రండి... పెట్టుబడులు పెట్టండి! | Jaitley's invitation to Asian countries | Sakshi
Sakshi News home page

రండి... పెట్టుబడులు పెట్టండి!

Jan 24 2018 2:40 AM | Updated on Aug 20 2018 5:17 PM

Jaitley's invitation to Asian countries - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్‌ దేశాలను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం అభ్యర్థించారు. ముఖ్యంగా మౌలిక, సేవల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి భారత్‌ అంతర్జాతీయ ప్రమాణాలను సాధించిందని పేర్కొన్న జైట్లీ... దేశంలో పెట్టుబడుల ద్వారా పరస్పర ప్రయోజనాలను పొందవచ్చని ఆసియాన్‌ దేశాలకు వివరించారు. ఆసియాన్‌–భారత్‌ వ్యాపార పెట్టుబడుల వీడ్కోలు సమావేశంలో జైట్లీ ప్రసంగం

ముఖ్యాంశాలు ఇవీ...: భారత్‌ వృద్ధి రేటు గడచిన 25 సంవత్సరాల్లో ఊపందుకుంది. వచ్చే రెండు, మూడు దశాబ్దాల్లో భారత్‌లో ఆర్థికాభివృద్ధి అవకాశాలను పెట్టుబడిదారులు పరిశీలిస్తున్నారు.
♦ మౌలిక రంగంలో పెట్టుబడులకు భారత్‌ మంచి అవకాశాలను ఆఫర్‌ చేస్తోంది.  మౌలిక రంగం వృద్ధి భారత్‌ వృద్ధికి ఎంతో కీలకం. తయారీ, సేవల రంగాల్లో పెట్టుబడుల పెంపునకూ భారత్‌ అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
 ఆసియాన్‌ గ్రూప్‌లో దాదాపు 200 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలూ మెరుగుపడతాయి. పరస్పర పెట్టుబడుల పెంపుతో ఆర్థిక క్రియాశీలత, ఉపాధి కల్పన వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి జరుగుతుంది. అందువల్ల భారత్‌–ఆసియాన్‌ బ్లాక్‌లు కలిసి మెలసి ముందుకుసాగి తగిన వృద్ధి బాటను చేరుకోవడానికి ఇది తగిన సమయం.

ఆసియాన్‌లో 10 దేశాలివీ...: బ్రునై, కాంబోడియా, ఇండోనేసియా, మలేసియా, మయన్మార్, సింగపూర్, థాయ్‌లాండ్, ఫిలిప్పైన్స్, లావోస్, వియత్నాంలు ఆసియాన్‌ బ్లాక్‌లో ఉన్నాయి. 2009లో భారత్‌–10 దేశాల ఆసియాన్‌ బ్లాక్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్‌టీఏ)పై ఇవి సంతకాలు చేశాయి.


వర్ధమాన దేశాల్ని విస్మరించొద్దు!: రాజన్‌
దావోస్‌: వర్ధమాన దేశాల తోడ్పాటు లేకుండా తాము పురోగమించలేమన్న సంగతి పాశ్చాత్య దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు. పరిస్థితులను సత్వరం చక్కదిద్దకపోతే.. ముక్కలైన ప్రపంచం ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించలేమన్న సంగతి గుర్తెరగాలన్నారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు సందర్భంగా నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో రాజన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాల్లో వయో వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఆయా దేశాలు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వర్ధమాన దేశాల మీదే ఆధారపడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement