ట్రూజెట్‌తో జెట్‌ ఒప్పందం రద్దు!

Jet Airways calls off ATR wet leasing deal with TruJet - Sakshi

తగినంత మంది సిబ్బంది లేకపోవటం వల్లే

‘డ్రై లీజు’ అయితే ఓకే అంటున్న జెట్‌!   

ముంబై: విమానయాన సంస్థ ట్రూజెట్‌కి కొన్ని ప్రాంతీయ విమానాలను లీజుకిచ్చే ఒప్పంద ప్రతిపాదనను రద్దు చేసుకున్నట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ వెల్లడించింది. గడువు తేదీలోగా ఒప్పంద షరతుల్ని అమలు చేయటంలో ట్రూజెట్‌ విఫలం కావడమే దీనికి కారణమని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌... నిధుల సమీకరణ కోసం పలు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ నుంచి పలు ప్రాంతీయ రూట్లలో విమాన సర్వీసులు అందిస్తున్న ట్రూజెట్‌కు ఏడు విమానాలను వెట్‌ లీజుకు ఇవ్వాలని భావించింది.

వెట్‌ లీజు కింద విమానంతో పాటు సిబ్బంది, నిర్వహణ, బీమా మొదలైనవన్నీ కూడా జెట్‌ ఎయిర్‌వేసే సమకూర్చాల్సి ఉంటుంది. అయితే, నిధుల కొరతతో కొన్నాళ్లుగా సిబ్బందికి జీతాల చెల్లింపులను కూడా వాయిదా వేస్తూ వస్తుండటంతో పలువురు పైలట్లు ఇప్పటికే జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో విమానాలతో పాటు తగినంత మంది సిబ్బందిని ట్రూజెట్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ పంపే పరిస్థితి లేకుండా పోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో ట్రూజెట్‌కు డ్రై లీజు గనక ఆమోదయోగ్యమైతే కేవలం విమానాలను మాత్రమే లీజుకివ్వొచ్చని జెట్‌ భావిస్తున్నట్లు వివరించాయి. ‘కానీ మార్కెట్‌ నుంచి ఏటీఆర్‌ విమానాలను లీజుకు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ ఇలాంటి విమానాలను నడిపే సుశిక్షితులైన పైలట్ల కొరతే సమస్య. కాబట్టి ట్రూజెట్‌ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా... అనేది అనుమానమే. విమానాలను డ్రై లీజుకు తీసుకోవడం ఆర్థికంగా ఆ సంస్థకు కూడా ప్రయోజనకరం కాకపోవచ్చు’’ అని ఆ వర్గాలు వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top