ఉద్దీపనలు బాగున్నా.. వృద్ధి అంతంతే!

Moodys Report on Indian GDP Growth Rate - Sakshi

పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థల అంచనా

దేశీ, అంతర్జాతీయ ప్రతికూలతలు

ఆగస్టు 31న ఏప్రిల్‌–జూన్‌  త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రస్తుతం తీవ్రంగా ఉన్నాయని పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటు దేశీయ అటు అంతర్జాతీయ ప్రతికూలతలు దీనికి కారణమన్నది ప్రధాన విశ్లేషణ. ఈ నెలాఖరున ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక గణాంకాలు వెల్లడవుతుండడం దీనికి నేపథ్యం. ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

వృద్ధి 6.4 శాతమే!: మూడీస్‌
ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని ఇవ్వడానికి ఇటీవల ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఉద్దీపన చర్యలు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ మెరుగుకు మద్దతునిస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– మూడీస్‌ విశ్లేషించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి మాత్రం 6.4 మాత్రమే ఉంటుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ సోమవారం అంచనావేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక ప్రతికూల అంశాలు దీనికి కారణమని పేర్కొంది. మూడీస్‌ (సావరిన్‌ రిస్క్‌ గ్రూప్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ విలియమ్‌ ఫాస్టెర్‌ మాట్లాడుతూ,  ‘‘2019–20లో వృద్ధి 6.4 శాతంగానే ఉన్నా, 2020–2021లో ఈ రేటు 6.8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. పన్ను రాయితీలు, వివిధ రంగాల్లో సంస్కరణలు ఆర్థిక వృద్ధి మెరుగుకు దీర్ఘకాలంలో దోహదపడుతుంది.  ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన పెంపు ద్రవ్య లభ్యతకు దోహదపడుతుంది’’ అని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం వల్ల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరో దఫా రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

క్యూ1లో  5.5 శాతమే: యస్‌బ్యాంక్‌
యస్‌బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ సుభద్రా రావు కూడా భారత్‌ ఆర్థిక వ్యవస్థపై నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 5.5 శాతంగానే ఉంటుందని వివరించారు.

మూలధనం పెంపుతో తక్షణ ప్రయోజనం ఉండదు: ఎస్‌అండ్‌పీ
ఆర్థిక ఉద్దీపన చర్యల్లో భాగంగా బ్యాంకింగ్‌కు తాజాగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రూ.70,000 కోట్ల మూలధన కల్పన వల్ల తక్షణ ప్రయోజనం ఏదీ ఒనగూరకపోవచ్చునని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం– స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ (ఎస్‌అండ్‌పీ) అంచనావేస్తోంది. కార్పొరేట్స్‌ నుంచి బలహీన రుణ డిమాండ్, ఎన్‌బీఎఫ్‌సీల రుణ సంక్షోభ పరిస్థితులు దీనికి కారణంగా ఎస్‌అండ్‌పీ తన తాజా నివేదికలో విశ్లేషించింది. బ్యాంకింగ్‌ రుణ నాణ్యత మెరుగుకు మరికొన్ని సంవత్సరాలు పడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 7 శాతంపైన ప్రస్తుతం వృద్ధి రేటు కష్టమని పేర్కొంది.

ఇప్పుడప్పుడే వృద్ధి ‘టర్నెరౌండ్‌’ కష్టం: డీఅండ్‌బీ
దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊపందుకోవడం తక్షణం కష్టమని ఆర్థిక విశ్లేషణ సంస్థ– డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ భారత్‌ వ్యవహారాల చీఫ్‌ ఎకనమిస్ట్‌ అరుణ్‌ సింగ్‌ తెలిపారు. పైగా మరింత దిగజారే అవకాశమూ ఉందని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంస్థాగత సవాళ్లకు తగిన పరిష్కార మార్గాన్ని ఇంకా కనుగొనక పోవడమే దీనికి కారణంగా వివరించారు. ప్రస్తుతం దేశంలో పారిశ్రామిక రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు.  పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 66 శాతం వాటా కలిగిన తయారీ రంగం కోలుకునే పరిస్థితి లేకపోవడమే డీఅండ్‌బీ ఎకానమీ అబ్జర్వర్‌ విశ్లేషణకు కారణంగా పేర్కొన్నారు.

ఆర్‌బీఐ నుంచి భారీ నిధులు ప్రయోజనమే!
ఇదిలావుండగా ఆర్‌బీఐ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి అందుతున్న రూ. 1,76,051 కోట్లు వృద్ధిబాటలో తగిన సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్న విశ్లేషణ పలు వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మందగమనంపై పోరు, బ్యాంకులకు తాజా మూలధన కల్పన వంటి అవసరాలకు కేంద్రం ఈ నిధులను వెచ్చిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  అయితే ఈ నిధుల్లో అధిక మొత్తం  మౌలిక రంగంపైనే ప్రభుత్వం వెచ్చిస్తుందన్న అభిప్రాయాన్ని బ్రోకరేజ్‌ సంస్థ.. ఎమ్‌కే  పరిశోధనా నివేదిక తెలిపింది. కాగా బ్యాంకులకు రూ.70,000 కోట్ల తాజా మూలధన ప్రకటన విషయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ ప్రస్తావిస్తూ, ఆర్‌బీఐ నుంచి అందుతున్న నిధుల్లో కొంత భాగాన్ని కేంద్రం సంబంధిత మూలధన కల్పనకు వినియోగిస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019–20 ఏడాదికి కేంద్ర 3.38 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాలను చేరుకోవడంలో ఆర్‌బీఐ నిధుల బదలాయింపు కీలకమవుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనమిస్ట్‌ సమీర్‌ నారంగ్‌ పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top