మళ్లీ పరిశ్రమల నేలచూపు! | July IIP at 0.5% versus 3.4% in June | Sakshi
Sakshi News home page

మళ్లీ పరిశ్రమల నేలచూపు!

Sep 13 2014 12:33 AM | Updated on Aug 15 2018 2:20 PM

మళ్లీ పరిశ్రమల నేలచూపు! - Sakshi

మళ్లీ పరిశ్రమల నేలచూపు!

ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలపై జూలై పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ) నీళ్లు చల్లింది.

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలపై జూలై పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ) నీళ్లు చల్లింది. వృద్ధి రేటు కేవలం 0.5 శాతంగా నమోదయ్యింది. మే నెలలో 5 శాతంగా నమోదయిన వృద్ధి రేటు, అటు తర్వాత నెలల్లో అంటే జూన్‌లో 3.9 శాతానికి తగ్గగా, తాజాగా మరింత దిగజారింది. రెండవ క్వార్టర్ తొలి నెలలో ఈ తరహా గణాంకాలు వెలువడడం రికవరీ ఆశలపై నీళ్లు చల్లడమేనని నిపుణులు కొందరు విశ్లేషిస్తున్నారు.

స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి క్వార్టర్‌లో 5.7% వృద్ధి సాధించింది. మొత్తం జీడీపీలో ఐఐపీ వాటా దాదాపు 15%గా ఉంది. 2013 జూలై నెలలో వృద్ధి 2.6%. కాగా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొదటి నాలుగు నెలల్లో (ఏప్రిల్-జూన్) గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోల్చితే వృద్ధి రేటు 3.3%గా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో అసలు వృద్ధి లేకపోగా 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. తయారీ, వినియోగ వస్తువుల విభాగాలు అతి పేలవ పనితీరు మొత్తం గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపింది.

 ఐదు ప్రధాన రంగాలు ఇలా...
  తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (-1.0%) నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో వృద్ధి 3 శాతం. అయితే ఏప్రిల్-జూలై నెలల్లో మాత్రం ఈ రంగం -0.1 శాతం క్షీణత నుంచి 2.3% వృద్ధి బాటకు చేరింది. జూలైలో తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 12 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి.

మైనింగ్: ఈ రంగం క్షీణత -3 శాతం నుంచి 2.1 శాతం వృద్ధికి మళ్లింది. నాలుగు నెలల్లో సైతం -4.3 శాతం క్షీణత నుంచి 2.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది.
 
విద్యుత్: మంచి ఫలితాలను నమోదుచేసుకుంది. జూలైలో వృద్ధి 5.2 శాతం నుంచి 11.7 శాతానికి ఎగసింది. నాలుగు నెలల్లో సైతం ఇదే తీరున వృద్ధి రేటు 3.9 శాతం నుంచి 11.4 శాతానికి చేరింది.
 
వినియోగ వస్తువులు: వినియోగ వస్తువుల విభాగాన్ని మొత్తంగా చూస్తే- క్షీణత మరింత దిగజారింది. -0.7 శాతం క్షీణత మరింత దిగజారి -7.4 శాతానికి తగ్గింది. ఏప్రిల్-జూలైలో సైతం ఈ రంగం క్షీణత -1.8 శాతం నుంచి -4.5 శాతానికి పడింది. ఇక ఈ విభాగంలో ఒక భాగమైన వైట్ గూడ్స్ వంటి మన్నికైన వినియోగ వస్తువుల కేటగిరీలో క్షీణత -9.6 శాతం నుంచి -20.9 శాతానికి పడింది. 2014-15 తొలి నాలుగు నెలల్లో సైతం ఇదే ధోరణిలో -11.9 శాతం నుంచి -12.5 శాతానికి దిగింది.

ఇక ఇందులోని మరో కేటగిరీ ఎఫ్‌ఎంసీజీ వంటి తక్కువ కాలంలో వినియోగించే వస్తువుల(నాన్-డ్యూరబుల్స్) విభాగాన్ని చూస్తే... వృద్ధి ఉన్నప్పటికీ ఇది 7.4 శాతం నుంచి 2.9 శాతానికి పడిపోయింది. తొలి నాలుగు నెలల్లో సైతం ఇదే రీతిన వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 1.3 శాతానికి పతనమయ్యింది.

 క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు సంకేతమైన ఈ రంగంలో వృద్ధి రేటు క్షీణతలోకి జారింది. అంటే 2013 జూలైలో ఈ రంగం 15.9 శాతం వృద్ధిని నమోదుచేస్తే, తాజాగా అసలు వృద్ధి లేకపోగా - 3.8 శాతానికి పడింది. అయితే నాలుగు నెలల్లో వృద్ధిలోనే కొనసాగుతూ, సానుకూలతలో ఉంది. ఈ రేటు 1.4 శాతం నుంచి 8.5 శాతానికి ఎగసింది.
 
 తయారీపై దృష్టి అవశ్యం: పరిశ్రమలు
 తయారీ రంగం ఇబ్బందుల నుంచి బయట పడలేదన్న విషయం గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల సానుకూలతకు, మౌలిక రంగం అభివృద్ధికి సంకేతాలు ఉన్నప్పటికీ తయారీ రంగం వృద్ధికి ఆమడదూరంలోనే ఉందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.
 
 కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ బిర్లా అన్నారు. ఆర్థికాభివృద్ధి విషయంలో ఉత్సాహం నెలకొన్నప్పటికీ, సుస్థిర వృద్ధిని సాధించడానికి పటిష్ట పాలసీ విధానం అవసరాన్ని గణాంకాలు పేర్కొంటున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. పండుగల సీజన్‌లో వైట్‌గూడ్స్ వస్తువుల విభాగంలో డిమాండ్ పెరగడానికి సానుకూల వడ్డీరేట్ల వాతావరణం అవసరమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement