సెకండ్స్‌ హోమ్‌!

New homes and resell - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో కొత్త గృహాలకు డిమాండ్‌ ఎంత ఉందో రీసేల్‌ లేక సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్లకూ అంతే ఉంది. కొత్త ఇల్లు నేరుగా డెవలపర్‌ నుంచి కొనుగోలు చేస్తే.. రీసేల్‌ ప్రాపర్టీలను పాత యజమాని నుంచి కొనుగోలు చేస్తాం. కొత్త లేక పాత ప్రాపర్టీ ఏదైనా కానీ ఎంపికలో ప్రధానమైంది బడ్జెట్‌. దీంతో పాటూ మన జీవన శైలి, అవసరాలు, అభిరుచులు, ఇంటీరియర్, ఇంధన సామర్థ్యాలు వంటివి కూడా ప్రాపర్టీ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

ప్రధాన నగరంలో సెకండ్సే బెటర్‌..
ఉండేందుకు ఇల్లు కొనుగోలు చేసినవారెవరైనా సరే ఎప్పటికీ ఒకే ఇంట్లో ఉండాలనుకుంటారు. ఫ్యామిలీ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు గానీ ఉద్యోగ రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గానీ ఆర్ధిక అవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకుంటారు.

విద్యా, వైద్యం, వినోదం ఇతరత్రా అవసరాలకు రోజూ ప్రధాన నగరంతో అనుబంధం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో కొత్త గృహాలు దొరకడం కొంత కష్టం. ఒకవేళ దొరికినా ధర ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఏరియాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఇల్లును కొనుగోలు చేయడం బెటర్‌. అవసరమైతే దాన్ని కూల్చేసి మన అవసరాలు, బడ్జెట్‌కు తగ్గట్టుగా మళ్లీ కొత్త గృహాన్ని నిర్మించుకోవచ్చు. అయితే ఇది కొంత డబ్బు, సమయంతో ముడిపడి ఉన్న అంశం.
పర్యావరణం స్పృహ, ఇంధన నిర్వహణ సామర్థ్యాలు, కరెంట్‌ బిల్లుల మీద అవగాహన ఉంటే మాత్రం కొత్త ఇల్లు కొనడమే ఉత్తమం. ఎందుకంటే కొత్త గృహాలు ఎనర్జీ ఎఫీషియన్సీ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇంట్లోనే ఉపకరణాలతో పాటు గోడలు, పైకప్పులు, కిటికీలు, తలుపులు కూడా ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. దీంతో విద్యుత్‌ బిల్లు తక్కువగా రావటంతో పాటు నిర్వహణ వ్యయం కూడా తక్కువ అవుతుంది.

రీసేల్‌ కొనేముందు..
రీసేల్‌ ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు పాత యజమాని నేపథ్యం, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, టైటిల్, అనుమతి పత్రాలు, గృహ రుణానికి సంబంధించిన పత్రాలు వంటి వాటిని స్వయంగా పరిశీలించుకోవాలి. ఏమాత్రం అవగాహన లేకపోయినా లేక తప్పిదం జరిగినా సరే మొదటికే మోసం వస్తుంది. అదే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే ఈ ప్రక్రియంతా డెవలపరే పూర్తి చేసేస్తాడు.
   పాత ఇళ్లలో ఎలక్ట్రిక్‌ వైర్లు, ఉపకరణాలు, బాత్‌రూమ్‌ ఫిట్టింగ్స్‌ వంటి వాటిల్లో సమస్య వస్తుంటుంది. అదే కొత్త గృహాల్లో బ్రాండెడ్, నాణ్యమైన ఉత్పత్తుల వినియోగంతో ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. పైగా పాత ఇళ్లలో వాస్తు మార్పులు, గదుల్లో చిన్న చిన్న మార్పులు చేయా లంటే ఇబ్బందులుంటాయి. అదే కొత్త గృహా ల్లో నిర్మాణంలో ఉన్నప్పటి నుంచే డెవలపర్‌కు మన అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణంలో  మార్పులు చేసుకునే వీలుంటుంది.

నిర్వహణ భారం అనుకుంటే కొత్తవే ఉత్తమం
సాక్షి, హైదరాబాద్‌: కొత్త గృహాలతో పోలిస్తే రీసేల్‌ ప్రాపర్టీలు కొంత తక్కువ ధరకే లభ్యమవుతాయి. కానీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రాపర్టీ బదిలీ రుసుము, వినియోగ చార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. పైగా సెకండ్‌ హ్యాండ్‌ హోమ్స్‌ నిర్వహణ భారం ఎక్కువగా ఉంటుంది. పైగా మన అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఇంటిని రిపేర్‌ చేయించాల్సి ఉంటుంది. ఆయా ఖర్చులన్నింటినీ కలిపి చూస్తే మాత్రం రీసేల్‌ ప్రాపర్టీ కంటే అభివృద్ధి చెందే ప్రాంతంలో, శివారు ప్రాంతంలోని కొత్త గృహాల ధరలే తక్కువగా ఉంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top