యూట్యూబ్‌ వీడియోలతో రూ. 500 కోట్ల నష్టం...!

Kalyan Jewellers Moves Kerala High Court After Fake News on YouTube Videos Causes Huge Loss - Sakshi

నకిలీ వార్తలపై కేరళ హైకోర్టును ఆశ్రయించిన కళ్యాణ్‌ జువెల్లర్స్‌

తిరువనంతపురం : సోషల్‌ మీడియాలో తమ బ్రాండ్‌ గురించి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్‌ జువెల్లర్స్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నకిలీ ఆభరణాలు అమ్ముతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారం వల్ల సుమారు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కళ్యాణ్‌ జువెల్లర్స్‌ కేరళ బ్రాంచ్‌ పేర్కొంది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపింది.

వివరాలు...  నకిలీ బంగారు ఆభరణాలు అమ్ముతున్న కారణంగా కళ్యాణ్‌ జువెల్లర్స్‌ను సీజ్‌ చేశారంటూ యూట్యూబ్‌లో వీడియోలు ప్రసారం కావడంతో కంపెనీ యాజమాన్యం కంగుతింది. కళ్యాణ్‌ జువెల్లర్స్‌ కువైట్‌ బ్రాంచ్‌లో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను ఎడిట్‌ చేసి ఈవిధంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

సాధారణ తనిఖీలను అవినీతి నిరోధక దాడులుగా చిత్రీకరించి ప్రత్యర్థి కంపెనీలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని కళ్యాణ్‌ జువెల్లర్స్‌ ఆరోపించింది. తమ బ్రాండ్‌ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా కళ్యాణ్‌ జువెల్లర్స్‌ లోగోతో యూట్యూబ్‌ చానల్‌లో నకిలీ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. సోషల్‌ మీడియాపై సరైన నిఘా లేనందు వల్లే ఇలాంటి నకిలీ వార్తలు, వీడియోలు ప్రసారం అవుతున్నాయని ఆరోపించింది. కళ్యాణ్‌ జ్యువెల్లర్స్‌ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. సోషల్‌ మీడియా నకిలీ వార్తలు అదుపు చేసేందుకు క్రమబద్దీకరణలు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కాగా గతంలో కూడా కళ్యాణ్‌ జ్యువెల్లర్స్‌పై సోషల్‌ మీడియాలో ఇలాంటి ప్రచారం జరిగింది. కళ్యాణ్‌ జువెల్లర్స్‌లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు నకిలీవని ఐదుగురు వ్యక్తులు సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో గతేడాది నవంబర్‌లో కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబాయ్‌ పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్‌ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్‌ క్రైమ్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top