వాల్యూ ఇన్వెస్టింగ్‌ పనిచేయదు! | Old style value investing doesn’t work | Sakshi
Sakshi News home page

వాల్యూ ఇన్వెస్టింగ్‌ పనిచేయదు!

May 30 2020 11:44 AM | Updated on May 30 2020 11:44 AM

Old style value investing doesn’t work - Sakshi

షేర్లను పీఈ నిష్పత్తి ఆధారంగా పరిశీలించి పెట్టుబడి పెట్టే వాల్యూ ఇన్వెస్టింగ్‌ విధానం ఇకపై ఏమాత్రం సత్ఫలితాలివ్వదని ప్రముఖ అనలిస్టు అశ్వత్థ్‌ దామోదరన్‌ అభిప్రాయపడ్డారు. వాల్యూ ఇన్వెస్టింగ్‌ 20వ శతాబ్దానిదని, 21వ శతాబ్దిలో పనిచేయదని చెప్పారు. నిజానికి పెట్టుబడిని వాల్యూ, గ్రోత్‌ అని వర్గీకరించడం సబబుకాదని అభిప్రాయపడ్డారు. వీటి నిర్వచనాలకు అనుగుణంగా పెట్టుబడులు తగిన రాబడులు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యంగా వాల్యూ ఇన్వెస్టింగ్‌ అనేదానికి అర్ధంలేకుండా పోయిందని, దశాబ్ద కాలంగా చూస్తే స్వల్ప పీఈ, అధిక డివిడెండ్‌ ఈల్డ్స్‌ ఉన్న షేర్లు అధిక నష్టాలను ఇన్వెస్టర్లకు మిగిల్చాయని చెప్పారు. ఇదే సమయంలో అధిక వాల్యూషనున్న షేర్లు మంచి రాబడినిచ్చాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి బుక్‌ వాల్యూ అనేదానికి పూర్తిగా విలువ లేకుండా పోయిందన్నారు. వాల్యూ ఇన్వెస్టర్లు అల్ప పీఈ, బుక్‌వాల్యూ లాంటివాటితో విశ్లేషణ జరుపుతారని, గ్రోత్‌ఇన్వెస్టర్లు ఎర్నింగ్స్‌ ఆధారంగా విశ్లేషణ జరుపుతారని చెప్పారు. అయితే వాస్తవంలో వాల్యూ ఇన్వెస్టింగ్‌ క్రమంగా గ్రోత్‌ ఇన్వెస్టింగ్‌తో పోలిస్తే ప్రభ కోల్పోతుందన్నారు. ఒక గ్రోత్‌ కంపెనీ అండర్‌వాల్యూతో ఉండొచ్చని చెప్పారు. ఉదాహరణకు ఫేస్‌బుక్‌, టెస్లా షేర్లు వాల్యూ ఇన్వెస్టర్ల నిర్వచనానికి సరిపోవని, కానీ ఇవి మంచి రాబడినిస్తున్నాయని చెప్పారు. వాల్యూ ఇనె​‍్వస్టర్లు మాత్రం ఇంకా పాత విధానాలను పట్టుకొని వేళాడుతూ, మరో పదేళ్లు వేచిచూస్తే మంచి లాభాలు వస్తాయనే భ్రమలో ఉంటున్నారన్నారు. కానీ అల్పపీఈ స్టాకులే అధికంగా దెబ్బతింటున్నాయని, అందువల్ల ఇకనైనా మదుపరులు ఈ వాల్యూ ఇన్వెస్టింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మానుకోవాలని సూచించారు. 
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలేవైనా కరోనా కారక నష్టం నుంచి 100 శాతం కోలుకోవడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్షోభానంతర ఎకానమీ భిన్నంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో అప్పులున్న కంపెనీలు, అనుభవం తక్కువున్న కంపెనీలు డిఫాల్టయ్యే అవకాశాలు పెరిగాయన్నారు. ఇకపై కంపెనీల విలువ మదింపు చేయాలంటే వాల్యూషన్ల కన్నా వాటి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కరోనాతో హోటల్స్‌, ఏవియేషన్‌,  రవాణా, టూరిజం రంగాలు భారీగా దెబ్బతింటాయని, చిన్నా చితక స్టార్టప్స్‌ను ఆయా రంగాల్లోని బడా కంపెనీలు మింగేస్తాయని చెప్పారు. ఇదే సమయంలో అమెజాన్‌ లాంటి కంపెనీలు మరింతగా ఎదుగుతాయన్నారు. ఈవిధంగా ప్రపంచమంతా షట్‌డౌన్‌ పాటించే స్థితి ఇటీవల కాలంలో ఎప్పుడూ రాలేదన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement