అక్కడ డీజిల్‌ ధర రూ.119.31 | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు భారీగా ఇంధన ధరల పెంపు

Published Mon, Jul 2 2018 8:20 AM

Pakistan Hikes Fuel Prices Ahead Of Elections - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నాసిరుల్ ముల్క్‌ నేతృత్వంలో సాగుతున్న తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో భారీగా ఇంధన ధరలు పెంచేసింది. ఈ నెలలో దేశమంతా ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఇంధన ధరలు పెంచుతున్నట్టు శనివారం ప్రకటన విడుదల చేసింది. గత రెండు నెలల కాలంలోనే ఇలా ధరలు పెంచడం ఇది రెండోసారి. పెంచిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి తీసుకు వచ్చిన్నట్టు గియో టీవీ రిపోర్టు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం పెట్రోల్‌పై రూ.7.54, డీజిల్‌పై రూ.14.00, కిరోసిన్‌ ఆయిల్‌పై రూ.3.36, లైట్‌ డీజిల్‌పై రూ.5.92, హై-స్పీడ్‌ డీజిల్‌పై రూ.6.55 ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. దీంతో పెట్రోల్‌ ధర రూ.99.50కు, డీజిల్‌ ధర రూ.119.31కు, కిరోసిన్‌ ఆయిల్‌ ధర రూ.87.70కు, లైట్‌ డీజిల్‌ ధర రూ.80.91కు, హై-స్పీడ్‌ డీజిల్‌ ధర రూ.105.31కు ఎగిసింది. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంధన ధరలు భారీగా పెంచడంపై ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. ఇది దేశంలోని ప్రజలకు ఆర్థికపరమైన ఆందోళనలు  కలిగించే అవకాశముందుని ఆర్థిక వేత్తలంటున్నారు.  పాకిస్తాన్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ అథారిటీ(ఓజీఆర్‌ఏ) మాత్రం పెట్రోల్‌పై రూ.5.40, డీజిల్‌పై రూ.6.20, కిరోసిన్‌ ఆయిల్‌పై రూ.12 మాత్రమే పెంచాలని ప్రతిపాదించింది. కానీ ఓజీఆర్‌ఏ ప్రతిపాదించిన దాని కన్నా ఎక్కువగా ఇంధనాలపై ధరలను ముల్క్‌ ప్రభుత్వం పెంచింది. ఈ నెల మొదట్లో కూడా పెట్రోల్‌పై రూ.4.26, డీజిల్‌పై రూ.6.55, కిరోసిన్‌ ఆయిల్‌పై రూ.4.46 ధరలను పెంచింది. ఈ ధరలు జూన్‌ 12 నుంచి జూన్‌ 30 వరకు అమల్లో ఉన్నాయి. ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ చైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ స్పందించారు. ప్రజలపై అనవసరమైన ఆర్థిక భారం మోపకుండా.. ఎన్నికలు వెళ్లేలా దృష్టిసారించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.   
 

Advertisement
Advertisement