార్కె ట్‌ విలువ (ఎన్‌ఏవీ)తో లెక్కిస్తే మొత్తం విలువ ఎంతన్నది తెలుస్తుంది. దీన్ని బట్టి మీకు ఎంత అవసరమో ఆ మేరకే యూనిట్లను విక్రయించుకోవచ్చు.  

కటాఫ్‌ సమయం తెలుసా?
కటాఫ్‌ సమయం గురించి కూడా తెలుసుకోవాలి. ఏ సమయంలో దరఖాస్తు చేశారన్నది ఇందుకు కీలకం. ఇందుకు సంబంధించి ఈక్విటీ, డెట్, లిక్విడ్‌ ఫండ్స్‌కు నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటలను చాలా సంస్థలు కటాఫ్‌గా పేర్కొంటున్నాయి. అంటే ఆ సమయంలోపు దరఖాస్తు చేస్తే ఆ రోజు ఎన్‌ఏవీ వర్తిస్తుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ట్రాన్సాక్షన్‌ ఫామ్‌ను ఫండ్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్ని దేశవ్యాప్తంగా సదరు సంస్థకున్న సేవా కేంద్రాల్లో ఎక్కడైనా సమర్పించొచ్చు. స్టాక్స్‌ మాదిరిగా కాకుండా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ట్రేడింగ్‌ స్టాక్‌ మార్కెట్లు ముగిసిన తర్వాత ఒకేసారి జరుగుతుంది.

గడువు తీరితే ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు...
ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలోనూ పెట్టుబడులకు నిర్ణీత కాల వ్యవధి ఉంటుంది. ఆ లోపు విక్రయిస్తే ఎగ్జిట్‌ లోడ్‌ విధిస్తారు. దాన్ని యూనిట్ల ఎన్‌ఏవీలో మినహాయించి కోత వేస్తారు. సాధారణంగా ఈక్విటీ పథకాలకు ఎగ్జిట్‌ లోడ్‌ ఏడాది కాలం ఉంటుంది. ఎందుకంటే లిక్విడ్, డెట్‌ పథకాలతో పోల్చి చూస్తే ఈక్విటీ పథకాలన్నవి దీర్ఘకాలానికి ఉద్దేశించినవి.

కారణం ఈక్విటీ మార్కెట్లలో ఊగిసలాట ఎక్కువ. అందుకే పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసేసుకుండా నిరుత్సాహపరిచేందుకు గాను ఎగ్జిట్‌ లోడ్‌ను నిర్ణయించారు. ఏడాదిలోపు విక్రయంపై ఇది ఒక శాతంగా ఉంది. లిక్విడ్, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్స్‌పై ఎగ్జిట్‌ లోడ్‌ లేదు. ఈక్విటీ పథకాలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను కూడా వర్తిస్తుంది.

సిప్‌ రూపంలో చేసే పెట్టుబడులయితే, ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కు నిర్ణీత కాలం ఎగ్జిట్‌ లోడ్‌ అమలవుతుంది. ఉదాహరణకు సెప్టెంబర్‌ 1న రూ.1,000 ఇన్వెస్ట్‌ చేస్తే మరుసటి ఏడాది అదే తేదీన రిడీమ్‌ చేసుకుంటే ఎగ్జిట్‌ లోడ్‌ ఉండదు. అందుకే సిప్‌ రూపంలో పెట్టుబడులు పెట్టిన వారు కొంతమేరే యూనిట్లను విక్రయించదలిస్తే ముందు కొన్న వాటిని రిడీమ్‌ చేసుకోవాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top