ఆస్తి కోటి దాటినా.. రిటర్నులు నాస్తి!

ఆస్తి కోటి దాటినా.. రిటర్నులు నాస్తి! - Sakshi


► 14,000కు పైగా ప్రాపర్టీలపై ఐటీ శాఖ దృష్టి

►  కొనసాగుతున్న విచారణ

► ఆపరేషన్‌ క్లీన్‌ మనీపై ప్రకటన  




న్యూఢిల్లీ: కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులున్నా వాటి యజమానులు కొందరు ఆదాయపు పన్ను రిటర్నులు వేయకపోవటంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఈ కోవకి చెందిన దాదాపు 14,000 ప్రాపర్టీలను పరిశీలిస్తున్నామని, ఆయా కేసుల్లో విచారణ జరుగుతోందని తెలిపింది. నల్లధనంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావాలను వివరించేందుకు జారీ చేసిన ప్రకటనలో ఈ విషయాలు వివరించింది. గత ఐటీ రిటర్నులతో పొంతన లేకుండా... పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీ డిపాజిట్లు చేసిన వ్యక్తుల డేటాకు సంబంధించి జనవరి 31న ’ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐటీ శాఖ తెలిపింది.


‘‘అలాంటివారు లెక్కల్లో లేని ఆదాయం రూ.15,496 కోట్ల మేర ఉన్నట్లు అంగీకరించారు. ఇక సోదాల్లో రూ.13,920 కోట్లు జప్తు చేశాం’’ అని వివరించింది. ఆపరేషన్‌ క్లీన్‌ మనీ ప్రక్రియ తొలి దశలో 18 లక్షల అనుమానాస్పద కేసులను గుర్తించామని,  నాలుగు వారాల రికార్డు సమయంలో ఆన్‌లైన్‌ ధృవీకరణను పూర్తిచేశామని తెలిపింది. డేటా అనలిటిక్స్‌ ద్వారా... 9.72 లక్షల మందికి చెందిన 13.33 లక్షల ఖాతాల్లో రూ.2.89 లక్షల కోట్ల మేర అసాధారణ నగదు డిపాజిట్లు జరిగినట్లు గుర్తించామని తెలియజేసింది. వీటిలో ఎన్ని సిసలైన డిపాజిట్లు, ఎన్ని అనధికారికమైనవి అనేది మాత్రం తెలుపలేదు.



మరిన్ని వివరాలు..

► నోట్ల రద్దు అనంతరం సోదాలు 158 శాతం పెరిగాయి. జప్తు చేసిన మొత్తం రెట్టింపై రూ.712 కోట్ల నుంచి రూ. 1,469 కోట్లకు పెరిగింది.

► ఈ ఏడాది ఆగస్టు 5 నాటికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసే ఈ–రిటర్న్‌లు 2.22 కోట్ల నుంచి 2.79 కోట్లకు పెరిగాయి.

►  2016–17లో కొత్తగా 1.26 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్స్‌ జతయ్యారు. వ్యక్తిగత ఆదాయ పన్ను ముందస్తు వసూళ్లు 41.79 శాతం పెరిగాయి.



రద్దుతో ఆర్‌బీఐ ‘సీనరేజీ’కి దెబ్బ: ఎస్‌బీఐ రీసెర్చ్‌

పెద్ద నోట్ల రద్దు వల్ల రిజర్వ్‌ బ్యాంక్‌కి సీనరేజీ పరంగా నికర నష్టం కలగడంతోపాటు నోట్ల ముద్రణ వ్యయాలు పెరిగిపోయినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఒక నివేదికలో తెలిపింది. కరెన్సీ జారీ, లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా లభించే లాభాన్ని సీనరేజీగా వ్యవహరిస్తారు. ఈ ఏడాదిలో నోట్లు, నాణేల ముద్రణా వ్యయాలు కూడా పెరిగాయని ఎకోరాప్‌ నివేదికలో ఎస్‌బీఐ రీసెర్చ్‌ తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి సందేహాస్పద లావాదేవీల కింద రిపోర్టు చేసిన సందర్భాలు 345 శాతం పెరిగాయని, ఇది భవిష్యత్‌లో పన్ను ఆదాయాలు పెరిగేందుకు తోడ్పడవచ్చని వివరించింది. దీనికి జీఎస్‌టీ కూడా తోడైతే భవిష్యత్‌లో ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడవచ్చని తెలిపింది.


పాత నోట్ల డిపాజిట్‌కు ఇక గడువివ్వం: కేంద్రం

రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లను డిపాజిట్‌ చేయని వారి కోసం మళ్లీ అవకాశమిచ్చేది లేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎన్‌.సి.గర్గ్‌ స్పష్టం చేశారు. నోట్ల రద్దుకు ముందు చాలా కుటుంబాలు వివిధ చెల్లింపుల కోసం పెద్ద నోట్లను తమ వద్దే అట్టిపెట్టుకునేవని, నోట్ల రద్దు తర్వాత అందులో చాలా మటుకు భాగం బ్యాంకుల్లోకి తిరిగి వస్తుందనే ప్రభుత్వం కూడా భావించిందని ఆయన చెప్పారు. అయితే, ఎంత తిరిగి వస్తుందనే దానిపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారని, ప్రభుత్వం మాత్రం నిర్ధిష్ట మొత్తం తిరిగి రాదంటూ ఎప్పుడూ చెప్పలేదని గర్గ్‌ తెలిపారు. రద్దు తర్వాత కేవలం రూ.10–11 లక్షల కోట్లు మాత్రమే తిరిగొస్తాయని అంచనాలున్నాయంటూ అటార్నీ జనరల్‌ తదితరులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top