రెండు గంటల్లోనే ఫోన్‌ డెలివరీ

Phone delivery in two hours - Sakshi

‘బిగ్‌ సి’ మొబైల్స్‌ కొత్త సేవలు

మార్చి నాటికి 350 ఔట్‌లెట్లు

సంస్థ ఫౌండర్‌ బాలు చౌదరి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీబ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌ సి’ కొత్త సేవలకు శ్రీకారం చుడుతోంది. వెబ్‌ లేదా ఫోన్‌ కాల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ కావాలని ఆర్డరిస్తే... రెండు గంటల్లోపు ఫ్రీ డెలివరీ చేస్తారు. తమకు ప్రస్తుతం స్టోర్లున్న అన్ని ప్రాంతాల్లో ఈ సేవలను నెల రోజుల్లోగా ప్రారంభిస్తామని ‘బిగ్‌ సి’ ఫౌండర్‌ ఎం.బాలు చౌదరి చెప్పారు. బుధవారమిక్కడ కంపెనీ డైరెక్టర్లు స్వప్న కుమార్, బాలాజీ రెడ్డి, గౌతమ్‌ రెడ్డి, కైలాష్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారుడు కోరితే ఇంటి వద్దే మొబైల్‌ డెమో సైతం ఇస్తామని, దీనికి అదనపు చార్జీలేవీ వసూలు చేయబోమని స్పష్టంచేశారు. మొబైల్స్‌ రిటైల్‌ రంగంలో భారత్‌లో తొలిసారిగా తాము ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.

త్వరలో ఇతర దక్షిణాది రాష్ట్రాలకు..
బిగ్‌ సి 200వ ఔట్‌లెట్‌ను సినీ నటుడు అఖిల్‌ అక్కినేని ప్రారంభించారు. అలాగే బుధవారం మరో ఆరు స్టోర్లను సైతం కంపెనీ తెరిచింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ ఔట్‌లెట్ల సంఖ్య 206కు చేరింది. హైదరాబాద్‌లోనే 60 కేంద్రాలున్నాయని బాలు చౌదరి ఈ సందర్భంగా చెప్పారు. ‘జూలైకల్లా భాగ్యనగరిలో కొత్తగా మరో 40 స్టోర్లు వస్తాయి. ఈ ఏడాదే కర్ణాటక, తమిళనాడు, కేరళలో అడుగుపెడుతున్నాం. వీటిలో ప్రతి రాష్ట్రంలో ఏడాదిన్నరలో 100 కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మొత్తంగా 2019 మార్చి నాటికి బిగ్‌ సి ఔట్‌లెట్ల సంఖ్య 350 దాటుతుంది. కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాది కాలంలో అన్ని స్టోర్లను అప్‌గ్రేడ్‌ చేశాం’ అని వివరించారు.

50 శాతం వాటా లక్ష్యం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆఫ్‌లైన్‌లో ప్రస్తుతం నెలకు 7.5 లక్షల వరకూ మొబైల్‌ ఫోన్‌లు అమ్ముడవుతున్నాయని, దీన్లో తమ వాటా 33 శాతమని ఈ సందర్భంగా బాలు చౌదరి చెప్పారు. ‘‘ఏడాదిలో ఈ వాటాను 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా దగ్గర కొంటున్న వారిలో 80 శాతం మంది అంతకు ముందు కొన్నవారే ఉంటున్నారు.  2017–18లో కంపెనీ రూ.1,000 కోట్లకుపైగా టర్నోవర్‌ను నమోదు చేసింది. ఈ ఏడాది రూ.2,000 కోట్లు దాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సంస్థ ఔట్‌లెట్లలో మొత్తం 2,500 మంది ఉద్యోగులున్నారు. ఒక్కో కేంద్రం ద్వారా కొత్తగా 12– 15 మందికి ఉపాధి లభిస్తోందని బాలు చౌదరి తెలియజేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top