
12 అంకెల ఆధార్ నెంబర్.. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ. 2017లో పలు వివాదాలు. ఈ నెంబర్‌నే అన్నింటికీ ఆధారం చేస్తూ వెళ్తోంది ప్రభుత్వం. అయితే ఆధార్ వివరాల సేకరణతో వ్యక్తిగత గోప్యతకు కలుగుతుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే 2018లో సుప్రీంకోర్టు నిర్ణయం ఎటువైపు వస్తుంది? అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ సర్వీసులకు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విధంగా నమోదైన పిటిషన్లను సుప్రీంకోర్టు 2018లో విచారించనుంది. వీటిపై ఓ స్పష్టతను కూడా వచ్చే కొత్త ఏడాదిలోనే ప్రకటించనుంది. గోప్యత ప్రజల హక్కుగా పేర్కొన్న సుప్రీంకోర్టు.. ప్రభుత్వం చేపడుతున్న ఆధార్ అనుసంధాన ప్రక్రియను మాత్రం ఫ్రీజ్ చేయలేకపోయింది. ప్రస్తుతం స్టేటస్ క్వోనే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆధార్ అనుసంధానాన్ని మరిన్ని సర్వీసులకు పెంచుతూ పోతుంది. ప్రస్తుతానికైతే ఆధార్ అనుసంధాన తుది గడువును మాత్రం 2018 మార్చి 31 వరకు సుప్రీంకోర్టు పొడిగించింది. ఒకవేళ కోర్టు, ప్రభుత్వం తప్పనిసరి అంటున్న ఈ ఆధార్ లింకేజీకి ఆమోదం తెలిపితే, భారత్‌లో ఆధారే అత్యంత ముఖ్యమైన గుర్తింపు ధృవీకరణగా పరిగణలోకి రానుంది. ఈ ఒక్క నెంబర్‌తోనే అన్ని ప్రభుత్వ పథకాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క ప్రభుత్వ పథకాలు మాత్రమే కాక, ప్రైవేట్ రంగం కూడా ఆధార్‌నే అన్నింటికీ ఆధారం చేసేస్తుంది కూడా.
ఇదే క్రమంలో ఆధార్ వివరాలు సైబర్ క్రైమ్ బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. హ్యాకర్ల బారిని పడకుండా పెద్ద మొత్తంలో ఈ డేటాను భద్ర పరిచేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి సిస్టమ్ లేదు. ప్రభుత్వంతో తేలికగా ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవడానికి, డిజిటల్ ఇండియా డ్రీమ్‌ను సాకారం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. పలు స్థాయిల్లో అవినీతి స్థాయిలను తగ్గించవచ్చు. కానీ హ్యాకర్ల ముప్పు ప్రభుత్వానికి సవాలే.
అదే ఒకవేళ కోర్టు, ప్రభుత్వ సర్వీసులకు ఆధార్ లింక్ తప్పనిసరి కాదని ప్రకటిస్తే... ఆధార్ గుర్తింపు పొందడానికి ప్రభుత్వం ప్రజలను ఒప్పించడానికి నూతన మార్గాలను కనుగొని, స్వచ్ఛందంగా లింక్ చేయడాన్ని ప్రోత్సహించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సర్వీసులకైనా ఆధార్‌ను తప్పనిసరి చేయొచ్చు అనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్సీ అసెసీలకు ఆధార్ తప్పనిసరి చేయడాన్ని జూన్‌లో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ సెక్షన్ కింద ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఇలా కొన్ని సర్వీసులకు ఆధార్ తప్పనిసరి అన్నా కూడా సందేహించాల్సినవసరం లేదు. ప్రైవేట్ రంగం కూడా ఆధార్ వివరాలను ఇవ్వాలని కోరుతోంది. ప్రైవేట్ కంపెనీల రిక్రూటర్లు ఉద్యోగులను నియమించుకోవడానికి ఆధార్ వివరాలను అడుగుతున్నారు. ఇలా 2018లో ఓ వ్యక్తి జీవితం ఆధార్‌పై ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలుస్తోంది.