సూచీలకు జీడీపీ వృద్ధి జోష్‌..! | From latest GDP data to global cues to rupee movement | Sakshi
Sakshi News home page

సూచీలకు జీడీపీ వృద్ధి జోష్‌..!

Sep 3 2018 1:48 AM | Updated on Sep 3 2018 1:48 AM

From latest GDP data to global cues to rupee movement - Sakshi

ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌)లో 8.2 శాతంగా నమోదైంది. ఇది ఏకంగా తొమ్మిది త్రైమాసికాల గరిష్టస్థాయి కాగా, గడిచిన వారం మార్కెట్‌ ముగిసిన తరువాత ఈ సమాచారం వెల్లడైన నేపథ్యంలో ఈ సానుకూల ప్రభావం మార్కెట్‌పై సోమవారం సుస్పష్టంగా కనిపించనుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. ‘వృద్ధి రేటు జోష్‌ మార్కెట్‌ దిశపై ప్రభావం చూపనుంది.’ అని ఆనంద్‌ రాఠీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రధాన ఆర్థికవేత్త సుజన్‌ హజరా అన్నారు.

అంతర్జాతీయ పరిణామాలు, జీడీపీ వృద్ధి జోష్, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో సూచీల దిశానిర్దేశం చేయనున్నట్లు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్, ఎస్‌ఎమ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ చైర్మన్‌ డీ కే అగర్వాల్‌ అంచనావేశారు. సోమవారం వెలువడే తయారీ, సేవారంగాల పీఎమ్‌ఐపై సైతం మార్కెట్‌ దృష్టిసారించినట్లు వివరించారు. మౌలిక సదుపాయాల నిర్మాణ వృద్ధిరేటు నెమ్మదించినప్పటికీ.. జోరుమీదున్న జీడీపీ వృద్ధి మార్కెట్‌కు సానుకూలంగా ఉండనుందని డెల్టా గ్లోబల్‌ పాట్న ర్స్‌ ప్రిన్సిపల్‌ పాట్నర్‌ దేవేంద్ర నెవ్గి విశ్లేషించారు.  

ఆటో అమ్మకాల ప్రభావం
కేరళ వరదల కారణంగా ఆగస్టులో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు అమ్మకాలలో అంతంత మాత్రం వృద్ధిరేటుకే పరిమితమయ్యాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్ర, అశోక్‌లేలాండ్‌ సంస్థల అమ్మకాలు రెండంకెల వృద్ధిరేటును నమోదుచేయగా.. మారుతి సుజుకీ మాత్రం 3.40 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ఈ అంశం మార్కెట్‌ కీలకంగా ఉండనుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు.

రూపాయి పతనం ఆగేనా..?
గతవారంలో డాలర్‌తో రూపాయి మారకం చరిత్రాత్మక కనిష్టస్థాయిని నమోదుచేసింది. 71 వద్దకు పడిపోయింది. ఈస్థాయి పతనం వల్ల ఐటీ రంగ షేర్లు జోరుమీద ఉండగా.. ఇది ఎంతో కాలం కొనసాగే పరుగుకాదని, ఈ రంగ షేర్లు ఓవర్‌ బాట్‌ దశలో ఉన్న కారణంగా కరెక్షన్‌ చూసే అవకాశం ఉందని సామ్‌కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ పేర్కొన్నారు. మార్కెట్‌ లాభాల స్వీకరణ జోన్‌లోనే ఉండేందుకు ఆస్కారం ఉందని అన్నారు.

మరోవైపు ముడిచమురు ధరలు పెరుగుతున్నందున ఈ వారంలో ఫార్మా, ఐటీ రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు ప్రత్యేక దృష్టిసారించనున్నారని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ‘అంచనాలను మించిన జీడీపీ వృద్ధిరేటు ఈవారంలో రూపాయి విలువకు కొంతమేర బలాన్ని చేకూర్చవచ్చు. అయితే, త్వరలోనే  72–73 స్థాయికి రూపాయి బలహీనపడుతుందనే అంచనాల నేపథ్యంలో దిగుమతిదారుల నుంచి ఒత్తిడి పెరిగి బలహీనత కొనసాగేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్‌ రాఠీ స్టాక్‌ బ్రోకింగ్‌ రుషభా అన్నారు.

వాణిజ్య యుద్ధ ప్రభావం
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఈ అంశంపై ఫోకస్‌ ఉంచినట్లు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు పేర్కొన్నాయి.  శుక్రవారం వెల్లడికానున్న అమెరికా జాబ్‌డేటా సైతం కీలకమైన అంశమే.

సగటు కంటే తక్కువ వర్షపాతం
ఆగస్టు 30 నాటికి సగటు వర్షపాతం 6 శాతానికంటే తక్కువగానే ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబరు మొదటి వారంలో ఎటువంటి సూచనలు అందుతాయనే అంశం మార్కెట్‌కు ప్రధాన అంశం కానుందని భావిస్తున్నారు.


విదేశీ నిధుల వరద
విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం గతనెలలోనూ కొనసాగింది. ఆగస్టులో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) క్యాపిటల్‌ మార్కెట్‌లో రూ.5,100 కోట్ల పెట్టుబడులను కుమ్మరించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం వీరు మన స్టాక్‌ మార్కెట్లో రూ.1,775 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.3,414 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. జూలైలో రూ.2,300 కోట్లను పెట్టుబడి పెట్టిన ఎఫ్‌పీఐలు గతనెలలో సైతం నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఈఏడాది ఏప్రిల్‌ – జూన్‌ కాలంలో రూ.61,000 కోట్లు పెట్టుబడిపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement